సంపాదించుకోండి
మన అందరికీ కావాలి…
కోరికలు, ఆశలు, ఆకాంక్షలకు
మూలం, ఆధారంగా కదిలించే క’థనం’
ఈ ప్రపంచాన్ని నడిపేది, నడిపించేది,
పరుగులు తీయించే ఇం’ధనం’
అందుకే సంపాదించుకోండి
మనది న్యాయార్జనే కావాలి
కర్షకులకు పాడిపంటలు
ఉద్యోగులకు జీత,భృత్యాలు
కార్మికులకు వేతనాలు
వ్యవసాయ కార్మికులకు దినసరి వేతనాలు
దివ్యాంగులకు, అయోగ్యులకు ప్రభుత్వభృతి
విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లే
ధనార్జనకు ప్రధాన సిరులు
భవిష్యత్ కోసం సౌకర్యత్యాగాలే సిరులమిగులు
సిరులమిగులు పరిరక్షణే మదుపు
నేటి మదుపు భవిష్యత్తుకు
మూలధనం, అభయధనం…
సంపాదనే ఓ వ్యసనం ఐతే
గానుగెద్దులా శ్రమిస్తూనే వుంటారు
తేటిలా మకరందాన్ని కూడబెడతూనేవుంటారు
కనీస అవసరాలను కూడ ఉపేక్షిస్తారు
ప్రభుత్వ ఉచితాలకు పరుగులు తీస్తారు
విలువలేని ఆర్జనకు విలువలను సమాధి 🪦 వేస్తారు
జీవితం ఇదే అనే భ్రమలో జీవిస్తుంటారు
ఐతే వీరు నిజానికి ధనాన్ని ప్రేమించరు!?
ధనం అయిపోతే అనే భయాన్ని ప్రేమిస్తారు
సంపాదన కోసం జీవితాన్ని ఫణంగా పెడతారు
నేడు ఆరోగ్యమే సంపాదనకు ఫణం అయింది
జీవితం కోసం ఆర్జన ఉండాలి
ఆర్జన కోసం జీవితం ఐతే
వీడు అన్నివున్నా అనాధే!!!
శ్వాస తీసుకోవాలి అంటే ముందుగా వదలాలి
అదే విధంగా సంపాదనకు వితరణ కావాలి
విశ్వంభరుడికి కానుకల సమర్పణ
స్వచ్ఛందసేవలకు దాన,ధర్మ వితరణ
దివ్యాంగులు,అభాగ్యులకు అన్న పానీయ వితరణ
పశుపక్ష్యాదులకు గ్రాస వితరణ
చిన్నారుల చదువులకు అర్థ వితరణ
కన్యాదానంలో ప్రేమపూర్వక కట్నకానుకలు
బంధుమిత్రవర్గాలకు మనః పూర్వక విందులు
ఆర్ద్రతాభరిత విత్త వితరణే అభిమానధనం…
పరోపకారంతో మనసును విశాలం చేయండి
పడిపోతున్నవారికి చేయూతలో బాహుబలి అవ్వండి
అభాగ్యుల కన్నీళ్లు తుడిచే స్నేహహస్తంగా మారండి
మీ చేయూతతో
కొందరి కన్నీళ్లు ఆగితే అది కరుణా సంపద
కొందరి జీవితాలు వెలుగులతో నిండితే అది విద్వత్ సంపద
కొన్ని కుటుంబాలు నిలబడితే అది ఔదార్య సంపద
కొందరి పెదవులపై చిరునవ్వులు పూయిస్తే అది అక్షయ సంపద
సంపాదించుకోవడం అంటే
బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవడం కాదు
ఆస్తులను కూడ బెట్టడం కాదు
హోదా, ప్రతిష్ఠల కోసం ప్రాకులాడడం కాదు
ఇతరుల మనస్సుల్లో స్థానం సంపాదించుకోవడం
సహృదయంతో కూడిన విలువలను పెంపొందించుకోవడం
ఈ శ్రేష్ఠ విలువలే పరమపద సోపానాలు
నిత్య కృషీవలుడిగా
ఈ మానవత విలువలను సంపాదించుకోండి…
No comments:
Post a Comment