Friday, 3 July 2026

రానా కవితలు 9 సంతోషం

 

సంతోషం 


మార్నింగ్ వాకింగ్ చేస్తాం

మిత్రులతో భాతఖాని చేస్తాం

పాటలు పాడుకుంటాం

ఆటలు ఆడుకుంటాం 

నాణ్యమైన ఆహారాలు తీసుకుంటాం

ఇష్టమైన ఉద్యోగాలు చేస్తాం

మంచి నిద్రకోసం ఏసి, సౌకర్యవంతమైన బెడ్లు వాడుతాం 

విలాసవంతమైన ఇండ్లలో ఉంటాం

లగ్జరీ కార్లలో తిరుగుతాం 

ఫైవ్ స్టార్ హోటళ్లలో బసచేస్తాం

దేశ, విదేశీ ప్రయాణాలు చేస్తువుంటాం

శని, ఆదివారాల్లో ఫ్యామిలీతో వీకెండ్ ఎంజాయ్ చేస్తాం 

పిక్నిక్కులు, టూర్లు కూడా ప్లాను చేసుకుని సరదాగా వెళ్తాం

ఇవే సంతోషం ఇస్తాయి, తెస్తాయి అని నమ్ముతాం

కానీ మనలో, మన మనసు అట్టడుగుపొరల్లో 

ఏదో అలజడి, తెలియని వెలితి, అంతా శూన్యం అనే భావన 

కొండచలమలో ఊరే నీరులా ఉంటుంది …

వీరి సంతోషం మోచేతి దగ్గరి తేనె లాంటిది

నోటికి అందదు, ప్రయత్నం ఆగదు..!


ఎందుకు ఈ అలజడి, వెలితి,శూన్యత అంటే….

మనకు తీసుకోవడం తెలుసు

దాచుకోవడం తెలుసు

వాడుకోవడం తెలుసు 

స్వార్థంతో జీవించడం తెలుసు 

ప్రంపచాన్ని నడిపించేది డబ్బు అని తెలుసు

బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవడం తెలుసు

అహంని ఆత్మాభిమానంగా పోషించుకోవడం తెలుసు


కానీ తెలుసుకోవలసింది

సంతోషం బయట ఎక్కడో లేదు

అది మనలోనే, మనతోనే ఉంది 

బంధాలు, అనుబంధాల పరిపుష్టితంలో

ఆర్తులకు, అన్నార్ధులకు అందించే సహాయంలో

నిరాశలో, నిస్సహాయతలో ఉన్న వారికి అందిచే ఓదార్పులో 

ముగజీవాలకు అందించే ఆదరణలో

దీనులపట్ల చూపించే కారుణ్యంలో

కరుణారసభరిత హృదయక్షేత్రంలో 

సంతోషం వికసిస్తుంది,🌸 వెల్లివిరుస్తుంది !!


మీ అభిరుచులకు తిరిగి జీవం ఇవ్వండి

వాటిని పెంచి పోషించండి 

అదే మీ సంతోషానికి చిరునామ అవుతుంది!!

 

అణువణువునా విస్తరించిన అంతర్యామి

అనుసంధానంతో మనసు 

ప్రశాంత భరితం, సంతోషభరితం అవుతుంది!!!







ఆధ్యాత్మిక పధం 27 ఇంద్రధనస్సు

 

ఇంద్రధనస్సు 

వర్షం కురిసిన తరువాత సూర్యునికి ఎదురుదిశలో సప్తవర్ణాలతో వినువీధిలో మనోహర దృశ్యంగా హరివిల్లును 🌈మనం తరుచుగా చూస్తాం. సూర్యకాంతి వాన చినుకులలో ప్రసరించి, విశ్లేషణ చెందడంతో  ఇంద్రధనస్సు వెల్లివిరుస్తుంది.

సూర్యకిరణాలలో వుండే ఈ సప్తవర్ణాల నుంచే పుష్పాలు 💐, ఓషధులు ప్రత్యేకించి తమకు కావలసిన రంగులను స్వీకరించి  వివిధ వర్ణాలతో , ఆకృతులతో, సొగసులతో 🏜️ వృద్ధి చెందుతు ప్రకృతికి శోభ, అందాలను సమకూరుస్తూ మన మనస్సులను ఆహ్లాదభరితం చేస్తాయి. ఈ సప్తవర్ణాలకు మూలం వక్రీభవనం చెందిన సూర్యకాంతికిరణ విశ్లేషణనే!!

మొహ, కాంక్ష, పరిగ్రహ రహిత జీవాత్మ మోక్షం అనే దివ్యధామం చేరుకోవడానికి ముక్తిధనస్సు అనే పద్దెనిమిది రకాల యోగాలను మానవాళికి మార్గ నిర్దేశనంగా అందించిన అపూర్వ జ్ఞానగీతిక, భగవద్గీత. నీవు ఏ యోగమార్గంలో ఏ దిశ నుంచి పయనించిన అవి నిన్ను లక్ష్యం 🎯 వైపుకు మాత్రమే నడిపిస్తాయి. 

ఈ పద్దెనిమిది యోగ మార్గాలను స్థూలంగా కర్మ యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగలుగా పరిగణిస్తారు. 

కర్తృత్వభావనను వదలివేసి జనకళ్యాణం, లోకహితం,సమాజశ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తూ కర్మలను ఆచరించాలి అని కర్మయోగం ప్రబోధిస్తుంది. 

అటువంటి కర్మ యోగి ప్రతి పనిని దైవం కోసమే చేస్తున్నాను, దైవానికే చేస్తున్నాను అనే భావనతో ఆచరిస్తూ కర్మ ప్రతిఫలాలను అంకితభావంతో, అనన్యభక్తి శ్రద్ధలతో పరమాత్మకు సమర్పించడమే భక్తియోగం.

అటువంటి నిత్యయుక్తుడు మధుసూదనుడు, అవ్యయుడు, అప్రమేయుడి కరుణ, కృపలతో బుద్ధియోగంలో ప్రవేశించి తన లోని అజ్ఞానాంధకారాలను జ్ఞానజ్యోతులతో తొలగించుకుంటూ జ్ఞానప్రకాశంతో నివృత్తి మార్గంలో గానీ లేదా ప్రవృత్తి మార్గంలో ఆత్మ స్వరూపజ్ఞానం లోనికి ప్రవేశిస్తాడు.

పరమాత్మ ప్రసాదిత అపురూప మానవ జీవిత పరమార్థం జన్మరాహిత్యం. జన్మరాహిత్యం ద్వారా జీవాత్మ పరంధాముడి దివ్యధామం చేరుకోవడమే మోక్షం. ఇది దుఃఖరాహిత్యం, సంసారబంధన, భవబంధన విముక్తులతో సాధ్యం!!  

దుఃఖానికి మూలం శరీరం. ఈ శరీరానికి మూలం కర్మలు. కర్మలకు మూలం రాగద్వేషాలు. వీటికి మూలం అజ్ఞానం. ఈ అజ్ఞానానికి మూలం కారుమబ్బులు సూర్యుడిని కప్పివేసినట్లుగా, జ్ఞానం అహంతో కప్పివేయడం. 

అజ్ఞానం సస్వరూపాన్ని మరగుపరచడంతో జీవుడు సంసారబంధనం, భవబంధనాలలో బంధిగా  ఉంటూ ఈ దేహం నాది, నేనే ఈ దేహం అనే మాయలో జీవనయానం కొనసాగిస్తుంటాడు.

సృష్టిలో దేహలన్నీ పుట్టుక, పసిప్రాయం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, దేహాంతరప్రాప్తితో కాలంలో కలిసి నశించే దేహమే జీవుడికి క్షేత్రం. జీవాత్మనే సచ్చిదానంద స్వరూపం అయిన క్షేత్రజ్ఞుడు. దేహమే క్షేత్రంగా ఉపస్థితుడు. ఆత్మ మార్పు లేనిది శాశ్వతమైనది, నిత్యమైనది. శరీరం నశిస్తుంది కాని ఆత్మ నశించదు.  ఆత్మ చైతన్యభరితం. మనసు, బుద్ధి పనిచేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. దేహక్షేత్రంలో ఒక సాక్షి లాంటిది. మన జీవితంలో జరిగే సుఖదుఃఖాలను కేవలం గమనిస్తుంది తప్ప, వాటితో ప్రభావితం కాదు.

ఆత్మ, అనాత్మ, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు,దృశ్యం,దృక్కు అన్ని ఈ దృశ్యప్రపంచంలో ఏకమై అజ్ఞానికి ఒకటిగా కనిపిస్తాయి. కంటికి కనిపించే ప్రతి పదార్థం నశిస్తుంది, ఇంద్రియానుభూతికి అతీతమైన చైతన్యమును చైతన్యముగా గుర్తించి ఆత్మ యందు చిత్తంను, అనాత్మ (క్షేత్రం) యందు విరక్తిని కలిగి తత్వదర్శి జీవనపయనం కొనసాగిస్తాడు.

అహం పరిపూర్ణంగా త్యజించి పరమాత్మ శరణు కోరితే అజ్ఞానం అనే మేఘాలు తొలగి జ్ఞానం అంతరంగంలో వికసిస్తుంది. దుఃఖరాహిత్యం వికసిత జ్ఞానంద్వారానే సిద్ధిస్తుంది!!

పతంజలి మహర్షి ముక్తిధామ సాధన కోసం అష్టాంగయోగ ప్రణాళికను మానవాళికి అపురూప పురస్కారంగా బహూకరించాడు. అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము,ధారణ,ధ్యానము,సమాధి.

  1. యమము:  అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే పంచ గుణాత్మకం.
    • ధర్మపరిరక్షణలో జరిగే హింసను అహింసగానే పరిగణించడం.
    • ‘సత్యం వద,ధర్మం చర ‘ అంటే సత్యంనే పలకడం,ధర్మంనే ఆచరించడం.
    • అస్తేయము అంటే ఇతరుల సమ్మతి లేకుండా వారి వస్తువులను, ప్రతిభను వాడుకోకపోవడము.
    • బ్రహ్మచర్యము అంటే దైవం నిర్దేశించిన జ్ఞానమార్గంలో నడవడం.
    • అపరిగ్రహము అంటే అవసరానికి మించి దేనిని ఆశించకపోవడం.
  2. నియమము: శౌచము,సంతోషము,తపస్సు,స్వాధ్యాయము,ఈశ్వరప్రణిధానము అనే పంచగుణసమ్మేళనం.
    • శౌచము అంటే నడతలో, నడకలో, మనస్సులో,ఆలోచనలలో స్వచ్ఛత, పవిత్రత, పారదర్శకత కలిగివుండడం.
    • సంతోషము అంటే లభించిన వాటితో ఆనందం,తృప్తిని కలిగివుండడం.
    • తపస్సు అంటే లక్ష్యసాధన కోసం ఆత్మనిగ్రహంతో, అంకితభావంతో చేసే ధ్యానం.
    • స్వాధ్యాయము అంటే ఆత్మపరిశీలనతో ఆలోచనలను విశ్లేషించుకోవడము.
    • ఈశ్వరప్రణిధానము అంటే కర్మఫలత్యాగంతో అహం వదిలి పరమాత్మ శరణుకోరుకోవడం 
  3. ఆసనము: ధ్యానసాధన కోసం స్థిరమైన, సౌకర్యవంతమైన శారీరక భంగిమ లేదా కూర్చునే స్థానం
  4. ప్రాణాయామము: శ్వాసక్రియలో పూరకం,కుంభకం మరియు రేచక క్రియలతో ప్రాణశక్తిని విస్తరింపచేసి జీవశక్తిని పెంపొందించుకోవడం.
  5. ప్రత్యాహారము: మనస్సుద్వారా ఇంద్రియాలను నిగ్రహించి యోగి అంతర్ముఖంగా చేసే ధ్యానం.
  6. ధారణ: మనస్సును ఏకాగ్రతతో నిలిపి ఉంచడం 
  7. ధ్యానము: శ్వాసపై ధ్యాస ద్వారా మనస్సుకు ప్రశాంతతను తీసుకురావడం.
  8. సమాధి: విషయ విస్మరణ, ఆత్మస్మరణ. అందుకు దుస్సంకల్పములను మదిలో నుంచి వేరుచేయాలి, సత్సంకల్పములకు మనస్సు వేదిక కావాలి. విషయ విస్మరణతో నిస్సంకల్పస్థితికి చేరుకోవాలి, అదే సమాధిస్థితి.

ఈ జీవిత పరమార్థం జన్మరాహిత్యంద్వారా మోక్షధామం చేరుకోవడమే!!

మనం చేసే ప్రతి పని, ఆలోచన కర్మ బంధనానికి మూలం అవుతుంది. 

కర్మ యోగి చేసే ప్రతి పని, ఆలోచనలను పరమాత్మకు సమర్పణ చేస్తాడు, అందువలన ఆ కర్మఫలాలు అతనిని బంధించవు, వాటినుంచి విముక్తుడిని చేస్తాయి. అష్టాంగయోగం ఆ కర్మ యోగిలో విషయ విస్మరణతో తత్వదర్శిగా ఈ జీవితకాలంలోనే జీవన్ముక్తుడిగా పరబ్రహ్మ దివ్యసన్నిధికి చేరుస్తుంది.


మొహం, క్రోధం,లోభం అనే మాయతో సమ్మోహన భరితమైన మనస్సు గమ్యం తెలియని పతనదిశలో వడివడిగా అడుగులు వేస్తూ ఆత్మని అధోగతిపాలు చేసే ప్రమాదం ఉంది, కాని ఆత్మసంయమనంతో శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని తన వశంలో ఉంచుకోవడం ద్వారా మనస్సు లక్ష్యపథంలో కార్యోన్ముక్తుడిని చేస్తుంది. 

అటువంటి కర్మయోగి మనోనిగ్రహంతో అనన్య చింతన, అనన్య భక్తి ప్రవృత్తిలతో పరమాత్మ అనుగ్రహం కోసం పరితపిస్తూ పరమాత్మను భక్తి, శ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు.

అది ఆ తత్త్వదర్శికి ముక్తిమార్గం అవగతం చేస్తూ అటు వైపుకు నడిపిస్తుంది.

అదేవిధంగా జీవించి ఉన్నపుడే ముక్తి పొందినవాడు జీవన్ముక్తుడు. కర్మలు జరుగుతాయి కానీ అతనికి ఆ కర్మలతో బంధనం ఉండదు. తామరాకు మీద నీటి బిందువులా ప్రపంచంలో వుంటాడు కానీ ప్రపంచ బంధనాలతో అంటుకోడు.

ఈ దేహమే క్షేత్రం, ఆత్మనే క్షేత్రజ్ఞుడు అని అర్థం చేసుకున్న కర్మయోగి కర్మలను వదలివేయడు చేసే ప్రతి పనిని నేను చేస్తున్నాను అనే కర్తృత్వభావనను వదలివేసి పరోపకారం, లోకహితం, సమాజశ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తూ కర్మలను ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరించడం ద్వారా అవి నిష్కామ కర్మలు అవుతాయి. నిష్కామ కర్మలు యజ్ఞక్రియలుగా పరివర్తనం చెందుతాయి.

యజ్ఞక్రియలు జీవాత్మను కర్మబంధనాలలో బంధించవు.


సర్వేజనా సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

నారాయణ శెట్టి రాచపూడి 

వ్యవస్థాపకులు

రానా యోగ ఆలయ 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 


ఆధ్యాత్మిక పధం 28 పరిపూర్ణానందం


పరిపూర్ణానందం 


మనం చేయబోయే పనులకు మనసులో సంకల్పం తీసుకుంటాం. అవి సమర్థవంతంగా నిర్వర్తించడానికి, విజయవంతంగా ముగించడానికి ఓ నిర్దిష్టప్రణాళికను తయారుచేసుకుంటాం. లక్ష్యసాధనలో ఎదురయ్యే అవరోధాలను, ఆటంకాలను, సవాళ్లను అధిగమించేవిధంగా వ్యూహాలను రూపొందించుకుంటాం. ఆ గమ్యానికి చేరుకోవడానికి, మన పరిమిత వనరులను 💰సమర్థవంతంగా ఉపయోగించుకునేవిధంగా ఒక సమగ్రమైన రోడ్‌మ్యాప్ తయారుచేసుకుంటాం.


అదేవిధంగా పరమాత్మ మనకు నిర్దేశించిన ప్రణాళికలు మహోత్తమమైనవి, ఉత్కృష్టమైనవి, పరమశ్రేష్ఠమైనవి. అవి మోక్షసాధనకు సాధకునికి అపౌరుషేయరూపమయిన భగవద్గీత వివిధ యోగమార్గాలను పరిచయం చేస్తూ యోగాభ్యాసంలో 🧘‍♀️ఎదురయ్యే సాధకబాధకాలును సులువుగా ఎలా అధిగమించాలో నేర్పుతుంది.


ఈ ఆధ్యాత్మికసాధన ఆరంభంలో బాధాకరమైనదిగా మరియు కఠినమైనదిగాను అగుపించవచ్చు. సర్వాంతర్యామి అయిన పరమాత్మ ప్రీతితో స్వయంగా మానవాళి ఆధ్యాత్మిక  పురోగతికి ఎదురయ్యే ఈ సవాళ్లను ఏలా అధిగమించాలి అనేది జ్ఞానగీతికగా ప్రబోధించారు. 


ఆధ్యాత్మిక సాధనలో ధర్మ ప్రవర్తన, ధర్మపరిరక్షణలనే ధ్యేయంగా స్వీకరించి అనుసరించాలి. ఈ కర్తవ్యనిర్వహణలో చేయదగిన పనిని తప్పక నిర్వర్తించాలి. చేయదగని పనిని త్యజించాలి.

రక్షింపబడిన ధర్మం నిన్ను రక్షిస్తుంది!

ధర్మమే ప్రపంచానికి రక్షణ అవుతుంది!! రక్షణ కవచం 🛡️గా మారుతుంది!!

ధర్మమే విశ్వమానవాళిలో సౌభ్రాతృత్వం తీసుకువస్తుంది!!!

ధర్మపరిరక్షణలో భాగంగా జరిగే హింస, ఉగ్రవాదం కూడ ధర్మమే అవుతుంది!!!

ధర్మపరిరక్షణలో హృదయదౌర్భల్యానికి మూలాలయిన అలక్ష్యం, నిర్లిప్తత, అధైర్యం, పిరికితనం, దుర్బలత్వం, నిరుత్సాహంలనే కంటకాలను దరికిచేరనియారాదు. ఈ కంటకాలు చేతితో పట్టుకున్న 🔥నిప్పుకణికలవంటివి. 


క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరన్తప 

లక్ష్యసాధనకు పిరికితనమే ప్రధాన ప్రతిబంధకం. నేను ఈ పనులు చేయలేను. నేను అశక్తుడిని. నాలో అంతటి సామర్థ్యం లేదు. నా అంతటి బలహీనుడు ఇంకెవ్వరు ఉండరు. ముక్తిసాధన నాలాంటి వానికి అందని ద్రాక్ష 🍇 పండ్లు వంటివి, అనే ప్రతికూలభావానలకు మనస్సు తరచుగా లోనవుతుంది. ఈ హృదయదౌర్బల్యంను తక్షణమే త్యజించాలి అని అవ్యయుడు హితోపదేశం చేశారు.


ప్రాణం తీసే మంట, మార్గం చూపే వెలుగు ఏదో తెలియని మిడత ఆ మంటల్లో దహించుకు పోతుంది! అదేవిధంగా అజ్ఞాని పిరికితనం అనే సంకెళ్లతో జీవితచక్రంలో తనకు తాను బందీగా ఆది అంతం తెలియని సంసార భవసాగరంలో అనాదిగా జీవనయానం కొనసాగిస్తూవున్నాడు.


ఈ దౌర్బల్యం సమాజంలో వ్యాప్తిచెందితే సమాజభవిష్యత్తును ప్రశ్నార్ధకంచేస్తూ దావానలంలా వ్యాపిస్తుంది. అరక్షిత ధర్మం ఆ సమాజాన్ని శిక్షిస్తుంది. అఖండభారతం ఇస్లామిక్ దండయాత్రలతో, వలస వ్యాపారుల కుతంత్రాలతో, విదేశీయుల పరిపాలనలతో శతాబ్దాలుగా మగ్గిపోవడానికి, దేశం ముక్కలు ముక్కలుగా విడిపోవడానికి, దేవాలయాలు మసీదులుగా మారడానికి, అన్యమతాలు పరిపుష్టితం కావడానికి,మన సమాజంలో అరక్షిత ధర్మపరిరక్షణే!!ఇందుకు సమాజంలో ప్రధాన భాగస్వాములమైన మనలోని అనైక్యత, ప్రతికూల ఆలోచన ధోరణులకు మూలమయిన హృదయదౌర్బల్యత్త్వం!!! 


ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, సంకల్పం అనేవి హృదయదౌర్భల్యాన్ని పారద్రోలి ధర్మపరిరక్షణలో కరదీపికలుగా ప్రకాశిస్తాయి. ఆ వెలుగులను కార్యోన్ముఖుడు అయిన కార్యశీలుడు ఎన్నటికి వదలడు, వదులుకోరాదు. పారాహుషార్ అంటూ మీనుంచి, మీలోనించి ఈ పిరికితనాన్ని పారద్రోలండి!!! అందుకు నమ్మకం,విశ్వాసంతో దృఢంగా అడుగులు 🦶 ముందుకు వేయండి. 


లక్ష్యసాధనలో శ్రద్ధ, సహనం కలిగివుండాలి. మల్లెలు, మామిడిపండ్లు 🥭 కావాలి అనుకుంటే వేసవి కాలం వరకు ఓపికగా వేచిచూడాలి. అదేవిధంగా లక్ష్యమును త్వరగా సాధించాలి అనే అభిలాష మంచిదే కాని వెంటనే జరిగిపోవాలి అనే తొందరపాటు తనం వుండరాదు

అతి సర్వత్ర వర్జయేత్

  • గీత యుక్తాహారం ప్రాధాన్యతను బోధిస్తుంది. ఆహారం అతిగా కాని అల్పంగాను కాని తీసుకోరాదు. అది మితంగా, సాత్వికంగా, మధురాహారంగా ఉండాలి. అది మనసుని, ఆలోచనలను, ఉద్వేగాలను  స్వాంతనపరుస్తూ నివృత్తి మార్గంలో పరిపూర్ణతకు వేదిక అవుతుంది. ఆహారనియంత్రణే ఇంద్రియనిగ్రహానికి మొదటి సోపానం. నిరాహారదీక్షలతో శరీరధారిని నీరసింపచేయరాదు. నీరసించిన దేహంలో శ్రద్ధ కుదురుకోలేదు. 
  • అతి నిద్రలోలుడు తెలివిలేని మూర్ఖుడు అందుకే అతిగా నిద్రించరాదు, అలాగని నిద్రించకుండనుండరాదు, ఐతే నాణ్యమైన మిత నిద్ర ఉండాలి. ఆ నిద్రలో మనసు, దేహం స్వాంతన పొందడమే యుక్తనిద్ర.
  • మన మాటలు అధికభాషణంగా కాని అల్పభాషణంగా నుండరాదు. అది మిత భాషణం, హితభాషణం, సత్యభాషణం, మధురభాషణంగానూ ఉండాలి. మాటల్లో సామ్యత, ఆప్యాయత అందరిని ఆకర్షిస్తుంది. మౌనభాషణం పరిపూర్ణానందానుభూతికి సన్నిహితం మయిన యుక్తభాషణం.


అకర్మణ్యత్వము

అకర్మణ్యత్వం అంటే ఏ పనిచేయకుండా వుండడం ఇది వైరాగ్యంలో ఉన్నతస్థితి అనే భావనతో  కొందరు వుంటారు. పనులు చేయకుండా సోమరిగా వుండడం ఏ దృష్టితో చూసిన ఆక్షేపణీయం!కర్మలు చేయకుండుటకంటే చేయుటయే మేలు, కర్మత్యాగం కంటే కర్మయోగం శ్రేష్టం అని విధాత హితబోధ చేశారు.

ఇతరులనుంచి అయాచితంగా ఏవి ఆశించని ఋజుప్రవర్తనాచరణ సచ్చిదానందానుభూతికి సన్నిహితం చేస్తుంది. 

చేసే ప్రతి పని ధర్మబద్దంగా వుండాలి. అర్జన న్యాయబద్ధమైనదిగా ఉండాలి.


శ్రద్ధావాన్ లభతే జ్ఞానం 

మనం చేసే ప్రతిపనిని శ్రద్ధ, నమ్మకము, అంకితభావంతో నిర్వర్తిస్తుంటే అది మన కలలను సాకారం చేస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికమార్గంలో సంశయరహితంగా పూర్ణశ్రద్ధాసక్తులు, భక్తి, విశ్వాసం, అనన్యచింతనలతో అప్రమేయుడుతో మమేకమవుతే అంతర్యామి కృప, కరుణ, కటాక్షాలతో బుద్ధియోగంలోనికి ప్రవేశిస్తాడు. అటువంటి సాధకుడు ప్రవృత్తిమార్గంలో లేక నివృత్తిమార్గంలో విశ్వంభరుడి సాన్నిధ్యానికి చేరువవుతాడు.


అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా 

జన్మజన్మల వాసనల పరంపరంగా చంచలమైన మనసు భోగం నుంచి యోగం లోనికి పయనం సాగించడానికి సహజంగా విముఖతను కలిగివుంటుంది. 

మనిషిగా నిలబడడం తేలిక, పరుగెత్తడం 🏃 కష్టం. మనస్సుకు పరుగెత్తడంతేలిక, నిలబడడం కష్టం. అది గాలిని పిడికిలి 👊 తో బంధించడం వంటిది అన్న పార్థుడి మాటలకి సందేహనివృత్తిగా శ్రీ కృష్ణుడు ఇంద్రియనిగ్రహంతో మనోనిగ్రహమును, అభ్యాసము, వైరాగ్యముల ద్వారా చపలచిత్తంను సదా పరబ్రహ్మ యందు స్థిరముగా నిలిపి ఉంచడంద్వారా ఆత్మసాక్షాత్కారానుభవం సాధకుడి చిత్తం పొందగలుగుతుంది అని సకలమానవాళికి ఉపదేశామృతంగా అందించారు.


గీతలో బోధించే వైరాగ్యం అంటే భౌతిక వస్తువులను త్యజించడం కాదు, వాటిని భగవంతుని సేవకు, లోకకల్యాణం కోసం, జనహితం కోసం వినియోగించడం. భోగసామగ్రి యందు విరక్తి కలిగివుండడం. ఇది తాత్కాలిక వైరాగ్యాల కంటే విభిన్నమయిన యుక్త వైరాగ్యం.


పరిపూర్ణత సాధించడానికి ‘అభ్యాసము కూసు విద్య’ అనేది మనకు సుపరిచితమైన నానుడి. యోగి వేమన తేనెలొలుకు పలుకులు, ‘అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున బనులు సమకూరు ధరలోన ‘, అభ్యాసప్రాశస్యతని మనకు బాల్యంలోనే పరిచయం చేసింది.  పరిపూర్ణతనే పరిపూర్ణానందానుభూతితో మనసును పరవశం చేస్తుంది.


బలహీనమైన మొక్క 🌱 బండ రాయి 🪨 ని చీల్చుకుని వృక్షంగా ఎదుగుతుంది. అలాగే పరిపూర్ణానందం సాధించాలి అనే దృఢ సంకల్పం నీలో ఉంటే  ఆ లక్ష్యం 🎯 తప్పక నెరవేరుతుంది. 


సర్వేజనా సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

నారాయణ శెట్టి రాచపూడి 

వ్యవస్థాపకులు

రానా యోగ ఆలయ 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 



రానా కవితలు 8 జీవితం

 

జీవితం 

జీవితంలో బంధాలు

కొన్ని వస్తుంటే మధురంగా ఉంటాయి 

కొన్ని వెళ్తుంటే మధురంగా ఉంటాయి 

కొన్ని వృద్ధి చెందుతువుంటే  మధురంగా ఉంటాయి 

కొన్ని తరిగిపోతుంటేనే మధురంగా ఉంటాయి 

కొన్ని వదలుకోకపోతే మధురంగా ఉంటాయి 

కొన్ని వదులుకుంటే మధురంగా ఉంటాయి 

కొన్ని బంధాలు అప్రియ మవుతాయి 

కొన్ని అప్రియ బంధాలు మధురం మవుతాయి 

బంధాలు పుట్టుక్కుమనడానికి ఒక్క క్షణం చాలు 

కాని నిలుపుకోవడానికి ఓ జీవితకాలం కావాలి

ఈ బంధాలు తాత్కాలికం అని గ్రహించడమే విజ్ఞత!!!


జీవితంలో అవకాశాలు తలుపు తడుతూనే వుంటాయి 

కొన్ని రావడం సంతోషం ఇస్తుంది

కొన్ని రాకపోవడం సంతోషం ఇస్తుంది

కొన్ని వెళ్లకపోవడం సంతోషం ఇస్తుంది

కొన్ని అందలం ఎక్కిస్తాయి 

కొన్ని నేల చూపులు చూపిస్తాయి 

కొన్ని రావడం దుఃఖం తెస్తుంది

కొన్ని రాకపోవడం దుఃఖం తెస్తుంది

కొన్ని వెళ్లకపోవడం దుఃఖం తెస్తుంది

కొన్ని వైఫల్యాలు దుఃఖం తెస్తుంది 

కొన్ని అవమానాలను మిగులుస్తాయి 

ఓడి గెలిచినోడి అనుభవాలను తెలుసుకోవాలి 

ఓటమిలో నిలబడడం నేర్చుకోవాలి

వైఫల్యాలు వైవిధ్యఆలోచనలకు వేదిక కావాలి

అవి నూతన దశ,దిశలకు శ్రీకారం కావాలి!

కాలిలో ముల్లుగుచ్చుకుంటే నడక ఆగిపోదు,

ముల్లును తీసి జాగూరతతో ముందుకు సాగిపోవాలి,

అదేవిధంగా వైఫల్యాల అనుభవాలను సోపానాలుగా 

విజయకేతనాలను ఎగురవేయాలి!



జీవితంలో దారిద్ర్యం అంటే 

ధనం లేకపోవడం కాదు

సంపదలు లేకపోవడం కాదు 

వైవిధ్య భరిత ఆలోచనలను చేయలేక పోవడం

డబ్బుని అవసరానికి ఖర్చు చేయలేక పోవడం 

లోభం కలిగి వుండడం 

పరుల సంపదలను ఆశించడం 

ప్రభుత్వ ఉచితాలకు ప్రలోభపడడం 

వివేకం కలిగి ఉండకపోవడం 

విచక్షణ చూపించలేక పోవడం


అహంకారం కంటే ఆప్యాయత

సంపదకన్నా సంస్కారం

గర్వంకన్నా గౌరవం 

హోదా కన్నా హుందాతనం 

తీసుకోవడం కన్నా ఇవ్వడం 

మనసుకు సంతోషం కలిగిస్తుంది అని 

గ్రహించినా ఆచరించలేకపోవడం!!!



రానా కవితలు 7 విశ్వం చైతన్యభరితం

 


విశ్వం చైతన్యభరితం 

దేహామే క్షేత్రంగా నడిపించేది

ఆలోచనలను కలుగచేసేది

ఆలోచింప చేసేది 

ఆ ఆలోచనలతో నడిపించేది 

శ్వాస వెనుక వుండేది 

శ్వాసతో ముందుకు నడిపించేది 

ఆడించేది🤾‍♀️, పాడించేది🎵,నృత్యం 💃చేయించేది 

మనస్సును ఉరకలు వేయించేది 

మనస్సును నియంత్రించేది 

జీవనయానం కొనసాగించేది

అది 

వీక్షణా రహితం,

గంధ రహితం,

శ్రవణ రహితం,

స్పర్శ రహితం 

రస రహితం, 

కానీ 

శక్తి భరితం 

సదా తోడు నీడగా వుండేది 

నీలో, నాలో, మనందరిలో సంకల్పశక్తి !!


ఈ అనంత విశ్వాన్ని నడిపించేది

ఋతుపవనాలుగా సర్వత్ర విస్తరింపచేసి వర్షించేది 

శీతల పవనాలతో సేద తీర్చేది

నదులను ఉరకలు వేయిస్తూ ముందుకు సాగించేది

పుడమిని సాగుజలాలతో పలకరించేది, పులకరింపచేసేది

విత్తనంలో జీవంని ప్రేరేపించేది, జీవింప చేసేది 

పిలక,మొక్క,చెట్టుగా విస్తరింప చేసేది

పుష్పించేది,వికసించేది,ఫలసాయం అందించేది

ఆకలి కలిగించేది, ఆకలిని తీర్చేది 

సకల సృష్టికి చేయూత అందించేది

కంటికి కనిపించని

పంచభూతాత్మక శక్తులను నియంత్రించేది

ఇంద్రియాతీతంగా, గుణాతీతంగా వుండేది 

ఆది అంతంలేని అప్రమేయ స్వరూపంతో 

అవ్యక్తం, అచింత్యం అయిన 

అలౌకిక పరాశక్తి!!!


యంత్ర, తంత్ర, మంత్ర శక్తులను వక్రీకరించి 

అన్య సంపదలను ఆశింపచేసేది 

ఇతరుల పతనం కోరుకునేది

అమాయకులను మోసగించేది 

ఇతరుల ఆస్తులను దోచుకునేలా చేసేది 

స్త్రీలని మభ్యపరచేది,లోబరచుకునేది

చిల్లంగి, చేతబడి, వశీకరణ,కాటేరి 

వంటి క్షుద్రశక్తులు

దైవిక శక్తి ⚡️ లో భస్మీపటలం అయ్యేవి.

సర్వం చైతన్య భరితం, శక్తి భరితం 

సర్వం చైతన్య మయం,శక్తి మయం 

సర్వం శివశక్తి చైతన్య రూపం..

రానా కవితలు 6 ప్రేమంటే….

 ప్రేమంటే…


మనకి 

డబ్బు 💵 లంటే ప్రేమ 

నగ 💍 లంటే ప్రేమ

సంపద 💎 లంటే ప్రేమ 

పదవి, పదోన్నతిలంటే ప్రేమ 

ఆస్తులు 💰కూడబెట్టడమంటే ప్రేమ 

పేరు, ప్రఖ్యాతులంటే   ప్రేమ 

కీర్తి,ప్రతిష్ఠలంటే ప్రేమ

గౌరవ మర్యాదలంటే ప్రేమ 

అహం అంటే ప్రేమ 

సౌకర్యాలంటే ప్రేమ

విలాసవంతమైన కార్లు 🚗 అంటే ప్రేమ 

ఖరీదైన 🫰 బంగ్లాలు అంటే ప్రేమ

కాసినో, బెట్టింగ్, లాటరీలలో వచ్చే డబ్బు అంటే ప్రేమ 

షడ్రుచులతో నిండిన విందు అంటే ప్రేమ 

ప్రేమ అంటే ఇంతేనా!?

వస్తువుల మీద ఉండాల్సింది ఇష్టం, ప్రేమ కాదు 👎 


మానవతా విలువల మీద ఉండాల్సింది ప్రేమ

కమ్మనివంట కొసరి కొసరి వడ్డించే ఇల్లాలిది ప్రేమ 

పాపాయి చిరుబొజ్జని అమృతస్తన్యంతో నింపేది మాతృ ప్రేమ 

బుడి బుడి అడుగుల బోసినవ్వుల పాపాయి చూపించేది ప్రేమ 

అయిష్టంగా బడికి వెళ్లే చిన్నారి చూపుల్లో చూపించేది మీ మీది ప్రేమ 

క్షుధ్భాద తీరిన ఆర్తీ కనుల్లలోని మెరుపులే అపారప్రేమ

చుట్టూ ఉన్న చిరు జీవాల ఆకలి తీర్చే కరుణాభరితసేవ ప్రేమ 

సాధుజనుల ఆకలి తీర్చే దయాభరిత మనస్సు ప్రేమ 

ఉషోదయంని స్వాగతించే పక్షుల కిలకిల రావాలే విశ్వంభరుడి మీది ప్రేమ

అందరి ఆకలి తీర్చే రైతన్న స్వేదమే ప్రేమ 

మాతృభూమి కోసం సిపాయి చేసే ప్రాణాధారనే ప్రేమ

పరమాత్మ యందు అకుంఠితదీక్షనే ప్రేమ

అప్రమేయుడి యందు అంకితభావమే ప్రేమ

విశ్వంభరుడి యందు అనన్యభక్తినే ప్రేమ

మాధవుడికి సమర్పించే కర్మఫలాలే ప్రేమ 

అవ్యయుడి యందు అనన్యచింతనే ప్రేమ

జగద్గురు యందు సమర్పణభావమే ప్రేమ

పరోపకారమే జీవితం అనే భావన దయాభరిత ప్రేమ 

సృష్టిలోని జీవరాశి శ్రేయస్స్సును ఆకాంక్షించే మనస్సే ప్రేమ

ప్రేమ అంటే ఎంత పంచిన , అందుకున్న తరగనిపెన్నిధి..











Wednesday, 20 May 2026

ఆధ్యాత్మిక పధం 26 సర్వమతసమన్వయ గీతిక



                  సర్వమతసమన్వయ గీతిక 

అనాదిగా హైందవ సమాజం విభిన్న సంస్కృతులు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, సిద్ధాంతాలు, దృక్కోణాలు,దృక్పథాలు,నైతిక విలువల సంగమస్థావరం. హిందుత్వం ఆ సంగమస్థావరం నుండి కార్యోన్ముఖంగా నిశ్చల గంగ ఝరిలా యుగయుగాలుగా తన నిరంతర పయనం కొనసాగిస్తూనే వుంది.

నమ్మకం, విశ్వాసం,సమర్పణభావం,అంకితభావం,భక్తి శ్రద్ధలతో పరమపావని గంగమాత దరి చేరిన వారి మదిని పవిత్రం చేస్తూనేవుంది. 

మనం అంతర్గత సంస్కారాల ప్రభావంతో విభిన్న ఆలోచనాధోరణిని కలిగి ఉంటాం. అందుకే మన ఆలోచనలు, ప్రవర్తనలు, వ్యక్తిగతప్రణాళికలు, కర్తవ్య నిర్వహణలలో సారూప్యత కలిగి ఉండకపోవచ్చు.

మనలో కొందరి చిత్తం సహజంగా క్రియాశీలకం. వీరు పని రాక్షసులు. ప్రతిఫలం లేదు అంటే ఎందుకు పనిచేయాలి అనే ధోరణి కూడా కలిగి ఉంటారు. వీరు కుటుంబబాంధవ్యాలతో మమేకమవుతూ రాగద్వేషాలలో పెనవేసుకపోయి మొహభరిత జీవనయానం కొనసాగిస్తుంటారు. వీరు అపరిమిత కోరికలు, వాంఛలతో ధర్మగతిని వదిలి క్రియాశీలక జీవనానికి అలవాటు పడుతారు, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తారు. ఫలితంగా ఎవరికి ఏమైతే నా కేంటి, నాకు కాసులపంట పండితే చాలు అనే విపరీతధోరణి ప్రదర్శిస్తుంటారు.

ఇలాంటి ఆలోచనల ప్రభావంతోనే వంటనూనెలలో జంతుకొవ్వు, నెయ్యిలో కూరగాయల నూనె,పాలలో 🥛డిటర్జెంట్,యూరియా, ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ 🍦 లలో మల్టోడిస్రీన్ అనే హానికరమైన కెమికల్, పసుపు, జీలకర్రలలో సింథటిక్ కలర్స్, కారం, కుంకుమలలో ఇటుకపొడి, మిరియాలలో బొప్పాయి గింజలు, మనం ఇష్టంగా తినే మామిడి🥭,ఆపిల్🍎,పుచ్చకాయ 🍉లు కూడా కల్తీలుగా, కాదేదీ కల్తీకి అనర్హం అంటూ ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీరు ఇలా మూటలుగట్టి పాపకర్మలు, నీచకర్మలు ఆచరిస్తూనే ఉంటారు.

వీడు ఎంత సంపాదించినా💰తనలోని బాధలను , అమ్మలేడు..తను తాపత్రయపడే సంతోషాన్ని, కొనలేడు..ఆరోగ్యాన్ని, అరువు కూడా తెచ్చుకోలేడు...మనఃశాంతిని ఎప్పటికీ పొందలేడు.అని గ్రహించలేని మందబుద్ధి.

వీరు పుణ్య తీర్థాలలో చేసే నదీస్నానాలు,ఉపవాసాలు, జపాలు, దానాలు,పూజలతో పుణ్యం లభించదు.హృదయంలో పరివర్తనం రానంతవరకు ఎన్నిసాధనలు చేసినను  వాటి ప్రయోజనం శూన్యం.

ఇటువంటి అల్పుడు,అజ్ఞానికి ఆధ్యాత్మిక భావనలు అతని కలుషిత హృదయంలోనికి ఏలా చేరుకుంటాయి!! వీటి ఫలితంగా లక్ష్యం 🎯 నందు గల ఆసక్తి లక్ష్యసాధనలో పూర్ణంగా కొరవడుతుంది.

అయితే చేసిన పాపకర్మలకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో అప్రమేయుడికి అంకితభావంతో సమర్పణ చేస్తూ, ప్రతిఫలాపేక్ష రహితంగా నిష్కామకర్మచరణ అనుష్ఠానం ద్వారా వారికి ఆధ్యాత్మిక మార్గంలో పయనం సుగమం అవుతుంది.

కొందరి ప్రవర్తన సహజంగా ఉద్వేగభరితం.వీరు భక్తిమార్గం లోనికి ఆకర్షింపబడి ఆ మార్గం అనుసరిస్తారు.

అయితే వీరిలో కొందరు ఆచారాలు, సంప్రదాయాలను వక్రీకరించి జాతివివక్షణతో సమాజాన్ని కులాలుగా విడదీస్తూ హైందవ సమాజ పురోగతికి అడ్డుగోడలవుతున్నారు!

మరి కొందరు మూఢభక్తి, మూఢనమ్మకాలు,అంధవిశ్వాసాలతో ఇష్ట దేవతారాధనలలో, జాతరలలో జంతుబలులను నైవేద్యంగా సమర్పిస్తూ తమ వాంఛలను, కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు! సర్వం పరబ్రహ్మ చైతన్య స్వరూపం అయినపుడు తమ కోరికలు, వాంఛలను నెరవేర్చుకోవడం కోసం ఇతర ప్రాణులను జంతుబలులుగా సమర్పించడం ఏలా సమర్ధనీయం!? ఇది విశ్వసౌభ్రాతృత్వమును అవహేళన చేయడమే అవుతుంది కదా? ఇటువంటి ధోరణితో ఆత్మపౌమ్యస్థితికి ఎలా చేరుకుంటారు? మీ ఇష్టదైవం ఇలాంటి చర్యలను హర్షిస్తాడా? ఆయన అనుగ్రహం ఆశించడం అంటే అది వాస్తవానికి అపాత్రదానమే అవుతుంది కదా?

దైవదర్శనంలో నూతన పోకడలుగా విశిష్ట దర్శనం,విశేష దర్శనం, శ్రీఘ్ర దర్శనం, నేత్రదర్శనం అని భక్తుల పర్సులను ఖాళీ చేయడం ఎంతవరకు సమర్ధనీయం? 

నేటి ప్రభుత్వాలు అగ్నికి ఆజ్యంలా భక్తులు భగవంతునికి సమర్పించే మాన్యాలు, నగలు,హుండీకానుకలను చెరపట్టి స్వామివారి సంపదలను అక్రమంగా అనిర్దేశిత కార్యాలకు తరలిస్తూ భక్తుల మనోభావాలకు తీవ్ర విఘాతం కలిగించడం ఎంతవరకు సమర్ధనీయం?

ఇటువంటి అనైతిక అనాచరణ సాంప్రదాయాల ఆచరణలతో జీవిత విలువలకు తిలోదకాలు ఇస్తూ పతనం అంచులకు చేరుకుంటారు. ఈ ఊసరవెల్లిక్షేత్రాలు బీడుభూములు గాకుండా వ్యవసాయక్షేత్రాలుగా ఏలా అవుతాయి?

ఆధ్యాత్మిక భావనలలో గల ప్రీతి, ఆసక్తి , పవిత్రత, సమర్పణ, అంకిత భావం వీరి ఆచరణలో లుప్తం అవుతుంది . సాధ్యవస్తువు నందు ఉన్న అపారప్రీతి సాధనలో వీరికి రిక్త హస్తాలతో శూన్యంగా మిగిలి పోతుంది.

కారుణ్యమూర్తి, పరమ దయాసాగరుడు అయిన సర్వాంతర్యామిని ఎవరైతే తమలోని అహంకారన్ని సంపూర్ణంగా త్యజిస్తూ ఆత్మతత్వమును అర్ధం చేసుకుని హృదయమును పరిశుద్ధం చేసుకుంటూ దృఢచిత్తం, అంకిత భావం,సమర్పణభావనలతో విశ్వసౌభ్రాతృత్వమును ఆకాంక్షిస్తూ, ఆ సర్వేశ్వరుడి అనుగ్రహంకోసం సదా పరితపిస్తూ వుంటారో వారి యోగక్షేమాలను ఆ అప్రమేయుడు స్వయంగా స్వీకరిస్తారు,వారి ఆధ్యాత్మిక మార్గపయనం సుగమం అవుతుంది. అంతర్యామి అనుగ్రహం, కృపలకు ప్రీతిపాత్రులు   అవుతారు.

కొందరి ఆలోచనలు ఉపాసనశీలమైనవి, వారు అంతర్ముఖులుగా ధ్యాననిష్ఠను కలిగి ఉంటారు,

వీరు శుద్ధచైతన్య సాత్వికస్వభావంతో ఇతరులకు హాని కలిగించే ఆలోచనలు మదిలో కూడా తలంచరు. ఇతరుల హితం ఆకాంక్షింస్తూ అందరి యందు సౌభ్రాతృత్వం కలిగివుంటారు. లోక కళ్యాణం ఆశిస్తూ సర్వాంతర్యామిని ఆరాధిస్తుంటారు. అహంకార రహిత కర్తృత్వభావనతో ఆదర్శప్రాయులుగా, మార్గనిర్దేశకులుగా ఆధ్యాత్మిక పురోగతిలో ముందడుగులేస్తుంటారు. అయితే వీరిలో కొందరు తమ ప్రవర్తనలో అహంకారస్వభావులుగా, భోగసామగ్రి యందు మక్కువ కలిగి వాటిని పోగుచేస్తుంటారు.

కొందరు ధీశక్తిమంతులు. శుద్ధ చైతన్య స్వరూపులు, వివేక,విచక్షణభరిత భావనలతో వారు జ్ఞానమార్గంలో పయనిస్తారు. మానవాళికి శుభం,క్షేమం,శ్రేయస్సు కలగాలని అందరి జీవితాలు మంగళకరం కావాలి అనే ఆకాంక్షతో అనుష్ఠానం చేస్తువుంటారు. ఆలయదర్శనం, పూజలు,క్రతువులు, హోమాలు,యజ్ఞాలు నిర్వహించకపోయిన సదా తమ హృదయ క్షేత్రంలో స్థితుడైన భగవంతుని మనోనేత్రంతో వీక్షిస్తూ అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తూ సోమరసపానంతో ఉంటారు. వీరు జీవన్ముక్తులు. ఈ జీవితకాలంలోనే భగవంతుని అనుగ్రహం పొందిన దివ్యాత్ములు.

దృక్పథం,దృష్టికోణం,వివేకం,తత్వదర్శనంలతో ఎందరో మహానుభావులు తత్వజ్ఞానులుగా తమ విశేష మేధ, ప్రజ్ఞ, జ్ఞాన నిధులతో హైందవ సమాజానికి కరదీపికలుగా మార్గదర్శులుగా నిలిచి తమ తాత్వికభావనలతో ప్రవక్తలగా లబ్ధప్రతిష్టలతో స్వయంప్రకాశితులుగా అజరామర కీర్తిని గడించారు. 

బ్రహ్మము మాత్రమే సత్యం, ప్రపంచం మిథ్య, జీవుడు బ్రహ్మమే. జ్ఞానం ద్వారా మాయను తొలగించి జీవుడు బ్రహ్మలో లీనం కావడం మోక్షం అని అఖండ భారతం పర్యటిస్తూ జ్ఞానబోధ గావించిన మహనీయుడు, మానవీయుడు  అద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ శంకరాచార్యులు. విష్ణుసహస్రనామాలకు వ్యాఖ్యానం వ్రాసి శివకేశవలిరువురూ ఒకటేనని బోధించిన దివ్యజ్ఞాని.

శరణాగతి, అనన్యభక్తి, అనన్య చింతనల ద్వారా పరమాత్మ శ్రీమన్నారాయణుడుని చేరువవ్వడం మోక్షం అని ప్రభోదించిన విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజాచార్యులు సమతమూర్తిగా విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఈ సమతామూర్తి తమ ఆధ్యాత్మిక ప్రవచనాలద్వారా భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానమేనని, కుల వివక్ష పనికిరాదని ఎలుగెత్తి చాటారు. నిమ్న జాతుల వారికి ఆలయ ప్రవేశం కల్పించారు. శిథిలావస్థలో ఉన్న అనేక వైష్ణవాలయాలను పునరుద్ధరించారు. ‘ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశామృతంగా మానవాళికి అందించారు.

జీవుడు (ఆత్మ) వేరు, ఈశ్వరుడు (పరమాత్మ) వేరు. దేవుడు సర్వోత్తముడు, జీవుడు సేవకుడు.సద్భక్తి ద్వారా భగవంతుని సేవించి పరమపదం చేరుకోవచ్చు అని ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన ప్రముఖ హిందూ తాత్వికుడు పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ శ్రీ మధ్వాచార్యులు. శ్రీకృష్ణుడే పురుషోత్తముడు, సర్వోత్తముడని భక్తి మార్గాన్ని, తత్త్వవాదాన్ని దశదిశల వ్యాప్తి చేశారు.

మార్పులేని పరమ సత్యమైన బ్రహ్మం శివుడు. విష్ణువు శివుని యొక్క అత్యున్నత అవతారం, శివుడు విష్ణువు యొక్క అత్యున్నత అవతారం అని శివకేశవులు పరమాత్మ స్వరూపభావనతో తరించిన తత్వవేత్త, శివుడే పరమాత్ముడని, సృష్టికి మూలమని అని ప్రబోధించిన శివ విశిష్టాద్వైత సిద్ధాంతప్రవక్త, సిద్ధాంత శిఖామణి శ్రీకంఠ శివాచార్యులు. 

బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అయితే సాధకులు సాధనతో చేరుకునే మార్గాలు విభిన్నం, కానీ వాటి పరమార్ధం ఒక్కటే అని స్వమతసంస్తుతి , స్వమార్గపరిపోషణలకు అతీతంగా సౌభ్రాతృత్వంతో మానవాళి విరియాలి అని సర్వయోగసమన్వితగా  గీత ప్రబోధిస్తుంది. హిందుత్వం అనేది ఓ మతప్రతిపాదిక విధానం కాదు అది మానవాళికి జీవనశైలి, జీవనయానం, పరమాత్మకు చేరువచేసే ముక్తిమార్గం.

సర్వేజనా సుఖినోభవంతు

మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 


ధ్యాన మాలిక జూలై 26 సంచికలో ప్రచురితమైనది.




Saturday, 4 April 2026

ఆధ్యాత్మిక పధం 25 విశ్వం విష్ణు స్వరూపం

 


విశ్వం విష్ణు స్వరూపం 

అజరామరం, అద్వితీయం , అనంతం , అప్రమేయం అయిన ఈ విశాల విశ్వం ఓ మహా ద్రవ్యరాశి. అవ్యక్తం, అచింత్యం మయిన ఈ సృష్టి సాక్షాత్ ఆ విశ్వంభర దివ్యస్వరూపం.  

పరబ్రహ్మ సృష్టికర్త, పరబ్రహ్మ పదార్థం ఆయన సృష్టి. ఈ పరబ్రహ్మ పదార్థం మహిమాన్వితం, చైతన్యవంతం, జీవభరితం. ఈ జీవభరిత జీవనపదార్ధం అనంత విశ్వంలో విష్ణువుగా విస్తరించిన దివ్యపదార్థం. ఇది నిరాకార, నిర్గుణ సహిత జీవాత్మగా కల్పారంభంలో పరమాత్మ నుంచి ఆవిర్భవించిన మరణం ఎరుగని మనలోని జీవాత్మ.

సృష్టి, సృష్టికర్త వేరు వేరు కాదు అని అంతర్ముఖుడు అయిన తత్వవేత్త ఎరుకతో గ్రహించిన సత్యశోధన. తత్వవేత్త అయిన యోగీశ్వరుడు అవిభాజ్యమైన పరమాత్మ సృష్టిలో, ప్రతి జీవిలో పరమాత్మ స్వరూపం అయిన జీవాత్మ అని గ్రహించాడు, మనోనేత్రంతో వీక్షించాడు, తరించాడు. ఈ తత్వదర్శి అయిన జ్ఞాని ఏ జీవికి అపకారం కల్గించే ఆలోచనను మనస్సులో కూడా తలంచడు.  ఈ కర్మ యోగి పరమాత్మకు అత్యంత ఇష్టసఖుడు, అతనిలోనే ఉపద్రష్టగా ఆసీనుడవుతాడు.

అవ్యక్తం అంటే కంటికి గోచరం కానిది, అంటే దృష్టి 👁️ కి అందనిది. మానవ నేత్రం చూడలేనిది, అంతే కానీ ఏమీ లేదు అనే శూన్యం అజ్ఞానం కాదు.

బావిలోని కప్ప 🐸 దృష్టి పరిమితం అంటే బావిని దాటి బయటకు చూడలేడు. దాని దృష్టిలో ఈ ప్రపంచం ఇంతకు మించి ఏమీ కాదు.

అచింత్యం అంటే ఊహలకు, ఆలోచనలకు అందనిది.

అదే  మండుకం యాదృచ్ఛికంగా ఓ కొండ కొలనుకు చేరితే దాని ఆలోచన పరిధి, ఊహలలో ఈ ప్రపంచం అది తను ఉన్న బావికంటే, కొలను కంటే విస్తృతం, విశాలం అని భావించవచ్చు. మనం ఈ కుటస్థ మండుక స్వభావాన్ని కలిగి వుంటాం, ప్రదర్శిస్తూంటాం.


ఈ అనంత విశ్వం 🪐 కూడా సామాన్య దృష్టికి అవ్యక్తం, అచింత్యం, 

మేధావి, జ్ఞాని, జిజ్ఞాసి,తత్వవేత్త, జితేంద్రియుడు, యోగీశ్వరుడు, అంతర్ముఖుడు, సత్యాన్వేషి, శాస్త్రవేత్త, సాధువు,శాస్త్రజ్ఞుల దృష్టిలో ఈ విశ్వం అసామాన్యం, అప్రమేయం,అద్వితీయం, అజరామరం.

ఆరు బయట వినీల ఆకాశాన్ని రాత్రి సమయంలో ఆసక్తితో వీక్షిస్తే అసంఖ్యాక నక్షత్రాలు, నక్షత్రమండలాలు , నక్షత్రరాశులను మన కన్ను చూస్తుంది. ఇవి అన్ని సృష్టిలోని ఓ పాలపుంత “గెలాక్సీ “ కుటుంబసభ్యులు మాత్రమే. ఓ అధునాతన టెలిస్కోప్ వ్యవస్థ 🔭 ద్వార ఈ అనంత విశ్వంలో అనేకానేక పాలపుంతలను వీక్షించవచ్చు. ఈ అపూర్వ ఖగోళ జ్ఞానం కోసం మీ కుటంబ సభ్యులతో ఓ సారి నక్షత్రశాలను తప్పక దర్శించండి. మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే ఖగోళ విశేషాలను, నక్షత్రాలను, తోకచుక్కలను, ఉల్క ☄️ లను, సౌరకుటుంభం, పాలపుంతల అనుభూతులను సొంతం చేసుకోండి. 


ఈ విశాల విశ్వంలో ఓ గెలాక్సీ 🌌 లోని అనంత నక్షత్రాల సమూహల సముదాయంలలో మన కంటికి గోచరించే అతి దగ్గరి నక్షత్రం సూర్యుడు 🌅ఈ సౌరకుటుంబంలోని నవగ్రహాలలో మనం నివసించే ఈ భూమి 🌍ఓ గ్రహం మాత్రమే! మనకు దగ్గరిగా అగుపించే చంద్రుడు 🌒 ఈ భూమికి ఓ ఉపగ్రహం మాత్రమే. ఈవిశాల విశ్వంలో మనం నివసించే భూమి పరిమాణం అల్పం, బహుశా సముద్రంలో ఓ నీటి చుక్క లాంటిది!! 

ఇంతటి అల్పపరిమాణంలో ఉండే ఈ భూమండలంలో నీ దేశం సూక్ష్మం. అందులో నీవు నివసించే నగరం అతిసూక్ష్మం. ఈ అతిసూక్ష్మంలో నాది అని భావించే పొలాలు,ఇల్లు,పాడి పంటలు, మణులు మాణిక్యాలు, నగలు,సంపదల పై ఇంతటి తాపత్రయం, మోహం, అపేక్ష అవసరమా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సమాధానం మీకే అవగతం అవుతుంది.


సృష్టి, స్థితి,లయ,తిరోధాన,అనుగ్రహం అనే పంచ కృత్యముల విధాత సర్వాంతర్యామి !!

మనం తీసుకునే శ్వాస ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన,సమాన పంచప్రాణాలుగా జీవుడి మనుగడకు అధిపతిగా అంతర్యామిగా జీవులలో ఉపస్థితుడు.  

మనం ఆశించి,కాంక్షించి,వాంఛించి,అపేక్షించి మన ఇష్టదైవానికి సమర్పించే భక్తిపూర్వక ప్రార్థనలు, నామ స్మరణలు, సంకీర్తనలు, అర్చన పూజలు, వ్రతాలు, క్రతువులు, హోమాలు, యజ్ఞాల వంటి సకామ కార్యకర్మలు మీకు ఇష్ట ఫలాలను అనుగ్రహించవచ్చు, కానీ ఇది అన్యభక్తి మాత్రమే. సకామకార్యకర్మ ఫలాలకు అతీతమైనది ప్రతిఫలాపేక్ష రహితం అయినది అనన్యభక్తి.


శ్రీ కృష్ణ పరమాత్మ ప్రబోధించిన మహామంత్రం “అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || “


అనన్యభక్తితో దైవాన్ని ధ్యానించే భక్తుని యోగక్షేమాలను దైవమే భరిస్తాడు!! 

అప్రమేయుడు, అంతర్యామీ, సర్వేశ్వరుడైన భగవంతుడి అనుగ్రహం పొందానికి అనన్యభక్తి సాధనే జీవితపరమార్ధంని అవగతం చేసే మహామంత్రం!!!

ఈ ప్రపంచంలో నీవు ఒంటరి వాడివి కాదు అని పరమాత్మ ఇస్తున్న అనుగ్రహపూర్వక అమృతవాక్కు!!!

ఇది ఊగిసలాడే మనస్సుకు ధైర్యం, అలసిన హృదయానికి స్వస్థత,అనిశ్చితిలో అలమటించే ఆత్మకు నిలయదార్శనం…

భక్తి అంటే ఒక సంప్రదాయం, ఆచారం కాదు అది జీవనవేదం, జీవనసారం.

ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ద్యాసతో కూర్చోవడం కాదు, అది మనస్సులో అంతర్వాహిని..

దేవుడు సుదూరంలో కాదు, హృదయాంతరాలలో ఉపస్థితుడు.

భక్తుడు దైవాన్ని అనన్య చింతన, భక్తి శ్రద్ధలతో అనుసరిస్తున్నట్టు అగుపించినా, వాస్తవానికి దైవమే భక్తుని చేతిని పట్టుకొని యోగక్షేమ మార్గంలో నడిపించే మార్గదర్శి.


సర్వేజనా సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 

Thursday, 19 March 2026

రాన కవితలు 5 అపరిగ్రహం

 

అపరిగ్రహం 


వర్షించే మేఘాలు 🌧️నిరాపేక్షగా 

పుడమి తల్లి దాహం తీరే వరకు,

నది జలాలు 🌊తమ దాహం కోసం 

ఊటబావి నీళ్లు తమ కోసం 

పంటకాల్వలలోని సాగునీరు తమకోసం 

సరస్సులు 🏝️తమ మధుర జలాలను తమ కోసం

మంచి నీటి చెలమలు చివరి నీటిబొట్టు వరకు 

కొద్దిపాటి జలాలను కూడా దాచుకోవు, వాడుకోవు 

అనాసక్తిగా సంపదలను జీవరాశి మనుగడ కోసం

అపరిగ్రహంగా ఇవ్వడం మాత్రమే వాటికి తెలుసు !!!


కూరగాయపాదులు తన కూరగాయలను ,

చెట్లు 🌴తమ మధుర ఫలాలను ,

పూల వనాలు విరభూసిన పరిమళ భరిత 🌸పుష్పాలను,

పండ్ల తీగలు తమ 🍇పండ్లను,

పండ్ల తోటలు తమ ఫలసాయాన్ని,

తమ కోసం దాచుకోవు, వాడుకోవు 

అపరిగ్రహంగా ఇవ్వడంలో ఆనందం ఆస్వాదిస్తాయి!!


విత్తనంగా వున్న తనని 🐜చీమలు,

మొలకగా 🌱వున్న తనని 🦆పక్షులు,

మొక్కగా వున్న తనని పశువులు 🐄తినాలని చూస్తాయి,

అయితే ?!

అదే 🌴చెట్టుగా ఎదిగిన తరువాత 

శుచిర్దక్షగా,అనపేక్షగా,ఉదాసీనంగా, అపరిగ్రహంగా 

చీమలు, పక్షులు,పశువులను తన నీడలో సేద తీరుస్తుంది!

రాయి విసిరే చేతికి మధుర ఫలాలనే 🥭కానుకగా అందిస్తుంది!!


పక్షులకు నివాస 🪺స్థానంగా,

గురుకులంలో ఆసనస్థానంగా, 

ప్రకృతి ప్రేమికులకు వనాలలో ట్రీ హౌస్ గా,

సాధువులకు సత్సంగ వేదికగా,

రాజుగారికి సింహాసనంగా

అలలారిస్తుంది!!


ప్రార్థన మందిరాలలో 🕍ద్వారంగా ,

దైవదర్శనానికి ప్రవేశద్వారంగా ,

దేవాలయాలలో 🛕ధ్వజస్తంభంగా,

జగన్నాథుడు 🔱 దారు విగ్రహమూర్తిగా,

శోభ యాత్రలో జగన్నాథ రథంగా,

ఊరేగింపు సేవలో పల్లకిగా 

విరాజిల్లుతుంది!!!


ప్రకృతిలో సర్వం అపరిగ్రహ భావనతో 

మమేకమై సహజీవనం కొనసాగిస్తున్నాయి!!


లోభం, మొహం,క్రోధం, అహంలను 

ధరిచేయని వ్యక్తి పరిపక్వత సాధించిన 

మానవీయుడు, మహానీయుడుగా 

అప్రమేయుడు, అవ్యయుడు, విశ్వంభరుడి

సన్నిధిలో ఆనందభరిత

జీవనయానం కొనసాగిస్తాడు!!!







Friday, 13 March 2026

ఆధ్యాత్మిక పధం 24 అకర్మణ్యత్వం

 

అకర్మణ్యత్వం 

మనం చేసే ఏ పని అయినా కర్మనే అవుతుంది. జీవుడు కర్మ బద్దుడు. తన పనులు తను చేయడం అతని కర్తవ్యం కూడా! అందుకే కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు అని విశ్వంభరుడు జగద్గురువుగా మానవవాళికి ప్రబోధించాడు. 

సమాజంలో ఓ విపరీత పోకడను ప్రత్యేకించి ఉన్నత మధ్యతరగతి, ధనికవర్గలలో మనం గమనించవచ్చు.

ఈ తరగని ఆస్తులను సంపాదించడం నా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకుండా సుఖంగా వుండాలి అని ఆశించడంలో తప్పు ఏముంది, ఇది నా బాధ్యత కూడ కదా?

ఇక వారి పిల్లలు మేమెందుకు పనిచేయాలి ? మా పెద్దలు సంపాదించిన తరగని ఆస్తులు మా వెంట వున్నాయి కదా?

నేనెందుకు కష్టపడి చదవాలి, కావలసిన కోర్సులలో సీటు మా నాన్న కొనిస్తాడు కదా?

ఓ రైతు  స్వేదం చిందిస్తూ ఈ వ్యవసాయం ఎందుకు చేయాలి? ఈ పొలాలను ప్లాట్స్ గా అమ్ముకుంటే డబ్బే డబ్బు వస్తుంది  కదా?

ఈ ఆలోచనాదృక్పథంతో ఆ అప్రమేయుడియందు కర్తవ్యం నావంతు, కాపాడుట నీవంతు అనే ధోరణి కలిగివుంటారు.


పనిచేయకుండా ఉండడమే గొప్పతనం అనే భావనతో ఉండడం అనేది అకర్మణ్యత్వం కాదు. ఇది పని చేయకపోవడానికి సాకులు వెదకడం, వాస్తవానికి ఇది పనిని విడిచిపెట్టే ధోరణి. ఇది ఆటిట్యూడ్, నిర్లక్ష్యం, అనిబద్ధత, అవివేకం, బద్ధకం , సోమరితనం, నిరాసక్తత, అనాశక్తతలతో కలగలిసిన తమోగుణ స్వభావమే అవుతుంది.


పనులు చేయడంలో నిరాశక్తత కలిగివుండడం అకర్మణ్యత్వం అయితే అది పలుసందర్భాలలో అభిలషణీయమే!

పగ, ప్రతీకారం, కక్ష సాధింపులలో రగిలిపోతూ వాటిని సాధించే శక్తి, యుక్తులు, సమర్ధత పుష్కలంగవున్నా, అహంకార రహితంగా నీ సమర్ధతపై అసమర్ధుడిగా అకర్మణ్యత్వం ప్రదర్శించడం సాత్వికగుణసంపన్నుడిగా, ఉన్నతుడిగా నిన్ను తీర్చిదిద్దుతుంది.

వార్ధక్యం, అనారోగ్యకారణంగా ఏ పని చేయకపోవడం అకర్మణ్యత్వం.

శిశువు, బుద్ధిహీనుడు చేసే ఏ పనైనా అకర్మణ్యత్వమే. 

అవ్యయుడు, అప్రమేయుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మ యందు ఆరాధన, ఉపాసన, ఉపవాసం, అనన్య చింతన, అనన్యభక్తి, శ్రద్ధాసక్తులు కలిగిన నిష్క్రియాతత్వమే ఆచరణపూర్వక అకర్మణ్యత్వం. 

మనం చేసే ప్రతి పనికి కర్మఫలం ఉంటుంది. అవి చేసే పనులు సత్కర్మలు అయితే పుణ్యకర్మలుగా, చేసే పనులు దుష్కర్మలు అయితే పాపకర్మలుగా అవుతాయి. ఆ కర్మ ఫలాలు నశించే వరకు తిరిగి పలుజన్మలు తీసుకుంటూ వాటిని అనుభవించి తీరవలసిందే.  ఎవరైతే కర్మఫలాలను ఆశించకుండా నిష్కామభావనతో కర్మలను ఆచరిస్తూవుంటారో వారిని ఆ కర్మ ఫలాలు బంధించవు అనేది కర్మ సిద్ధాంతం.


జ్ఞానులు, సాధువులు , జిజ్ఞాసువులు, శాంతి కాముకులు సాత్వికగుణసంపన్నులుగా సదా కర్మలు ఆచరిస్తూనే వుంటారు, కానీ వాటి పరమార్ధం కేవలం లోకకళ్యాణం, సమాజహితంలను ఆకాంక్షిస్తూ ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరిస్తూవుంటారు, అదే అకర్మణ్యత్వం యొక్క వాస్తవదృష్టి 👁️కోణం. ఇదే బ్రహ్మచర్య దీక్ష !!!

పుణ్యక్షేత్రాలలో, ప్రార్థన మందిరాలలో, దేవాలయాలలో ఆర్తులకు, అన్నార్తులకు అందించే సహాయకచర్యలు, సేవాకార్యక్రమాలు కర్తృత్వభావనరహిత కర్మాచరణే అకర్మణ్యత్వం.

ఏ క్షణం నుంచి అయితే నీ 🧠 మస్తిష్కంలో ఆలోచనలు, మనసా, వాచ చేసే సకామకర్మలు  కేవలం ఇతరుల హితం ఆకాంక్షిస్తూ ఉంటాయో , ఆ క్షణం నుండే మనస్సులో మానవీయత 🌸వికసిస్తుంది !!! వికసిత మానవత్వంతో మానవీయుడవు, మహనీయుడవు అవుతావు!! నీవు చేసే సకామకర్మలు కూడా నిష్క్రియకర్మలుగా పరివర్తనం అవుతాయి. 

అంతఃకరణం కడిగిన స్వాతిముత్యం  అవుతుంది. అంతఃకరణశుద్ధి ద్వార మనస్సులో జ్ఞానం వికసిస్తుంది, జ్ఞాననేత్రం జాగృతి అవుతుంది. జ్ఞానోదయంద్వార పరమాత్మ తత్వం బోధపడుతుంది.

మనం విమానంలో 🛫 ప్రయాణం చేస్తున్నాం అది చాలా వేగంగా దూసుక పోతువుంటుంది అది కర్మ. కానీ విమానగమనం, ఒడిదుకులకు, టర్బులెన్స్ లకు ప్రశాంతంగా నీ 💺 సీటు లో  నిశ్చలంగా ప్రయాణం కొనసాగించే తీరు అకర్మ.  విమానంలో ప్రయాణం కొనసాగిస్తున్న ఈ ప్రయాణంలో నీవు కేవలం సాక్షి అనే భావనతో కొనసాగిస్తే అది అకర్మణ్యత్వం. 

అకర్మ అనేది మనం చేసే పని తీరును చెబితే, అకర్మణత్వం అనేది ఆ పని చేస్తున్నప్పుడు మనలో ఉండే కర్తృత్వ భావన లేని ఉన్నతస్థితి.


నిష్పక్షపాతంగా ఇచ్చే తీర్పు⚖️ అకర్మణ్యత్వం!

నిస్వార్ధరహితంగా రోగికి అందించే వైద్యం 🩺అకర్మణ్యత్వం!

న్యాయబద్ధంగా అమలు చేసే రాజదండన అకర్మణ్యత్వం!

ప్రతిఫలాపేక్షారహితంగా చేసే ప్రతికర్మ నిష్క్రియతత్వంతో కూడిన అకర్మణ్యత్వం!

ఒక జ్యోతి 🪔అనేక జ్యోతులను ప్రజ్వరిస్తూ వెలుగులను పంచుతున్నా తనలోని వెలుగు అంతే దేదీప్యమానంగా ప్రకాశిస్తు ప్రకటితం అవుతుంది. అదే విధంగా ఓ జ్ఞాని, గురువుగా ఇతరుల హృదయాంతరాలలో జ్ఞానజ్యోతి ప్రజ్వలనలకు ఆలంబనగా అవుతాడో ఆ మహానీయుడు మూర్తీభవించిన అకర్మణ్యత్వస్వరూపం!!!


పర్యావరణ 🌴పరిరక్షణ, వన్యప్రాణి 🦌సంరక్షణ, నదీజలాల 🌊పరిరక్షణ, ప్రకృతి 🌴 సమతుల్యతల సంరక్షణ, పుడమి పరిరక్షణ , జీర్ణాలయ పునరుద్ధరణ, దీనజనోద్ధరణ, అభయారణ్య పరిరక్షణ లాంటి క్రియాశీలక కార్యాలకు సమర్పితభావనతో హృదయపూర్వక చేయూత, సంఘీభావం లోకకల్యాణ యజ్ఞక్రియలవుతాయి. యజ్ఞక్రియలన్నీ నిష్కామకార్యాచరణలవుతాయి. అవి ప్రారబ్ధ కర్మ బంధనాలను కూడా దగ్ధం చేయగల ప్రభావవంతం. 

యజ్ఞక్రియలను నిష్కామకార్యాచరణస్థితిగా, అకర్మణ్యత్వభావనతో మనస్సు స్వీకరిస్తుంది. ఆ అకర్మణ్యత్వం పరమాత్మకు చేరువచేస్తుంది. 

మనస్సును ప్రశాంతభరితం చేస్తూ ఆ పరంధామం చేరుకునే ముక్తి మార్గంని సుగమం చేస్తూ ముక్తినాథుడి సన్నిధికి చేరుస్తుంది.


సర్వేజనా సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 






Tuesday, 24 February 2026

ఆధ్యాత్మిక పథం 23 జీవన సాధన


జీవన సాధన 


అవ్యక్తంలో జీవన సమరం ఆరంభించి అసంఖ్యాక శుక్రకణాల పోరాటంలో విజేతగా నిలిచిన ఓ శుక్రకణం అండజంతో కూడి మాతృగర్భ ప్రవేశంతో తన ప్రస్థానం మొదలవుతుంది,  తిరిగి అవ్యక్తంలోనికి చేరుకోవడంతో ఈ జీవన సమరంతో కూడిన మహాప్రస్థానం🪦 ముగుస్తుంది. 

ఈ జీవన సమరమే జీవితం, అది జీవించడానికే.. జీవించడమే నిజానికి జీవన సాధన! 

మనం భగవంతుడి పట్ల ఎరుకతో అంకితభావంతో చేస్తే అదే అద్భుతమైనసాధన అవుతుంది,

మట్టిలో నాటిన విత్తనం మూడోరోజుకి 🌱మొలకెత్తుతుంది, అదే, కాలక్రమంలో అనేక క్లిష్టపరిస్థితుల్లని అధిగమిస్తూ చెట్టుగా 🌴ఎదిగి పూలు 💐 , పండ్లు 🥭, నీడనిస్తుంది, సేద తీరుస్తుంది, 🕊️పక్షులకుఅవాసమవుతుంది, లోకానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది.

ప్రతిఫలం ఆశించకుండా  🌊 నీరు 🌅ఉష్ణతాపంతో ఆవిరిగా పరివర్తనచెంది కారుమబ్బులుగా 🌧️ సుదూర దూరాలు పయనం సాగించి వర్షించి పుడమి తల్లిని పులకరింపచేస్తు, బీటలువారిన భూములను పంటభూములుగా మారుస్తూ , 🏞️నది జలాలుగా,  సాగునీరుగా, 🚰త్రాగునీరుగా దప్పికలను తీరుస్తూ,చల్లటిగాలిగా స్వేచ్చగా వీస్తూ ప్రాణికోటి సేద తీరుస్తుంది.

ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా, పరోపకారమే లక్ష్యంగా కొనసాగుతుంది.

మన జీవితమూ కూడా అలానే సాగిపోవాలి. అడుగడుగునా నడవడిక, ప్రవర్తనలలో మానవత్వం వెల్లివిరాయాలి.


ఒక జ్యోతి🪔 మరొక జ్యోతిని వెలిగించినట్లు,  మనిషి దయ, కరుణ,జాలి, ప్రేమ పూరిత ఆలోచనలు, భావనలతో పదిమంది జీవితాల్లో వెలుగులు నింపాలి, అలాంటి  జీవితసాధనలోనే ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది, అది దివ్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది, జీవితంలోని రహస్యం, ‘దివ్యత్వం ఏంటి అనేది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన’ అని పరమహంస యోగానంద పేర్కొన్నారు.

మానవ జన్మను భగవంతుడి ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా రెండు చేతులూ పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి, అందులోని తాత్వికతను గుర్తించాలి,

సాధారణ మనిషి కూడా సాధనవల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు,

అందుకు:

  • అన్ని విషయాల్లోనూ దృఢచిత్తం కలిగి ఉండి , వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి,
  • ఏ పని చేస్తున్నాసరే, అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఉండాలి, తన ప్రజ్ఞను వదులుకోకూడదు.
  • మాట, ఆలోచన, చర్య ప్రతిదానిలోనూ స్వచ్ఛత, సహనం,మంచితనం ప్రతిబింబించాలి, అప్పుడు, అంతరంగం దివ్యమైన ఆనందమయమైన  అనుభవాలను పోగుచేస్తుంది, ఆ దివ్యానుభవాలే ,అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనలవుతాయి. 

అలౌకిక అనుభూతి పొందడానికి తన మనసును గెలుచుకున్న జితేంద్రియుడుగా ఎదగాలి, పరమాత్మ యందు అనన్యచింతన కలిగివుండాలి. ఇందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి. తనలోని అన్ని కోరికలను సమర్పణ భావనతో ఆ మాధవుడికి సమర్పించుకోవాలి.

శ్రద్ధ, సహనం, అంకితభావనలతో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి,

ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి,

ఈ ప్రయాణంలో ఎక్కడా అలసిపో కూడదు. విజయ దరహాసంతో, తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోవాలి, అప్పుడే మనిషి జీవనసాధన ఫలిస్తుంది,

ఆధ్యాత్మిక సాధనలోని రహస్యం... ఆ సచ్చిదానంద రూపమైన దివ్యత్వం మనిషి అనుభవంలోకి వస్తుంది,

అపురూపమైన ఆ అనుభవాన్ని, ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు,

ఇదంతా,ఆధ్యాత్మిక జీవన సాధనవల్లే సాధ్యమవుతుంది.


సర్వేజనా సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 



ఆధ్యాత్మిక పథం 22 సుకుమారం


సుకుమారం 

ఆ రోజుల్లో  రోజువారి పనులు పూర్తిచేసుకొని స్నానానంతరం జడవేసుకొని, కొద్దిగా మొహానికి పౌడర్ అద్ది, కట్టు, బొట్టు, కాటుకలతో అద్దంలో 🪞తమ ముఖారవిందాన్ని  చూసుకుంటూ తుదిమెరుగులతో మురిసిపోయేవారు. 

ఈ రోజుల్లో యువత మాటి మాటికీ అద్దంలో 🪞అదే పనిగా చూసుకుంటూ మురిసిపోవడం ఓ దినచర్యగా మారిపోయింది.. అలా చూస్తుంటే ఏమవుతుంది? అదే  ముఖం సుకుమారమైనదిగా, అదే వర్చస్సు నాజూకుగా, ఆకర్షణీయమైన శరీరసౌష్టవంగా నిన్ను మోహంలో పడేస్తుంది.నెమ్మది నెమ్మదిగా మనస్సుకు నచ్చిన ఆ రూపం కోసం నీవు విపరీతమైన శ్రద్ధ చూపడం మొదలవుతుంది. 

ఈ మానసిక బలహీనతలను  సొమ్ముచేసుకోవడానికి మార్కెట్లలో సౌందర్యపరిరక్షణగా బోటాక్స్, బ్యూటీ పార్లర్లు, బ్యూటీ సెలూన్లు  తామరతుంపర్లగా వీధి వీధికి పుట్టుకొస్తున్నాయి. తమ కార్యక్రమాలను శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయి, నిర్వహిస్తున్నాయి.

  • ముఖ సౌందర్యం కోసం ఫేస్ క్రీంలు, 🧴ఫేస్ ప్యాక్ లు , స్క్రబ్బర్స్ 🧽, మేకప్ బోటిక్, కన్సిలర్స్
  • ఆకర్షణీయమైన 👄పెదవులకోసం 💄లిప్ స్టిక్స్,అప్పర్ లిప్ త్రెడింగ్, బొటాక్స్ , లిప్ గ్లాష్ 
  • కనుబొమ్మల మెరుపు కోసం  ఐ బ్రో థ్రెడింగ్, ఐ బ్రో టింట్, ఐ లాషెస్, ఐ లైనర్, మస్కారా, ఐషాడోలు 
  • కాంతివంతమైన చర్మం కోసం వివిధ రకాల క్లీనర్స్, ఫేస్ వాష్లు, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్లు, 🧴బాడీ ఆయిల్స్, బాడీక్రీంలు, సన్ స్క్రీన్ లోషన్లు 
  • నఖ సౌందర్యానికి నెయిల్ పాలిష్ 💅 లు, నెయిల్ ఆర్ట్
  • హస్త సౌందర్యం కోసం మానిక్యూర్, హ్యాండ్ వ్యాక్సింగ్ 
  • శిరోజ పోషణ పేరుతో షాంపూలు, కండిషనర్లు 
  • శిరోజాలంకరణ 🧑‍🦰పేరుతో హైలేట్స్ , హెయిర్ డైలు, హెయిర్ స్టైల్ పేరుతో  స్ట్రెయిట్ నర్స్. 

ఈ సౌందర్య పోషణ పేరుతో ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఐస్ క్రీమ్ తిన్నా తినక పోయినా కరిగి పోతుంది, అదే విధంగా ఈ పై పై మెరుగులు ఐస్ 🍧 క్రీమ్స్ లాంటివే!

వేసుకున్న, వేసుకుంటున్న పౌండేషన్, పేస్ ప్యాకులు కడుక్కోవడానికి, తోమడానికి స్క్రబ్బర్స్ పేరు మీదుగా పర్సును 👜 ఖాళీ చేస్తున్నాయి.


అనాదిగా వస్తున్న సాంప్రదాయక సహజ సౌందర్య సాధనాలు ప్రతిభావంతంగా నామమాత్ర ఖర్చుతో చర్మసౌందర్యం, దేహలాలిత్యం,ఆకర్షణీయసౌష్టవంని మీ సొంతం చేస్తాయి..

  • పసుపు, తేనె 🍯 కాంబినేషన్ ముఖం మీద ముడతలు, మచ్చలను తగ్గించి, ముఖవర్చస్సు, చర్మకాంతిని పెంచుతాయి.
  • ముఖంపై టాన్, పిగ్మెంటేషన్ తొలగించడానికి తేనె, పెరుగు మిశ్రమం సహాయపడుతుంది.
  • ఉల్లిరసం, తేనె 🍯 కాంబినేషన్ చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది 
  • వారంలో ఓ తైల స్నానం, పక్షంలో నలుగుపిండితో ఓ అభ్యంగ స్నానం, మాసానికి ఓ కుంకుడు కాయలతో స్నానం మీ శిరోజ సంరక్షణను, కాంతి వంతమైన నిగ నిగలాడే స్కిన్ టోన్ తో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తు సహజ సౌందర్యాన్నీ తీసుకువస్తుంది. మీ మిత్రమండలిలో ఇక మీరే తోపు!! ఇక కండిషనర్లకు, షాంపూలకు ఏ మాత్రం ఖర్చు చేయనవసరం లేదు. 
  • ఎటువంటి స్కిన్ లోషన్ వాడకుండా ఉషోదయ వెలుగుల్లో, సంధ్యా సమయాల్లో ప్రభాత సూర్యుడి దివ్య కాంతులలో మీ తనువు, మనువు పులకరించేలా ప్రతిరోజూ ఓ 45 నిమిషాలు నడక 🚶‍♂️ సాగించండి.ఆ ఆహ్లాదకర అనుభూతులను తనివితీరా ఆస్వాదిస్తూ మీ మనస్సులో మధుర జ్ఞాపకాలగా పదిలపరుచుకొండి.
  • తేలికపాటి వ్యాయామాలు, యోగ సాధనాలకు ఓ అరగంట సమయాన్ని కేటాయించండి.
  • మీ మనస్సుకు నచ్చిన నాట్యం,నృత్యం 🩰, చిత్రలేఖనం 🎨, సంగీతం 🎸లాంటి లలితకళల యందు ఆసక్తి, అభిరుచిని కలిగి వాటిని ఆస్వాదించండి.
  • జుట్టు పలచబడటం, అవాంఛనీయ రోమాలు పెరగడం, మొటిమలు రావడం, బరువు పెరగడం వంటివి హార్మోన్ల అసమతుల్యతనే ప్రధాన కారణం. ఈ సమస్యలను అధిగమించడానికి మంచినీళ్లు రోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి . వారంలో ఓ రోజు కేవలం ద్రవాహారాలు మాత్రమే తీసుకోవాలి..ఇది మీ బాడీలో డిటాక్సిఫికేషన్ చర్యగా ఆమం స్థాయి ని తగ్గించడానికి దోహదం చేస్తుంది.
  • మీరు తీసుకునే ఆహారం 🥗నాణ్యమైనదిగా వుండాలి. సహజ పోషకాలు అయిన పాలు, పండ్లు, నెయ్యి, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పోషక నిధులైన బాదం, ఆక్రోట్లు, అవిసె గింజలు, కాజు,పిస్తా, కిస్మిస్,గుమ్మడి గింజలు వంటివి మాత్రమే ఆహారంలో వుండేలా చూసుకోండి. అవీ మీ హార్మోన్ల పనితీరును, సమతౌల్యతలను మెరుగుపరుస్తాయి. 
  • దీర్ఘకాలం పోషకాహారలోపం హార్మోన్ల వ్యవస్థ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  హార్మోన్ల వ్యవస్థ మెరుగ్గా ఉండడానికి సమతుల్య ఆహారం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రధానం. యోగ 🧘‍♀️సాధన, ధ్యానం, గుడ్ రీడింగ్ 📖,కలుపుగోలుతనం, సహజ జీవన విధానం ఇందుకు దోహదం చేస్తాయి.

గుర్తుంచుకోండి అందం, ఆనందం బయటనుంచి కొనుక్కుంటే వచ్చేవి కాదు. అవి నీలో, నీతోనే, నీలోపలనే ఉన్నాయి . దానిని జీవితకాలం పరిరక్షించుకోవడానికీ కేవలం మీ జీవనశైలీ, జీవితశైలీ ప్రభావితం చేస్తాయి..


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️



ఆధ్యాత్మిక ఫధం 21 ఆనందమే నీ ఆయుష్షు


ఆనందమే నీ ఆయుష్షు 

ఆనందంగా వుండేవాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారు.

దీర్ఘకాలం జీవించే వారు మంచి ఆరోగ్యం కలిగివుంటారు.

ఆరోగ్యవంతులుగా వుండేవాళ్లు సంతోషభరిత జీవనవిధానం కలిగివుంటారు.

సంతోషంతో ఉండేవారు  క్రియాశీలక  ఆలోచనలను కలిగివుంటారు.

అవి వారు తీసుకునే ఆహారం, పనులు, ఆలోచనలలో నాణ్యతను కలిగి ఉంటాయి.


ఆరోగ్యవంతులుగా వుండేవారి శరీరంలో ఆమం చాలా తక్కువస్థాయిలో ఉంటుంది.

ఎవరిలో ఆమం ఎక్కువగా తయారవుతుందో వారు అనారోగ్యంతో తరచుగా వ్యాధులభారిన పడుతున్నారు. చరకుడు ‘మందాగ్ని జనితమామం రోగణాం కారణం పరమ్ ‘ అని పురాతన సంస్కృత గ్రంథం ‘చరక సంహితలో 1700 సంవత్సరాల క్రితం పేర్కొన్నారు 

జఠరాగ్ని మందగించడం వల్ల మనం తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకుండా పోతుంది. సరిగా జీర్ణం కాని ఆహారం కుళ్ళిపోయి 'ఆమం' అనే జిగట పదార్థంగా మారుతుంది. ఇది శరీరానికి హానికలిగించే విషపదార్థం ‘టాక్సిన్’ రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు కారణమై, వివిధ వ్యాధులకు మూలమవుతుంది

ఈ ఆమం శరీరంలోని వివిధ నాళాలలో పేరుకుపోయి రక్త ప్రసరణకు మరియు పోషకాల సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. శరీరంలోని అన్నిఅవయవాల పనితీరులపైన ప్రభావం చూపిస్తుంది. 

ఆకలి లేకపోవడం, ఎప్పుడూ అలసటగా ఉండటం, నిస్సత్తువ, అలసత్వం, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, నాలుకపై తెల్లని పొర ఏర్పడటం మరియు నోటి దుర్వాసన వంటివి ఆమంస్థాయిలను గుర్తించగలిగిన ప్రాధమిక లక్షణాలు.

ఆమం వల్ల కీళ్లవాతం, అజీర్ణం మరియు వివిధ రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.


మన శరీరాలలో ఆమం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడానికి మన జీవనశైలీనే ప్రధానకారణం. తీసుకునే ఆహారం విషయంలో మానసిక నియంత్రణ కోల్పోవడం,

కేవలం తినడానికే మనం ఉండేది అని కంటికి ఆకర్షణీయం అనిపిస్తే ఏది పడితే అది తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎప్పడు పడితే అప్పుడు తినడం, ఆకలి వున్నా లేకపోయిన కుంభాలు కుంభాలు లాగించి వేయడం ఓ అలవాటుగా అయిపోయింది. 

ఈ ధోరణి వివాహవిందుల్లో జనాలు ఒకరిని మరొకరు నెట్టుకుంటూ అక్కడి వివిధ రకాల నోరూరించే షడ్రుచులతో కూడిన వంటకాలపై దండయాత్ర అప్రహితంగా కొనసాగించడం తరచుగా చూస్తుంటాం.


విరుద్ధ ఆహారాలు జీర్ణక్రియ దెబ్బతినడానికి,గ్యాస్, అసిడిటీలకు,చర్మ సంబంధిత వ్యాధులు రాషెస్, అలర్జీలకు, రోగనిరోధక శక్తి తగ్గడానికి, శరీరంలో విషతుల్యాలు ఆమం పేరుకుపోవడానికి ప్రధాన కారణమవుతాయి . అందుకే విరుద్ధ ఆహారాలపట్ల అప్రమత్తంగా ఉండాలి అవి:

  • వేసవి కాలంలో అదే పనిగా బాగా వేడి వేడిగా వుండే హాట్ సమోసాలు,మిరపకాయ బజ్జీలు,హాట్ సూప్🍵, మసాలా కాపీ, టీ ☕️ లు తీసుకుంటూవుంటే జీర్ణవ్యవస్థలో అల్సర్లకు కారణమవుతుంది, అవి భవిష్యత్లో క్యాన్సర్ కణాలుగా తయారుకావచ్చు.
  • శీతాకాలంలో చల్లటి ఆహారాలు, శీతల పానీయాలు,ఐస్ క్రీమ్స్, 🍦ప్రిడ్జిలోని పాలు,పెరుగు,మజ్జిగ, నీళ్లు 🛀 మెటబాలిజంను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
  • వేడి వేడిగా ఆహారం తీసుకున్న వెనువెంటనే చల్లటి శీతలపానీయాలు, ఫ్రూట్ సలాడ్లు, మిల్కు షేకులు, 🍧ఐస్ క్రీంలు తీసుకోకండి.
  • భోజనంతో ఐస్ క్రీమ్ 🍦 తీసుకోవడం, ఐస్ క్రీమ్ తో స్వీట్ కలపడం, బాగా ఫ్రై 🍟చేసిన ఆహారాలు రాత్రి 🌙 తీసుకునే పెరుగు పదార్థాలు జీర్ణక్రియను మందగిస్తాయి.
  • పాలలో 🍌అరటిపండు, మామిడిపండు 🥭మినహా పుల్లని పండ్లు నారింజ, నిమ్మ,బత్తాయి కలపకూడదు. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది.
  • తేనెను 🍯ఎప్పుడూ వేడి చేయకూడదు లేదా వేడి పదార్థాలలో కలపకూడదు. వేడి చేసిన తేనె శరీరంలో విషతుల్యంగా మారుతుంది.
  • పాలు 🥛మరియు చేపలను 🍤కలిపి తింటే రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడి, చర్మ వ్యాధులు, బొల్లి, తెల్ల మచ్చలు వంటివి వచ్చే అవకాశం ఉంది.
  • పెరుగు వంటి చలవ చేసే పదార్థాలను, వేడి చేసే 🍗మాంసాహారంతో కలిపి తీసుకోకూడదు.
  • నెయ్యి మరియు 🍯తేనెను సమాన పరిమాణంలో తీసుకోకూడదు. ఇది శరీరానికి హానికరం.
  • పాలు 🥛తాగే ముందు లేదా తర్వాత వెంటనే ఉప్పగా ఉండే పదార్థాలు తినకూడదు. 

ఆహారం కొందరికి అమృతం, అదే  మరి కొందరికి విషం. అందుకే కొన్ని ఆహారాలు. మతపరంగా, సామాజికపరంగా,ఆరోగ్యపరంగా నిషిద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు.

  • మధుమేహం వున్నవాళ్ళు శీతల పానీయాలు,స్వీట్లు, క్యాండీ,పాలీషుచేసిన రైస్, మామిడి, సపోట, అరటి, సీత ఫలం వంటి పండ్లు, బేకరి ఉత్పత్తుల తీసుకోవడం మీద అధిక నియంత్రణ కలిగి ఉండాలి.
  • థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అయోడిన్ శోషణను ప్రభావితంచేసే సోయా ఉత్పత్తులు, బ్రకోలి,కాలీఫ్లవర్ వంటివి పరిమితం చేయాలి.
  • ఫ్యాటీ లివర్ సమస్య వున్నవాళ్లు చక్కెర, స్వీట్లు, శీతల పానీయాలు ,ఆల్కహాలు,వైట్ బ్రెడ్, మరియు జంక్ ఫుడ్ , బేకరి ఉత్పత్తుల తీసుకోవడం మీద అప్రమత్తత కలిగి ఉండాలి.
  • అలెర్జీలు ఉన్నవారిలో గ్లూటెన్ (గోధుమ), లాక్టోస్ (పాల ఉత్పత్తులు), వేరుశెనగ, నట్స్ వంటివి కొందరికి నిషిద్ధం. 
  • వివిధ మత ఆచారాలలో వారు కొన్ని ఆహారాలను నిషిద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు.

మనం తీసుకునే ఆహారంలో సమీకృత పోషకాలు పుష్కలంగా వుండే సాత్విక ఆహారాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. తీసుకునే ఆహారంలో పాలు, పండ్లు, నెయ్యి, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పోషక నిధులైన బాదం, కాజు,పిస్తా, కిస్మిస్,గుమ్మడి,అవిసె గింజలు వంటివి దేహపరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మీ ఆహారంలో ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి. 

  • రోజుకు మూడుసార్లు భోజనం చేసే బదులుగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం 🥗 చేయండి.భోజనంలో అన్నం 40% వరకు ఆకుకూరలు, వేపుడులు,సలాడులు, సాంబారు, పెరుగు లేక మజ్జిగ వంటివి 60% వరకు ఉండాలి, మసాలాలు, ఉప్పుకారాలు తక్కువగా వుండేలా చూసుకోవాలి.
  • భోజనం 🍛 తో పొట్టని 70%వరకు మాత్రమే నింపండి, ఈ నాణ్యమైన భోజనశైలి ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఎసిడిటి,గ్యాస్ లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • భోజనానికి అరగంట ముందుగా, భోజనం తీసుకున్న అరగంట తరువాత మాత్రమే నీళ్లు 🚰త్రాగండి. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు క్రమేణా మానివేయండి.ఈ మార్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
  • సాయంకాల భోజనం 🍛 కు ఉదయం తీసుకునే 🥗అల్పాహారంల మధ్య నిరాహారంగా 13 నుంచి 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి, అయితే మంచినీళ్లు మీ ఆసక్తి మేరకు త్రాగండి. ఈ మార్పు శరీర అంతరశుద్ధికి సహాయపడుతుంది. 

మన ఆరోగ్యం, శరీరపోషణ, దేహదారుఢ్యం, ఆలోచనలు, భావనలు, నడవడికలు ప్రవర్తనలకు తీసుకునే ఆహారం ప్రధానపాత్ర పోషిస్తుంది.

తీసుకునే ఆహారం మితాహారం, హితాహారం,మధురాహారంగా దేహానికి,మనస్సుకు సాత్వికతను చేకూర్చేవిధంగా ఉండాలి. ఏ ఆహారం అయితే మనస్సును ప్రశాంతంగా వుంచడానికి, దేహం ఆరోగ్యవంతంగా వుంచడానికి, మానసిక ప్రకోపాలను దూరంగా వుంచడానికి సహకరిస్తిందో ఆ ఆహారాలు సాత్వికాహారాలు అవుతాయి. అవి జీవితంలో సంతోష మధురిమలకు ఆలంబనగా ఆనంద భరిత జీవితంకు దోహదం చేస్తాయి.  ఆనందంగా జీవించేవాళ్లు దీర్ఘ ఆయుష్షుతో జీవితాన్ని గడిపేస్తారు.

అరగని, తరగని సంపద ఎంతున్నా, ఆరోగ్యసంపదే మిన్న !!!


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️