Friday, 20 February 2026

ఆధ్యాత్మిక పథం 4 వరుస వైఫల్యాలే విజయకేతనాలు 🇳🇵

 

వైఫల్యాలే విజయ సోపానాలు 

మనం కొత్త నిర్ణయాలు పుట్టినరోజు🎂, ఉగాది, దసరా, మ్యారేజి డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇలా తీసుకుంటూ ఉంటాం. 

📍 రోజూ 8 గంటలు నిద్ర 🛌పోవాలి, అది మనస్సుకు ప్రశాంతతను తీసుకవస్తుంది.

📍ఆరోగ్యభరిత జీవనం కోసం రోజు ఓ అరగంట యోగ 🧘 సాధన చేయాలి.

📍 దేహధర్మంగా రోజు ఉషోదయ వేళల్లో ప్రశాంత వాతావరణంలో వాకింగ్ 🏃చేయాలి.

📍దేహదారుఢ్యం కోసం జింలో కనీసం ఓ అరగంట వ్యాయామం 🏋️చేయాలి.

📍మొబైల్ ఫోన్ 📱వాడకం రోజుకు మూడు గంటలే.

📍జీవితభాగస్వామితో నిజాయితీగా వుండాలి.

📍పేరెంట్స్ తో రోజులో ఒక్కసారి అయినా మనస్సు విప్పి📞 మాట్లాడాలి.

📍వారంలో ఒక రోజు పూర్తిగా ఫ్యామిలీ 🧑‍🧑‍🧒తో సరదాగా గడపాలి.

📍చీటికి మాటికి చిరాకు, పరాకు, చిర్రుబుర్రు లాడడం మానివేయాలి💃.


📌ఈ నిర్ణయాలు  ఆచరించడానికి, అమలుపరచడానికి ప్రయత్నం కూడా చేస్తాం,కాని కొన్నిరోజుల్లోనే  ఆ ప్రయతాలను గాలికి వదిలేస్తాం. ఇది ఎందుకు అని ఆలోచిస్తే ఆశయం దృఢంగా కొనసాగించే సంకల్పం లోపించడం అని అర్థం అవుతుంది . అయితే అలవాట్లను మెరుగుపరుచు కోవడం ద్వారా ఈ అడ్డంకులను అధిగమించవచ్చు. ఐతే ఈ అలవాట్లను ఎలా మెరుగుపరచుకోవాలి అన్నదే ముందుండే నిజమైన ఛాలెంజ్? 


✍️ అలవాట్లు మెరుగు పరుచుకోవడానికి, మార్చుకోవడానికి ఏ మంత్రదండం 🧚కాని  షార్టుకట్ కానీ వుండదు, అందుకు కేవలం దృఢమైన సంకల్పం 🧗వుండాలి, అప్పుడు ఆలోచనలు క్రమంగా సంకల్పదిశలో 🌱అంకురిస్తాయి

ఆలోచనలకు మూలాలు సంకల్పాలు!  కాబట్టి మార్పుఅనేది  మన సంకల్పంలో రావాలి. అయితే కేవలం సంకల్పంతో అన్నింటినీ సాధించలేము!!!

అదే సంకల్పంతో మనస్సులో ఇది అసాధ్యం కాదు అనే గట్టి నమ్మకం, విశ్వాసంతో ముందడుగు వేస్తూవుంటే, నీ మస్తిష్కం ఆ ఆలోచన తరంగాలను స్వాగతిస్తూ అదే ధృడవిశ్వాసంతో  ఆ దిశలో నడవడానికి సంసిద్ధం అవుతుంది!!!


📌సంకల్పంతో అంకురించే🌱 దృఢమైన ఆలోచనాతరంగాల సమూహమే చిన్న చిన్న అలవాట్లుగా పరివర్తన చెందుతాయి.. అయితే అలవాట్లలో మార్పులు చాలా నెమ్మదిగా కచ్చితంగా వస్తాయి... సంకల్పలేమి లేని ఆలోచనాచరణ, అమలుతో మార్పు అనేది రోజుకు కేవలం ఒక శాతం అయినా సంవత్సరంలో 360 శాతంగా నీలో వికసిస్తుంది. ఓ నీటి చుక్క 💧 చిన్నదే కానీ కొన్నీ నీటిచుక్కలు💦 కలిస్తే నీ దప్పిక తీరుతుంది, నీ కలల సాకారంలో  అదే విజయకేతనం అవుతుంది. 


💡 చదరంగం (చెస్ )♟️ఆటలో ప్రతిభావంతుడైన  క్రీడాకారుడు కావాలి అనే డ్రీమ్ వుంటే సరిపోదు దానిని సాకారం చేసుకునే దిశలో రోజూ ఆన్ లైన్లో ప్రత్యర్థులతో గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా చెస్ ఆట ఆడాల్సిందే. గెలుపులతో పొందే స్పూర్తి, వైఫల్యంలోని నిరాశ, నిస్పృహలను అధిగమించే మానసిక దృఢత్వం అలవరుచుకోవడం ద్వారా క్రమంగా ధారణశక్తి  వికసిస్తుంది. ఓ సంవత్సరకాలం మెళుకువలు ఇలా మెరుగు పరుచుకుంటూ ముందడుగు వేస్తుంటే ఓ ఛాంపియను 🏆కు కావాల్సిన అర్హత నీ సొంతం అవుతుంది!!


💡 ఐఏఎస్ లేక ఐపిఎస్ అధికారి అనే నీ డ్రీమ్ 💭సాకారం కావాలి అంటే అంకిత భావంతో రోజూ 5 నుంచి 6 గంటలు స్మార్ట్ గా స్టడీస్ వుండితీరాలి. నెమ్మది నెమ్మదిగా వికసిత గ్రాహకశక్తితో మేధస్సు, ప్రజ్ఞలు మెరుగుపడుతూ, ఓ సంవత్సర నిరంతర మెళుకువలతో కూడిన సాధనతో  నీ మస్తిష్కం 🧠అందుకు సర్వసంసిద్ధుడిని చేస్తుంది.


💡 తన 11 సంవత్సరాల చిరుప్రాయంలో  ప్రమాదవశాత్తు అంగవికారాలు అయిన అవని లేఖర ఆ దురదృష్టకర సంఘటన  కలిగించిన బాధ,నిరాశ నిస్పృహలను తన మొక్కవోని మనోబలంతో సమర్థవంతంగా అధిగమించి తన దృఢసంకల్పం, పట్టుదలలతో అత్యున్నత ప్రతిభ షూటింగులో🏹 ప్రదర్శించి 18 సంవత్సరాల వయస్సులో పారఒలంపిక్సులో దేశానికి రెండు 🏅స్వర్ణ పతకాలను సాధించిన తొలి భారతీయ స్వర్ణ మహిళగా ఎందరికో స్పూర్తి, ప్రేరణ అయింది.


⚡థామస్ అల్వా ఎడిసన్ బల్బు ఆవిష్కరణలో కొన్నివేలమార్లు విఫలమయినాడు, కానీ ప్రతి విఫలప్రయత్నం నుంచి స్పూర్తి, ప్రేరణలతోనే ఈ మానవాళికి అత్యుత్తమ ఆవిష్కరణ 💡విద్యుత్ బల్బును అందించారు. ప్రతి విఫలప్రయత్నం తనలో ఓ నూతనఅన్వేషణ మార్గంను అవగతం చేసింది!!


తల్లిదండ్రులుగా మీ పిల్లలు🧑‍🤝‍🧑 ఎదుగుతున్న  వయసులో వారి కొత్త స్నేహాలు, ప్రవర్తనలు, పోకడలను నిశితంగా గమనించాలి.

అవసరమైన ప్రతిసందర్భంలోను సర్దుబాటు ధోరణి  వీడి వారిని సక్రమ నిర్ణయాలతో ముందడుగు వేయించే మార్గదర్శులుగా ఉండాలి

వారిలోని అంతర్గప్రతిభను గుర్తించి ఆ ఇష్టమైన రంగంలో ప్రతిభాపాటవాలను  మెరుగు పరుచుకోవడానికి ప్రోత్సహించండి.

ఆ ప్రయత్నాలలో విఫలం అయితే అవహేళనగా చూడడం వారిలో న్యూనతా భావనలకు నాంది అవుతుంది. విఫలయత్నం నుంచి ప్రేరణ పొందేలా మన ప్రవర్తన ఉండాలి. 

విఫల ప్రయత్నాలు అపజయాలకు సంకేతం కాదు, అవి ప్రతిభను వెలికితీసే గీటురాళ్లు. సాధించబోయే విజయాలకు అవే పునాదిరాళ్లు అనే భావనలకు అంకురం కావాలి.

మీ ఆలోచనలను పిల్లలపై👭 బలవంతంగా రుద్దకండి.చదువుల్లో వారికి ఆసక్తికరమైన కోర్సులను ఎన్నుకునే స్వేచ్చను ఇవ్వండి. వారి ఉజ్వల భవిష్యత్తును ఆకాక్షించండి.


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra  



ఆధ్యాత్మిక పధం 12 కృతజ్ఞతనే నిజమైన నివాళి


కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి?



వ్యక్తిగత సంబంధబాంధవ్యాలను పరిరక్షించడంలో, వ్యక్తిశీల నిర్మాణంలో కృతజ్ఞత కలిగివుండడం క్రియాశీలక పాత్రను పోషిస్తుంది. కృతజ్ఞత అంటే ఇతరులు మనకు చేసిన మేలును లేదా సహాయాన్ని గుర్తుంచుకుని, వారి పట్ల ఆదరణ, ధన్యవాదాలు తెలపడం. అది బలహీన బంధాలను, బాంధవ్యాలను బలోపేతం చేస్తూ సంతోషానికి కారణం అవుతుంది.

కృతజ్ఞతాపూర్వక ప్రశంసలు,అభినందలను మనస్సులో దాచుకోకండి వాటిని సకాలంలో వారికి అందచేయండి, అవి వారిలో నూతన ఉత్తేజాన్నిస్తుంది. అందుకే మీ శ్రీమతి ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తున్న ఆహారరుచులను ఆస్వాదిస్తూ అభినందనలను తప్పక అందచేయండి. 


గో ప్రసాదిత అమృతమే మనం రోజూవాడుకునే పాలు, పెరుగు,వెన్న, జున్ను,నెయ్యి అవి ఆరోగ్య ప్రదాయని. అందుకే హైందవ ధర్మంలో భాగంగా ఆవులను గోమాతగా గౌరవిస్తాం, కొలుస్తాం.  

తల్లి స్తన్యం సరిగా అందకపోతే ఆవుపాలే🍼 చిన్నారులకు అమృతాహారం. అందుకే ఆవును గోమాతగా కొలవడమే కాకుండా గోశాలాలను ప్రోత్సహిస్తూ, అక్కడి ఆవులకు పోషణ అందించడం, గోవధని వ్యతిరేకించడం మనం గోవులకు 🐄 సమర్పించే నిజమైన భక్తిపూర్వక కృతజ్ఞత!

సర్వ భూతస్థ ఆత్మానం, సర్వ భూతని ఆత్మని “ అనే భావన సకల జీవరాశుల యందు కలిగివుంటే ఆ హృదయం కరుణాభరితం, ప్రశాంత భరితం,ఆనంద భరితం అవుతుంది


మనకు నీడ,పండ్లు,ప్రాణవాయువులను అందించే వృక్షాలను 🌳సంరక్షించడం, పెంచడం పర్యావరణాన్ని పరిరక్షించడం మన కనీస బాధ్యత. “వృక్షోరక్షిత రక్షితః “  రక్షింపబడిన వృక్ష సంపద మనలని తల్లిలా, తన జీవిత కాలం పక్షులకు ఆవాసంగా, జీవనాంతరం కలపగా 🪵మన అవసరాలను తీరుస్తూ సంరక్షిస్తుంది. 

కాలికి ముల్లు గుచ్చుకుంటే కంటినుంచి కన్నీరు 😢 వస్తుంది, అదే విధంగా ప్రకృతి ప్రకోపిస్తే రక్షింపబడని వృక్షసంపద కరువుకాటకాల రూపంలో మానవాళిని శిక్షిస్తుంది.విచక్షణరహితంగా నీడను ఇచ్చే మహావృక్షాలను నగర పారిశ్రామికీకరణలో భాగంగా తొలగించుకుంటూ పోవడంతో నేడు మహానగరాలు వాతావరణ కాలుష్యకోరలలో నగరవాసులు తీవ్ర అనారోగ్యా సమస్యలకు లోనవుతున్నారు.


అనారోగ్యంతో ఐసీయూలో ఆక్సిజన్  మీద వున్నపుడు ప్రతివృక్షం తల్లిలా ఏమీ ఆశించకుండా తన జీవితకాలం ప్రాణవాయువులను సకల జీవరాశికి మరియు మానవాళికి అందచేస్తూ వాటిమనుగడకు ఆధారభూతంగా శ్రేయస్సునే కోరుకుంటుంది అనే తత్వం బోధపడుతుంది. అందుకే ప్రతి ముంగిట ఒక కొత్త మొక్కను పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత సమిష్టిగా మనందరిది. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామిగా మనం క్రియాశీలక పాత్రను కలిగి వుండడం మనం వృక్షసంపదలపట్ల కృతజ్ఞతపూర్వక నివాళి!!


జీవధార, జీవనాధార అయిన నదీజలాలను, 🌊మంచినీటి చెరువులను, కుంటలను, దిగుడు బావులను, భూగర్భ జలవనరులను సంరక్షించడం, రసాయనిక వ్యర్థాలను సాగునీటిలో కలవనీయకుండా నిరోధించడం, నీటివాడకంలో వృథాగాకుండా పొదుపుగా వాడడం, వేసవి కాలంలో చలివేంద్రాలతో బాటసారుల దప్పిక తీర్చడం, మూగజీవాల దప్పికను గుర్తించి వాటికి త్రాగునీరు అందించడం…ఇవే ప్రకృతి ప్రసాదిత జలాలపట్ల మనం చూపించే నిజమైన నివాళి!


కంటికి కనిపించని, అసలు వున్నాడా, లేడా అనే సందిగ్ధంలో అప్రమేయుడు, అవ్యయుడు, ప్రత్యాగాత్మ,సర్వాంతర్యామి అయిన ఆ సృష్టికర్తకు కృతజ్ఞతాంజలి ఎందుకు సమర్పించాలి?  ఏమని సమర్పించాలి? ఎలా సమర్పించాలి? అనేది హేతువాదుల మదినితొలచే ప్రశ్నల పరంపర.. ఇది వారిలోని మూఢత్వానికి పరాకాష్ట మాత్రమే, ఎందుకంటే..

  • లక్షలాది స్వేదరంధ్రాలు వున్న శరీరం నుంచి చుక్క నీరు కూడా లీక్ కాదు అంతటి అద్భుత వ్యవస్థను ప్రసాదించిన అప్రమేయుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. 
  • వాటర్ ప్యూరిఫయర్ సమర్థత కోసం వాటర్ పిల్టర్స్ ను రెగ్యులర్ గా మారుస్తూ వుంటాం, కానీ కిడ్నీలు జీవితాంతం మార్చనవసరం లేకుండా రక్తాన్ని శుద్ధి చేసే నెఫ్రాన్ వ్యవస్థను అందించిన విశ్వంభరుడికి కృతజ్ఞత నివాళిని సమర్పించాలి
  • నీటి సరఫరా సాఫీగా వుండాలి అంటే నీటి పైపులను తరచు మారుస్తూనే ఉండాలి, కానీ జీవితాంతం రక్తప్రసరణ చేసే రక్తనాళాలు తన విధులను నిరాటంకంగా నిర్వసిస్తువుంటాయి అయితే, గుండెకు 🫀 రక్తప్రసరణ చేసే నాళాలకు అడ్డంకి కలిగిస్తూ కొవ్వు చేరుకోవడం ద్వారా బ్లాక్ అయిన నాళాలతో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకునే వ్యక్తిని పరామర్శించేపుడు,  మనం ఎందుకు ఆ పరమాత్మకి హృదయ పూర్వక కృతజ్ఞతలు సమర్పించాలి అనేది అవగతం అవుతుంది.
  • షడ్రుచుల సమ్మేళనంతో కొన్ని వేల రుచులను గ్రహిస్తూ ఆస్వాదించే నాలుక 👅 విలువ నోటి క్యాన్సర్ భాదితుడిని చూసినతర్వాత ఆ అద్భుత జిహ్వరుచిని ప్రసాదించిన పరమేశ్వరునికి రెండుచేతులతో నమస్కరిస్తూ కృతజ్ఞతను ప్రదర్శించాల్సిందే!
  • చిటపట చినుకులు , పిల్లగాలులు, సమ శీతోష్ణ ఆహ్లాదకర వాతావరణంలో,చిరుజల్లులకు పులకరించే మదిలోని అనుభూతుల మధుర భావనలను కలిగించే ప్రకృతిమాతకు కృతజ్ఞత కుసుమాలతో ఆరాధించాల్సిందే! 
  • ఖరీదైన మొబైల్ 📱కూడా బ్యాటరీ 🔋చార్జింగ్ లేకుంటే పనిచేయదు, కాని మన జీవితకాలం ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేకుండా పనిచేసే బలమైన, దృఢమైన గుండెని బహూకరించిన ఆ జగన్నాథుడికి కృతజ్ఞత తెలియచేయాల్సిందే!
  • ఏ వాద్యపరికరం అన్ని శబ్దాలను పలికించలేదు,కానీ సప్తస్వరాలనే కాదు, అసంఖ్యాకంగా వివిధ శబ్దాలను అలవోకగా పలికించగలిగిన స్వరపేటికను బహుకరించిన ఆ స్వరకర్తకు కృతజ్ఞతాపూర్వకంగా వుండాల్సిందే!
  • ఏ పరికరం 🎧కూడా అన్ని శబ్దాలను వాటి అర్థాలను గ్రహించలేదు,కానీ చెవి అన్ని శబ్దాలను, ముఖ్యంగా ఆడవారి మాటల అంతరార్ధంను కూడా గమనించగలిగిన ప్రభావశీలి అందుకే ఆ అవ్యయుడకు కృతజ్ఞత చూపించాల్సిందే!
  • ఎంత ఖరీదైన కెమేరా 📹అయినా పరిమితమైన మెగాపిక్సెల్స్ తో దృశ్యాన్ని వీక్షించగలదు, కానీ మన నేత్రద్వయం 👀వీక్షణ నాణ్యతకు సరిసమానమైన కెమెరా లేనేలేదు అందుకే అంతటి అపురూప దృష్టిని అనుగ్రహించిన ఆ అవ్యక్తుడకు కృతజ్ఞత కుసుమాలను సమర్పించాల్సిందే!
  • అపురూప,అపూర్వ,అనన్య సంపదలుగా ప్రజ్ఞ,మేధస్సుల నిలయమై తార్కిక, విచక్షణ, వివేక, జ్ఞానల కేంద్రంగా అత్యద్భుత అంతర్గత వ్యవస్థకు ఆనవాలంగా విరాజిల్లుతున్న మస్తిష్కం 🧠ఇతర జీవరాశులనుంచి ప్రత్యేకతను సంతరించుకున్న ఈ మానవదేహంలో ప్రధాన అవయవం. అటువంటి అనన్యనిధిని బహుకరించిన ఆ పరబ్రహ్మకు కృతజ్ఞతాభావనతో శిరస్సు వంచి నమస్కరించాల్సిందే!

అమూల్యం, అవ్యక్తం, అనంతం అయిన ఈ అపురూప సంపదల నిధులను అందించిన ఆ సర్వాంతర్యామికి సదా, సర్వదా మనసా,వాచ, కర్మణా కృతజ్ఞత పూర్వక భావనతో నివాళులు అర్పించాలి.


సర్వేజనా సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 


Thursday, 19 February 2026

ఆధ్యాత్మిక పధం 11 అహింసా పరమో ధర్మః

అహింసా పరమో ధర్మః 


ధర్మపరిరక్షణ కోసం చేసే హింస, ప్రయత్నం, కార్యం అహింసనే అవుతుంది.రక్షింపబడిన ధర్మం మనల్ని రక్షిస్తుంది.  రక్షింపబడని ధర్మం అది తప్పక శిక్షిస్తుంది. 

ధర్మానికి హాని కలిగిస్తూ ధర్మగ్లానికి కారణమైన ప్రతి ప్రయత్నంను హింసగనే పరిగణించాలి.

ఉగ్రవాదంకి విఘాతం కలిగించిన ఆపరేషన్ సింధూర్ ధర్మగ్లానికి గుణపాఠం, ధర్మ పరిరక్షణే! 

మహా భారతంలో   “అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తదైవచ.” గా ప్రబోధించబడిన విద్వత్ శ్లోకం.  మన ధర్మాలకు, విశ్వాసాలకు, నమ్మకాలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వారికి తగిన గుణపాఠం నేర్పించవలసిందే!!

హింస అంటే కేవలం జంతువులను హింసించడం అనేది మనలో సామాన్య భావన. 

అహింసాచరణ ధర్మం విస్తృతమైన, శ్రేష్ఠమైన, ఉత్కృష్టమైన ఆచరణ పూర్వక సామాజిక జీవన విధానం, బహుముఖ ప్రభావశీలి, ప్రజ్ఞాశాలి. ఇంతకి ధర్మం అంటే ఏమిటి…

  • ధర్మం అంటే సకల జీవరాశి పై చూపించే కరుణ, ఔదార్యం.
  • ధర్మం అంటే ఈ విశాలసృష్టి మనుగడకు ఆధారం.
  • ధర్మం అంటే మానవత్వాన్ని పరిరక్షించే మార్గదర్శి.
  • ధర్మం అంటే నీతివంతం, ఆదర్శప్రాయం, సత్యవంతమైన జీవనవిధానం.
  • ధర్మం అంటే ప్రవర్తనానియమావళి.
  • ధర్మం చైతన్యవంతం, స్వయం ప్రకాశితం.
  • ధర్మం అంటే జీవిత లక్ష్యం మరియు పరమావధి.
  • ధర్మం అంటే వ్యక్తిగత మరియు కుటుంబవ్యవస్థల శ్రేయస్సు.
  • ధర్మం అంటే సామాజికహితంని ఆకాంక్షించే జీవనసరళి.
  • ధర్మం అంటే అనాదిగా మానవ సంఘం పాటించే కట్టుబాట్లు.

హైందవసమాజం ఈ సనాతనధర్మంని అనుసరిస్తున్న అతి ప్రాచీన సజీవ మానవనాగరికతకు సాక్ష్యంగా నిలిచింది. సింధు, హరప్పా నాగరికతలకు ఆలంబనగా నిలిచింది. బౌద్ధ మత ఆవిర్భావానికి, సిక్కు మరియు జైన సంప్రదాయాలకు కూడా మూలం అయింది. నేటికి సజీవ ఆచరణతో హిందు ధర్మంగా ప్రపంచంతో కీర్తింపబడుతున్న అపురూప జ్ఞాననిధి!

సత్యం, దయ, తపస్సు, దానం అనే ప్రధాన విలువల ఆధారంగా ధర్మం స్వయం ప్రకాశవంతం.

సమాజంలో ప్రతివ్యక్తి కుల,మత ,వర్గ రహితంగా అనుసరించ వలసిన కర్తవ్య నిర్వహణ విధానం.

ధర్మాన్ని సామాన్యధర్మం మరియు విశేషధర్మంగా వర్గీకరించవచ్చు, అందరికీ వర్తించేవి సామాన్య ధర్మం. పాలకులకు వర్తించే న్యాయపరిరక్షణ , దండన , శిక్షణ విశేష ధర్మం. 

సామాన్య ధర్మాచరణ ప్రవర్తన నియమావళిని అనుసరించి నిర్వర్తించే జీవన సరళీకృత విధానం!

  • గృహస్థు ధర్మం: ప్రతి గృహస్థుడు ఏకపత్నీవ్రతం ఆచరిస్తూ నిత్యం నిర్వహించవలసిన పంచ మహాయజ్ఞాలు 
    • దేవ యజ్ఞం:సకల మానవవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పరమాత్మ ఆశీస్సుల కోసం చేసే పూజలు, క్రతువులు,యజ్ఞాలు.
    • బ్రహ్మ యజ్ఞం: జ్ఞానార్జన కోసం  చేసే స్వేచ్ఛా యజ్ఞం మరియు వేద పారాయణం.
    • పితృ యజ్ఞం: పితృ దేవతలకు శ్రద్దాంజలి ఘటించడం 
    • భూత యజ్ఞం: పశు పక్ష్యాదుల మనుగడను, పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ చేసే కార్యాలు.
    • మనుష్య యజ్ఞం:  అతిథులకు,అన్నార్తులకు అందించే అన్న ప్రసాదం.
  • గృహిణి ధర్మం:ప్రతి ఇల్లాలు తన భర్త నిర్వహించే ఈ యజ్ఞ క్రియలలో తన కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కుటుంభపోషణను భాధ్యతాయుతంగా నిర్వహించడం.
  • మాతృ ధర్మం: తన సంతానంను ప్రేమ, అనురాగం,ఆప్యాయతలతో పెంచి పోషించడం.
  • పితృ ధర్మం: తన కుటుంబబాధ్యతలను న్యాయసంపాదనతో నిర్వహించడం.
  • గురు ధర్మం : భేదభావరహితంగా శిష్యులందరికి సమవిద్య బోధన చేయడం .
  • శిష్య ధర్మం: గురువు యందు భక్తి శ్రద్ధలతో, వినయవిధేయతలతో విద్యాభ్యాసం చేయడం.
  • వృత్తి ధర్మం: పాలకులు, పురోహితులు, వైద్యులు, వ్యవసాయదారులు,వ్యాపారస్తులు,రక్షక భటులు,ఇతర కులవృత్తులు ఆచరించే వారు తమరంగాలలో సమాజ హితం కాంక్షిస్తూ లోక శ్రేయస్సును తమ వృత్తి ధర్మంగా స్వీకరించి తమ బాధ్యతలను నిర్వహించడం. 

జ్ఞానులు, కర్మ యోగులు, సాధువులు,జిజ్ఞాసువులు ఆచరించే జీవనసరళి సప్తధర్మవేదిక . అవి పవిత్రత, నిగ్రహం, దాతృత్వం, శ్రద్ధ, దయ, ఓర్పు, అపరిగ్రహాచరణ.

మనం మాట్లాడే మాటలు కఠినత్వం, కోపం, ద్వేష పూరితమయితే అది వాచక హింస. మాటల్లో మృదుత్వం, ఆప్యాయత, సౌభతృత్వం కలిగిన ప్రియభాషణం అయితే అది వాచక అహింసాచరణ అవుతుంది.

మనమాట ప్రాణం పోసే అమృతంలా ఉండాలి...ప్రాణం తీసే విషంలాకాదు గదా!

మన ఆలోచనలు, భావనలు, ఆకాంక్షలు మొహపూరితమై ఇతరులకు హాని కలిగించేవి అయితే అది శారీరక హింస. ఉపకారం,సానుభూతి,దయ, ప్రేమ, మనోనిగ్రహం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం శారీరక అహింసాచరణ అవుతుంది. ఒకరికి ఇష్టం లేని పని బలవంతంగా చేయించకపోవడం మనం ఆచరించాలి. మనసా,వాచా,కర్మణా ఇతరులకు హాని కలిగించే పనులను చేయకపోవడం అహింసాచరణ అవుతుంది. 

ఏ ప్రవర్తనానియమావళి , మూల సూత్రాలు , మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత , సామాజిక , మతపర జీవితం సజావుగా నడపబడుతుందో , ఏ కారణముచే సర్వ జీవజాలం , ప్రకృతి లోని ప్రతి పదార్థం , శక్తి ఒక దానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాదిస్తాయో, బ్రహ్మాండం అంతా విస్తరించి తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో  అదే ధర్మంయొక్క స్వరూపం. ధర్మానికి వేదాలు ప్రామాణికాలు. వేదాలు ఉపనిషత్తుల సారాంశం. అవి అపౌరషేయాలు, శృతులుగా గురుపరంపరగా ముందుతరాలకు చేరిన విజ్ఞాన నిధులు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాలుగా లిఖించబడినాయి. ఈ వేద సాహిత్యం ప్రంపంచంలోని అన్ని ప్రాథమిక భాషలలో లభ్యమవుతాయి. అంతర్జాలంలో వేదజ్ఞానంగా అన్నిభాషల్లో వీక్షించవచ్చు.

సర్వేజనా సుఖినోభవంతు.

మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 


ధ్యానమాలిక ఆధ్యాత్మిక మాసపత్రిక జనవరి 26 సంచికలో ప్రచురితమయినది.




ఆధ్యాత్మిక పధం 9 జ్ఞాన, విజ్ఞానస్వరూపమే పరమాత్మ!!


జ్ఞాన, విజ్ఞానస్వరూపమే పరమాత్మ!!


మనం తరచుగా వినేది , మాట్లాడుకునేది, తెలుసుకోవాలి అనే కుతూహలంని జిజ్ఞాసని యోగులలలో , వేదాంతులలో, మేధావులలో, పండితులలో, కళాకారులలో మరియు సామన్యులలో కూడా ఆసక్తిని, ఉత్కంఠతను కలిగించేది “జ్ఞానం” 

  • జ్ఞానం అంటే ఏమిటి?
  • జ్ఞానం ఎలా వుంటుంది?
  • జ్ఞానం ఎక్కడ ఉంది?
  • జ్ఞానం ఎలా సంపాదించాలి?
  • జ్ఞానం మనలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందా?
  • జ్ఞానం సంపాదించుకుంటే ఇక వేటి అవసరం వుండదా?
  • జ్ఞానం నిజంగా ప్రభావశీలినా?
  • జ్ఞానం విజ్ఞానం రెండు ఒకటేనా?


ఆకర్షణీయమైన, అందమైన శిల్పాన్ని చూసిన ఎవ్వరి మనస్సైనా అలౌకిక ఆనందానుభూతిని పొందుతుంది. అలాంటి  అరుదైన అపురూప శిల్పాన్ని ఓ శిల్పారామంలో చూసి అక్కడే ఉన్న రూపశిల్పిని సమీపించి చిరునవ్వుతో అతని సృజనాత్మకను అభినందించగా ఆ శిల్పీ వినయంతో, వినమ్రంగా అందులో తన ప్రతిభ ఏ మాత్రంలేదని అందం అనేది సహజంగానే ఆ శిలలోనే ఒదిగి అంతర్గతంగా మన దృష్టికి అందనంతటి దగ్గరిగా ఉంది, దానిని కేవలం తన అంతర్ దృష్టితో స్పర్శిస్తూ తన చేతిలోని పనిముట్లు సుత్తి, ఉలిసహాయంతో మృదువుగా స్పర్శిస్తూ అవసరంలేని శిలాభాగాలను,వ్యర్థాలను పరిశీలించి మృదువుగా, సున్నితంగా వేరుచేశాను,అంతే అన్నారు. 

అదే విధంగా జ్ఞానం అనేది అంతర్వాహినిగా మనందరిలో వుంది, అయితే మసకబారిన దీపకాంతి ఎలా ఉంటుందో అదే విధంగా మనలోని జ్ఞానజ్యోతి అహం , కామం, క్రోధం, లోభం ,మొహం అనే అజ్ఞానంలతో ఆవరించి మసకబారివుంది.  లాంతరు చిమ్నీని ముగ్గుపొడితో శుభ్రపరిస్తే ఆ దీపకాంతి తిరిగి ప్రకాశిస్తుంది. అదేవిధంగా అజ్ఞాన భరితం అయిన అహం, కామం,క్రోధం,లోభం,మొహం అనే సమిధలు జ్ఞానాగ్నిలో దగ్ధంచేస్తే వేపదుంగ లాంటి ఈ దేహం రత్నభేది ఆసనంగా ఉపస్థితమైన పవిత్ర వేపదుంగగా, పరమ పవిత్రంగా చెక్కబడిన దేవతామూర్తి జగన్నాథ సాకారరూపం అవుతుంది. 

కంటికి కనిపించే విశాలంగా విస్తరించిన పర్వతశ్రేణులు, సూర్యుడు ,భూమి, సముద్రుడులకు మించిన పెద్దవీలేవు అనుకునేది సామాన్యజ్ఞానం, ఐతే వాటికంటే అతి పెద్దది మనవెంటనే వుండేది, మనతోనే వచ్చేది , జన్మజన్మలనుంచి వెన్నంటి తోడునీడగా ఉన్నవి ప్రారబ్ధకర్మలు . అవి గతంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న , చేయబోయే పాపకర్మల ఫలాలు. వీటిని అజ్ఞానం నిత్యం మహారాజపోషకులుగా పోషిస్తువుంటుంది. నిజానికి ఈ పాపప్రక్షాలనే  మానవ జీవితంకు సార్ధకత,  పరమావధి, పరమలక్ష్యం. అయితే మోహబంధం, విడదీయరాని సంసారబంధంతో చిక్కుకొన్న మనం ఆ లక్ష్యాన్ని  తెలిసికూడా  నిర్లజ్జగా ప్రవర్తిస్తుంటాం.


కర్మ అంటే ఏమిటి? 

కర్మ అంటే మనం రోజూ చేసే పనులు. అవి చెడ్డపనులయితే దుష్కర్మలుగా, మంచిపనులయితే సత్ కర్మలుగా, ప్రతిఫలాపేక్షరహితకర్మలయితే నిష్కామకర్మలుగా అవుతాయి.

ప్రాణం పోసేది మందు, ప్రాణం తీసేది కూడా మందే! పేర్లు ఒకటే అయినా గుణంలో తేడా, అదే విధంగా కర్మలు వాటి ఫలాలు, ఫలితాలు కూడా ఉంటాయి.

దుష్కర్మల ద్వారా పాపంవస్తుంది. సత్ కర్మల ద్వారా పుణ్యంవస్తుంది. నిష్కామ కర్మల ద్వారా పరమాత్మతత్వం అయిన జ్ఞానానికి అవి కరదీపిక అవుతుంది.

కేవలం స్వప్రయోజనాలను ఆశిస్తూ ఇతరులకు హానికలిగించే ఏ కర్మలు అయినా పాపకర్మలే అవుతాయి. ఆ కర్మఫలాలు తప్పక అనుభవించి తీరాల్సిందే! 

దయ, కరుణ, ప్రేమతో ఆచరించే దానధర్మాలు, సేవాకార్యక్రమాలు, సామాజికసేవలు వంటి సత్ కర్మల ద్వార పుణ్యం లభిస్తుంది. వీరి ప్రవర్తన,ఆలోచనలు ఇతరులకు హానికలిగించనివిగా ఉంటాయి అందువలన అవి పాపకర్మలు, ప్రారబ్ధకర్మల ప్రభావాన్ని  తగ్గిస్తాయి.

మనం చేసే ఏ కార్యలు అయిన లోకకల్యాణం, జనహితం, సమాజశ్రేయస్సుని ఆశిస్తూ కొనసాగిస్తే అవి యజ్ఞక్రియలవుతాయి అవే నిష్కామకర్మలుగా మనలోని పాపకర్మలను ప్రక్షాళన చేస్తూ విజ్ఞానకుసుమాలుగా అంతరంగంలో వికసిస్తాయి.

నిష్కామకర్మాచరణ గత జన్మల పాపకర్మలఫలాలను కూడా దగ్ధం చేసే ప్రభావశీలి! నీవు చేసే ప్రతికర్మ భక్తి, శ్రద్ధ, ప్రీతి, నిష్ఠ, సంపూర్ణ విశ్వాసంతో ప్రతిఫలాపేక్షరహితంగా ఆచరించాలి.

అవ్యయుడు, అప్రమేయుడు, విశ్వంభరుడు, ప్రత్యాగాత్మ, సర్వాంతర్యామిని అంతర్యామిగా మనోక్షేత్రంతో వీక్షించే హృదయద్వారాన్ని అవగతం చేసే శక్తిదాయని నిష్కామకర్మాచరణ.

భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ మానవాళికి ఈ సత్యాన్ని 

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన , మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణిఅని ప్రబోధగీతంగా మార్గదర్శనం చేశారు.

ఈ నిష్కామకర్మాచరణ నీలో విజ్ఞానాచరణ మార్గంని సుగమం చేస్తుంది. 

కత్తి 🔪అన్నింటి కంటే పదునైనది ఎందుకంటే  అది ప్రతి వస్తువును ముక్కలు ముక్కలుగా తరిగేస్తుంది అనేది సామాన్య జ్ఞానం. వాస్తవానికి ఆ కత్తి కంటే పదునైన ఆయుధం 👅నాలుక అది తన మాటలలో అహాన్ని ప్రదర్శిస్తూ ఇతరుల మనస్సును హింసించగలదు, గాయపరచగలదు, నమ్మకాలను, విశ్వాసాలను తమ మాటలతో విరిచేయగలదు!!!

మాటల్లో కరకుదనం, పొగరు, గర్వం, అహంకారంల నుంచి దూరంగా సౌమ్యం, ఆప్యాయత, మృదుత్వం కలసిన ప్రియభాషణమే వాచక అహింసాచరణ, అది నిన్ను అందరివాడిని చేస్తుంది. అదే విశేష జ్ఞానం. అందుకే ఆలోచించి సౌమ్యంగా మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ప్రియభాషణం విజ్ఞానదిశగా అడుగులు వేయిస్తుంది. మాట అనేది మరణించేవాడిని కూడా మృత సంజీవనిలా బతికించేలా ఉండాలి కానీ, బతికి ఉన్నవాడిని మానసికంగా చంపే కత్తికాకూడదు.

మనకు అత్యంతదూరంలో ఉండేవి చంద్రుడు , సూర్యుడు , గ్రహాలూ అనేది సామాన్య జ్ఞానం ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా అక్కడకు చేరుకోలేని సుదూరంలో వున్నాయి . అయితే మనకు అత్యంత దూరంలో వుండేది  తిరిగి తీసుక రాలేనిది ⏳గడిచిపోయిన కాలం అదే విశేష జ్ఞానం. గతం గురించి బాధపడకండి దాన్ని మార్చలేము, భవిష్యత్తు గురించి ఆలోచించకండి అది ఇంకా రాలేదు, అందుకే వర్తమానంలో జీవించాలి, సమయం తిరిగిరాదు మిత్రమా! 

వర్తమానంలో నిర్మాణాత్మంగా సత్కర్మలతో, సత్సంకల్పాలతో, సద్భావనలతో, అనన్య చింతనతో, భక్తినిష్ఠలతో పరమానందభరిత జీవితంగా కొనసాగించాలి. ఈ విశేష జ్ఞానం దశ,దిశలను నిర్దేశిస్తూ అలౌకిక ఆనందమార్గానికి ద్వారం అవగతం చేస్తుంది. 

ఈ రోజునుంచే మన ఆలోచనలలో, మాటలలో, పనుల్లో స్వచ్ఛత ప్రతిబింబించేలా మన ద్వారా ఎవరికి అపకారం జరగకుండా వుండేలా మన నడవడిక, ప్రవర్తనలను సవరించుకోవాలి.

  • వార్ధక్యదశని స్వాగతించండి అది ఒక శాపంగా భావించకండి, ఇది మానసిక పరిపక్వత. అది ఎవరిమీద అపేక్ష లేకుండా, ఇతరులపై ఆధారపడకుండా స్వాభిమానంతో జీవించడం నేర్పుతుంది. నీవు నిత్యవిద్యార్థివే!! 
  • జీవితంలో జరిగే కొన్ని విషయాలు మనసుకి తీసుకొని బాధ పడకుండా వాటిని మరచిపోయి ముందుకెళ్లడం మంచిది.
  • కుటుంబ బంధాలు, సంబంధాలు శాశ్వతంగా దృఢంగా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. క్షమను కోరడం బలహీనత కాదు అది బలోపేతం చేసే బంధం.
  • కుటుంబవ్యవస్థ అంటే భార్యభర్తలుగా కలసి ఉండడమే కాదు, కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై ఎదురైనా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ కడవరకూ తోడు నీడలా వీడని అపురూప బంధం. 
  • అభిప్రాయభేదాలు లేని బంధం కన్నా అభిప్రాయభేదాలతో ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధమే నిజమైనబంధం.

ఈ ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది అంటే వజ్రము,ఇనుము,ఏనుగు అని భావించడం అనేది సామాన్య జ్ఞానం.వీటి కంటే కఠినమైనది వాగ్దానం. వాగ్దానం చేయడం చాలా తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. దశరథుడు వాగ్దాన నిర్వహణలో తీవ్ర మానసిక క్షోభతో ప్రాణత్యాగం చేశాడు. 

అందుకే సంతోషంలో ఉన్నప్పుడు ఎటువంటి మాట ఇవ్వకండి. నీవు ఏ రంగంలో ఉన్నా, అందులో రాణించాలి అంటే ఆలోచించి మాట ఇవ్వాలి,అంతే కానీ మాట ఇచ్చి ఆలోచించడం కాదు అది నిన్ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ ధోరణి వలనే పైనాన్స్, బ్యాంకింగ్,మేనేజ్మెంట్ లాంటి సేవారంగాల్లో లక్ష్యాలు అందుకోవడంలో ఉద్యోగస్తులు తీవ్రఒత్తిడికి లోనవుతున్నారు. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది. 

నీవు ఆచరిస్తున్న విశేషజ్ఞానమే విజ్ఞానం. అది దప్పికతో అలమటించే మృగతృష్ణ కాదు, అది నీ దాహం తీర్చే ఒయాసిస్ లాంటిది.


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

🧘🧘🧘🧘🧘🧘🧘🧘 


https://yogamithra15.wixsite.com/yogamithra









ఆధ్యాత్మిక పధం 10 అనన్యభక్తి , అనన్యచింతనలే పరమాత్మకు నీరాజనం !!!

అనన్యభక్తి , అనన్యచింతనలే పరమాత్మకు నీరాజనం !!!


మనందరం అవ్యయయుడు,అప్రమేయుడు,విశ్వంభరుడు,సర్వేశ్వరుడు అయిన ఆ పరమాత్మ యందు భక్తి,శ్రద్ధలతో వినయ,విధేయతలను కలిగి ఉంటాం. ఆయన సేవలో తరించడానికి శ్రద్ధాసక్తులను ప్రదర్శిస్తాం. పూజలు, వ్రతాలు, నోములు, క్రతువులు, హోమాలు, యజ్ఞాలు, ప్రార్థనలు, కానుకలు,ధూప దీప నైవేద్యాలు, అన్నసంతర్పణలు సమర్పిస్తాం. ఇవి భక్తిని ప్రదర్శించడానికి మనం ఎన్నుకున్న వివిధ రూపాలు.


భక్తిని ప్రదర్శించడంలో మనందరం ఆర్తులమే!! మనం కష్టాల్లో, ఆపదల్లో, అనారోగ్యాల్లో వున్నప్పుడు, పరీక్షలు, ఇంటర్వ్యూలకు వెళ్లే సందర్భాల్లో మరియు ఇతర అనేక అవసర సమయాల్లో ఇష్టదైవం జ్ఞాపకంలోనికి వస్తుంది. ఆ విపత్కరపరిస్థితులను అధిగమించడానికి తమ దైవాన్ని ఆపద్బాంధవుడిలా వేడుకొంటారు, ప్రార్థిస్తారు వెనువెంటనే ముడుపులు కడతారు, ఉపవాసాలు చేస్తారు, పూజలు చేస్తారు,  మొక్కుబడులను సమర్పిస్తారు. 

అయితే వీరిలో భక్తి వున్నా అది అన్యభక్తి , అన్యచింతన మాత్రమే ! అది వారి మనస్సుల్లా చంచలంగా ఉంటుంది!  

ఈ భక్తిని ప్రదర్శించడంలో ఇంకొందరు అర్థార్థులు. వీరు కేవలం సంపదలకోసం, సంపాదనలకోసం, కీర్తికాంక్షలకోసం, పదవులకోసం, పదోన్నతులకోసం, తమ అహం ప్రదర్శించడానికి ఆడంబరంగా పూజలు, హోమాలు, క్రతువులు నిర్వహిస్తుంటారు. అందరినుంచి మెచ్చుకోలు మాటలు ఆశిస్తువుంటారు. వీరిలో దేవుని యందు భక్తి కంటే ఇచ్చి పుచ్చుకొనే వ్యాపారధోరణే కనిపిస్తుంది.

వీరు పూజలు 🪔 చేసేప్పుడు దేవుడు వింటాడు అనే నమ్మకంతో చేస్తూవుంటారు!!

అదే ఇతరులకు హాని, ద్రోహం, మోసంచేస్తూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ దేవుడు ఎక్కడ చూస్తాడులే అని అనుకుంటారు!!!  ఇది కపట భక్తి, వీరు చేసే పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు,క్రతువులు వంటివి ఎండమావిలో దప్పిక తీర్చుకోవడం లాంటివి.

నీళ్లు లేని బావి, కళ్లు లేని శరీరం, పళ్లు లేని చెట్టు, దీపం లేని ఆలయం ఎటువంటివో వీరి భక్తి కూడా అటువంటిదే!

అయితే మన ప్రార్థనల్లో, కోరికల్లో నిజాయితీ, నిబద్ధత,ధర్మం, ఆర్తీ ఉంటే కరుణామయుడు, ప్రేమమయుడు అయిన ప్రత్యగాత్మ వాటిని సాధించుకునే మనోస్థైర్యంను అనుగ్రహిస్తాడు, ఆ దిశలో నిన్ను నడిపిస్తాడు. మనందరం దైవం యందు భక్తి, శ్రద్ధ, ప్రీతి, విశ్వాసంలతో ఆ పరమాత్మను సేవించి తరించాలి. భక్తిపూర్వకంగా సమర్పించిన పత్రం,ఫలం, పుష్పం, తోయంలలో దేనినైనా దైవం ప్రీతితో స్వీకరిస్తాడు.

ఏక భక్తి పూర్వక ప్రేమనుప్రదర్శించవలసిన అవసరం లేదు,అది అంతరంగ భావన. 

నిజానికి భక్తి అంటే ఏమిటి? అప్రమేయుడు, అవ్యయుడు,సర్వాంతర్యామి,సర్వేశ్వరుడు అయిన పరమాత్మను  అంతర్దర్శనం చేసుకునే దివ్యానుభూతి. అందుకే…

భక్తి అంటే సమర్పణ భావం.

భక్తి అంటే అంకితభావం .

భక్తి అంటే అచంచల విశ్వాసం.

భక్తి అంటే అనన్య చింతన .

భక్తి అంటే పరమాత్మ కోసం చేసే నిరీక్షణ .

భక్తి అంటే నిత్యయుక్తత్వం.

భక్తి అంటే స్మరణం.

భక్తి అంటే శ్రవణం.

భక్తి అంటే అనన్య దృష్టి.

భక్తి అంటే సంయమనం.

భక్తి అంటే సర్వం సమర్పణ.

భక్తులలో ఎవరో ఒకరు భగవతత్వంని గురించి తెలుసుకునే జిజ్ఞాస కలిగివుంటారు. వారు జిజ్ఞాసువులు. వారు సత్యాన్వేషణలో, పరమాత్మ అన్వేషణలో, సత్యశోధనలో జీవితాన్ని పణంగా పెడతారు.  భగవంతుని యందు శ్రద్ధ, నిష్ఠ, ప్రీతి, సంపూర్ణ విశ్వాసంలు వారి ప్రవర్తన, మాటల్లో, చేతల్లో ప్రస్ఫుటం అవుతువుంటాయి. సాకారరూపంలో దేవుడిని పూజించడం, ఆరాధించడం, దేవాలయాలను దర్శించడం చేయకపోయినా వారు నిజానికి ఆధ్యాత్మికక్షేత్రంలో పరమభక్తాగ్రేసురులే!  ప్రయాగరాజ్ కుంభమేళాలో నాగసాధువులు అలాంటి దైవజిజ్ఞాసువులే!


దైవంతో నిత్యయుక్తత్వం కలిగి వుండే జ్ఞాని భక్తులందరిలో శ్రేష్ఠుడు. నిత్యయుక్తత్వమనగా నిరంతరం దైవంతో అనుబంధం కలిగివుండే నిరంతరం ఆత్మధ్యానపరుడు. అతను ఏకభక్తి పరాయణుడు అనగా పరమాత్మ యందు తప్ప ఏ ప్రాపంచిక విషయాలపై ఎటువంటి భక్తి ప్రదర్శించని వాడు. మనలో కొందరికి ధనం మీద భక్తి, కొందరికి పదవి మీద భక్తి, కొందరికి అధికారం మీద భక్తి, మరికొందరికి బార్యాబిడ్డలపై భక్తి వుంటుంది. జ్ఞానికి ఒక్క భగవంతుని మీద భక్తి తప్ప మిగిలిన వేనియండు భక్తి ఉండదు.

మానవసేవే మాధవసేవ అనే భక్తి పూర్వక భావనతో అనాథలకు,ఆర్తులకు,సాధువులకు మనం అందిచే స్నేహహస్తం, సహాయతలు ఆ భగవంతుడికి మనం సమర్పించే భక్తి పూర్వక నీరాజనం.

సర్వేజనా సుఖినోభవంతు 

మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 

ధ్యానమాలిక మార్చి 26 సంచికలో ప్రచురణ 



ఆధ్యాత్మిక పధం 8 యద్భావం తద్భవతి


యద్భావం తద్భవతి సంకల్ప అనితరశక్తి


మన మదిలో ఆలోచనలు నిరంతరం  ఓ స్రవంతిలా జనిస్తూనే ఉంటాయి. 

అదే ఆలోచన స్రవంతిలో ఎన్నెన్నో ఆలోచనలు కరిగి పోతువుంటాయి, కొన్ని ఆలోచనలు మాత్రమే ఆశలవుతాయి, మిగతావి పేరాశలవుతాయి. అందులో కొన్ని ఆశలు కోరికలవుతాయి. 

ఈ కోరికల మధ్య పరస్పర స్పర్ధ ఉంటుంది, ఆ స్పర్ధ ద్వారా వాటిలో ప్రాధాన్యతలు ఏర్పడుతాయి. ఆ ప్రాధాన్యతలో ఎన్నెన్నో కోరికలు వెనుకబడి పోతాయి, మరుగున పడిపోతాయి. కొన్ని మాత్రమే ఆకాంక్షలుగా మారుతాయి. అందులో కొన్ని సాకారదిశగా,మిగిలినవి పగటికలలు అవుతాయి . సాకారదిశలో పయనించే  కొన్ని ఆకాంక్షలు మదిలో భావనలవుతాయి. అ భావనల సాకారదిశలో మన పయనం నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. అదే జీవితం, జీవనపయనం.

ఆలోచన స్రవంతి నుంచి మనలో నూరు కోరికలు కలిగాయి అని అనుకుందాం అందులో  ఆకలి, దప్పిక లాంటి ఒకటి లేక రెండు కోరికలు వెంటనే తీర్చుకుంటాం. ఇటువంటి కోరికలు పునరావృత మవుతుంటాయి అందుకే కాఫీ, టిపిన్లు, భోజనాలు, మంచినీళ్లు తరచుగా తీసుకుంటాం. 

మనలో ఆశలు, కోరికలు,ఊహలు, ఆలోచనలు ఎన్నో వుంటాయి, అందులో కొన్ని త్వరగా మారిపోతాయి, మరి కొన్ని మరుగున పడిపోతాయి . రేపు మరి కొన్ని ఆలోచనలు, భావాలు మదిలో పురుడు పోసుకుంటాయి. ఇవి అన్నీ మనస్సు చేస్తున్న ఆలోచనలు మాత్రమే. 

ఇందుకు కారణం ఎపుడైనా ఆలోచించారా?  అందుకు ప్రధాన కారణం సంకల్పం. కోరికలకు శక్తి లేదు కానీ సంకల్పానికి మాత్రమే శక్తి ఉంది. కోరిక ఇలా జరుగుతే బావుంటుంది అని అనుకుంటుంది, కానీ సంకల్పం అది నిశ్చయంగా జరుగుతుంది అనే భావనతో ఉంటుంది. అంతేగాని  ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ అవుతాయా అని మనస్సుకు సర్దిచెప్పుకోవడం కాదు కావాల్సింది,


“యద్భావం తద్భవతి “ అనేది వేదోక్తి. మనం ఏ భావనతో ఉంటామో  అలాగే ఆలోచిస్తాం, అలాగే ప్రవర్తిస్తుంటాం, అలాగే మాట్లాడుతాం. 

ఏ భావనను నమ్మకంగా,బలంగా, దృఢంగా విశ్వసిస్తామో అదే నిజమవుతుంది మన బలహీనమైన కోరికలను దృఢనిశ్చయంగా చేస్తూ మనస్సును దృఢతరం చేస్తుంది. అవి మన సబ్ కాన్షియస్ మైండ్ 🧠కు ఆశయాలుగా చేరుతాయి.  ఉపచేతన మనస్సులో ఆశయసాధన దిశగా ఓ లక్ష్యం 🎯 ఏర్పడుతుంది.  ఆ లక్ష్యసాధనకు నిన్ను సంసిద్ధుడను చేస్తుంది. లక్ష్యసాధనలో ఎదురయ్యే సమస్యలను సవాళ్లుగా స్వీకరిస్తుంది. ఇదే సంకల్ప అనితరశక్తి.

సంకల్పధ్యానంతో ముందుకు అడుగులువేస్తువుంటే సంకల్ప అనితరశక్తి సామర్థ్యాలు ద్విగుణీకృతం అవుతాయి. మన సిద్ధయోగులు ఈ సంకల్ప అనంతశక్తితో విశాలవిశ్వాన్ని, 🌍🔭ఖగోళమండల స్వరూపాన్ని, నక్షత్రరాశులను, తోకచుక్కలను,🌌 పాలపుంతలను,సౌరకుటుంభ వ్యవస్థను, గ్రహలు వాటి స్థితి గతులను ఎటువంటి ఆధునిక టెలిస్కోపుల🔭 సహాయత లేకుండా తమ అంతర్నేత్రంతో వీక్షించారు. ఆ ఖగోళవిజ్ఞానాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే వేదశాస్త్రాలుగా మానవాళికి అపురూప జ్ఞాన భండారంగా అందించారు. అలనాటి వేద విజ్ఞానమే నేటి ఆధునిక సైన్స్, పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు కూడా మూలాధారం అయింది.

అప్రమేయుడు, అనంతరూపుడు, అవ్యయయుడు, ప్రత్యాగాత్మ , సర్వాంతర్యామి 🔱 ని అంతర్యామిగా తమ అంతరంగంలో మనోనేత్రంతో  ఆత్మానుభూతిగా ఆస్వాదించారు,  వీక్షించారు , తరించారు. 

నీలో బలమైన, దృఢమైన, దృఢతరమైన ఆకాంక్ష ఉంటే  సంపూర్ణ విశ్వాసంతో కూడిన అంకిత భావం, సమర్పణ భావం, నిర్మలమైన మనస్సుతో ముందుకు పయనం సాగిస్తే ఆ ఆత్మానుభూతితో తరించడానికి నిన్ను ఆపే శక్తి ఈ సృష్టిలో లేదు అనే భావన హృదయంలో వికసిస్తుంది.  సంకల్పధ్యానం ఆ మార్గదర్శనం కలిగించే అంతరంగ ద్వారాన్నీ అవతరణ చేస్తుంది.

సంకల్పధ్యానం ద్వారా ఆజ్ఞాచక్రం తేజోవంతం అవుతుంది.  లక్ష్యంలో స్పష్టత వస్తుంది. లక్ష్య సాధనకు మార్గం, దశ దిశలను అవగతం చేస్తుంది. మనస్సు సంకల్ప వికల్పాల కేంద్రం. వికల్ప భావనలను దూరం చేస్తూ లక్ష్యం వైపు నడిపిస్తుంది. 

అంగ వైకల్యం ఓ శాపం కాదు, మన మానసిక వైకల్యాలే నిజమైన శాపం అని వీరు మనకు ప్రబోధిస్తున్నారు.

  • తంగవేలు మరియప్పన్ నిర్వీర్యమైన ఒక కాలుతో హై జంప్ లో తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించి పారాలింపిక్స్ లో కాంస్య,🥉 రజిత 🥈మరియు స్వర్ణ పతకాలతో 🥇అలరించిన మేటి క్రీడాకారుడు.
  • భాష .ఎఫ్. పోలియో ఓ అడ్డంకి కాదు అని పవర్ లిఫ్టింగ్ లో 🏋️అసాధారణ ప్రతిభ కనబరిచి రివార్డులు, అర్జున అవార్డును కూడా అందుకున్నారు 
  • గిరీష్ శర్మ నిర్వీర్యమైన ఒక కాలుతో 🏸బ్యాడ్మింటన్ లో ఏడు సార్లు జాతీయ చాంపియన్ గా అవార్డులు 🥇అందుకున్నారు.
  • సుధ చంద్రన్ ప్రమాదంలో ఓ కాలు తీసివేయబడిన కృతిమ కాలుతో  నృత్యంలో  💃మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో పోరాడి విజేతగా తన కలలను సాకారం చేసుకున్న ప్రఖ్యాత అంతర్జాతీయ మేటి నృత్యకారిణిగా మన్నలను పొందింది. ఆమె జీవితకథ స్ఫూర్తి తో మయూరీ చిత్రం నిర్మించబడింది.
  • ఆటిజం, జన్యుపరంగా పుట్టుకతో వచ్చే మానసిక సమస్యలతో, న్యూటన్ ప్రపంచంలో ప్రముఖ శాస్త్రవేత్తగా లబ్ధప్రతిష్టలను పొందారు.

జీవితం అంటే కష్టాలను, కన్నీళ్లను, ప్రతికూలతలను సవాళ్లుగా స్వీకరించి ఆ జారుడు మెట్లనుంచి మొక్కవోని ధైర్యంతో పోరాట స్పూర్తితో ముందడుగు వేయడం. అసాధ్యం అనే పదం వీరి నిఘంటువులో లేదు అని మానవాళికి ప్రబోధగీతంలా చాటీ చెప్పిన మానవీయులు, మహనీయులు.

వీరు ఇతరులలో స్ఫూర్తివంతమైన భావాజాలంతో ముందుకు నడిపించే కరదీపికలు. భావితరాలకు ఆశాజ్యోతులు.


సర్వేజనా సుఖినో భవంతు 

మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729 

🧘‍♂️🧘🧘🧘🧘🧘🧘 




ఆధ్యాత్మిక పధం 7 జగమంతా ప్రేమమయం

 

జగమంతా ప్రేమమయం 


ఆహ్లాదకరమైన ఉషోదయ వేళల్లో , లేలేత వెచ్చని సూర్యకిరణాలస్పర్శతో మది పులకిస్తువుంటే ఇష్టసఖితో  ఉద్యానవనవిహారం ఓ మధురానుభూతి! 

ఆ అందమైన ప్రశాంత వాతావరణం, మదిని ఆకర్షించే పూలమొక్కల పరిమళాల సువాసనలు మనస్సుని పరవశింప చేస్తాయి!

ఓ అందమైన గులాబి🌹 తన సొగసులతో నీ చూపును 👁️ఆకర్షించడంతో పాదాలు ఆటు అడుగు వేస్తాయి, చేతివేళ్ళు 🤌ఆ గులాబీని సున్నితంగా మృదువుగా స్పర్శిస్తాయి ఆ అనుభవాన్ని మనస్సు తనలో ఓ మధురజ్ఞాపకంగా  పదిలపరుచుకుంటుంది - అది ప్రేమ. 

కొన్ని తుంటరి చేతులు వాటిని సొంతం చేసుకోవాలని మొక్క నుంచి ఆ పువ్వును తెంచుతుంది - అది మోహాం .

ఆ అందమైన మొక్క 🪴తమ ఇంటి బాల్కని లోనే వుండాలి అని అటుఇటు తేరిపారా చూస్తూ ఆ మొక్కను ఇంకోచెయ్యి పెరుకుతుంది - అది వ్యామోహం. 


  • తల్లి తన బిడ్డకి స్తన్యం పంచుతూ పొందే అనుభూతికి మరో పేరు అనురాగం. 
  • అదే పనిగా శిశువు ఇష్టఅయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆహారం ఇవ్వడం మోహం. అమృతం అయినా చెంచాతోనే ఇవ్వాలి కానీ గిన్నెలతో కాదుకదా! అది వారిలో వ్యతిరేకతకి కారణమవుతుంది. 
  • పిల్లల మంచిచెడుల బేరీజువేయకుండా వారు చేసే ప్రతిపనిని సమర్ధించడం వ్యామోహం అది వారిలో విపరీతప్రవర్తనకు కారణమవుతుంది. 

అందుకే పిల్లలపై ఆప్యాయతలు చూపించడమే కాదు అవసరమైన చోట దండన కూడా అవసరమే.

  • బిడ్డ ఆలనపాలనలలో పొందే ఆనందం, తండ్రి కళ్లలో కనిపించే మెరుపులే 💖 ప్రేమ. 
    • వారిని లాలిచండం, బుజ్జగించడం వాత్సల్యం,అది ప్రేమానుబంధాన్నీ దృఢం చేస్తుంది
    • గారాబం చేయడం మోహాం,అది వారిలో అహం తెస్తుంది, 
    • అతి గారాబం చేయడం వ్యామోహం,అది వారిని గర్విష్టులు,మొండివాళ్లు, అహంభావులుగా చేస్తుంది. 

అందుకే పెరుగుతున్న పిల్లలపై మీ ఆంక్షలు వాళ్ల భవిష్యత్తుకు సోపానాలు అవుతాయి.

పిల్లల కోసం ఎంత సంపాదించినాం అనేది ప్రధానం కాదు. పిల్లలకు మంచి సంస్కారం, ధర్మం, మానవత విలువలను నేర్పించడమే తల్లిదండ్రులుగా మనం చూపించే అసలుసిసలైన ప్రేమ.

  • బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ మనందరికీ కావాల్సిందే.
  • ఓ గురువుగారు తన విద్యార్థుల ప్రతిభ,మేదస్సులకు తన మదిలో పొంగిపోవడం ప్రేమ. అది ప్రతిభావంతులను తయారుచేయడానికి ఊతం అవుతుంది.
  • తన పరిశోధన విశ్వావళికి మేలుకలిగిస్తే ఆ శాస్త్రవేత్త పొందే ఆనందం ప్రేమ. అది నూతన ఆవిష్కరణలకు ప్రేరణ అవుతుంది.
  • నీటిలో మునిగి పోతున్న ఓ చీమని 🐜ఓ ఎండుటాకుతో రక్షిస్తే కలిగే తృప్తి ప్రేమ. అది ఆత్మ ఆనందానికి స్ఫూర్తి అవుతుంది.
  • దప్పికతో సొమ్మసిల్లిన ఆర్తీకి తన వాటర్ బాటిల్ 🥤తో దప్పికతీర్చే ఓ చిన్నారి మనస్సు కరుణాభరిత ప్రేమ. అది దయార్ద్ర హృదయం అవుతుంది.
  • ఓ కలం తన రచనలతో మార్గదర్శనం కలిగిస్తే పొందే అనుభూతి ప్రేమ. 
  • దేశరక్షణకోసం నిత్యం శ్రమించే సైనికుడి విధి ప్రేమస్వరూపం. నేడు నడిచే భూమి రేపు తనది కాదు అని తెలుసుకున్న మహాజ్ఞాని.
  • అందరి ఆకలి తీర్చే రైతన్న స్వేదం ప్రేమ స్వరూపం. తను నమ్ముకున్న నేలతల్లిని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే కృషీవలుడు.
  • తను జ్వలిస్తూ వెలుగును నింపే కొవ్వత్తి, ఎండ తాపాన్ని భరిస్తూ నీడను ఇచ్చే చెట్లు, గలగల సవ్వడితో ప్రవహిస్తూ మన దప్పికను తీర్చే సెలయేర్లు, దున్నినా తవ్వినా పలసాయం అందిచే పుడమితల్లి ప్రేమ స్వరూపాలే!!!


జీవితం అంటేనే ప్రేమ. ఆ ప్రేమను ఆస్వాదించడం, దానిని ఇష్టపూర్వకంగా నలుగురితో పంచుకోవటం సౌభాతృత్వం. పంచుకుంటే తరిగేది సంపాదన,  పంచుకుంటే పెరిగేది ప్రేమ.  

అది సామాన్యుడినీ అసామాన్యుడిగా చేస్తుంది!


ఉషోదయ వేళల్లో అరుణకాంతుల ఉదయభానుడిని స్వాగతించే  పక్షుల కిలకిలరావాలు, మలయమారుతాలు, వికసించే కమలాలు,చెంగుచెంగున నడిచే లేళ్ళు, పురివిప్పిన నాట్యమయూరీలు , గలగలాపారే సెలయేళ్ళు, ఆ జలాలలో తమ సొగసులతో ఆకట్టుకునే రాజహంసలు, నాగలి చేతపట్టి పొలంగట్లు వెంట నడిచే రైతన్నలు, బుడిబుడి అడుగులతో స్కూలుకి వెళ్లే చిన్నారులు, అపుడే నిద్రలేస్తున్న నగరాలు, మంద్రస్థాయిలో ప్రతిధ్వనించే సుప్రభాతాలు ఎటు పరికించి వీక్షించినా సర్వం ఆనందమయం!!

అందుకే ప్రకృతిలోని రమణీయ అందాలను వీక్షించు,ఆరాధించు, ప్రేమించు, ఆస్వాదించు, జగమంతా ప్రేమమయంగా పరవశించు. 

అ దివ్యప్రేమానుభూతి స్వరూపమే సర్వాంతర్యామి, ఆ మధుర జ్ఞాపకాలుగా నిత్యం హృదయాంతరాలలో పదిలపరుచుకో ! అందమైన ఆ ప్రకృతి మాత ఓడిలో సేదతీరు. అంతర్యామిగా ఆ సర్వాంతర్యామి కరుణ, దయ,కృప,ప్రేమలతో నిత్యం మదిలో తరించు , పులకరించు, పరవశించు!

పరమాత్మ మనందరికీ వివేకవిచక్షణ జ్ఞానం ఇచ్చాడు. వాటిద్వారా మదిలో పరమాత్ముడి ఆలోచనలతో అప్రమేయుడు, ఆద్యంతరహితుడు, సర్వాంతర్యామి, ప్రత్యగాత్మ,సర్వేశ్వరుడునీ అన్వేషించాలి. అంకితభావం, దృఢచిత్తం,సమర్పణభావంతో శోధించాలి. 

ఆణిముత్యం కావాలి అంటే సముద్రపు లోతుల్లోనే అన్వేషించాలి. అదేవిధంగా అ సృష్టికర్త, ముక్తిప్రధాత,విశ్వంభర అనుగ్రహం కోసం భక్తి,శ్రద్ధ,ప్రీతి,నిరంతర చింతనలతో నీ హృదయాంతరాలలో నిత్యశోధనతో నిరీక్షించాలి. నిరీక్షణ ఫలంగా ఆ భగవంతుని అనుగ్రహం పొందే అర్హతకు చేరువవుతావు.


సర్వే జన సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa

9900022729

🧘🧘🧘🧘🧘🧘