Friday, 3 July 2026

రానా కవితలు 9 సంతోషం

 

సంతోషం 


మార్నింగ్ వాకింగ్ చేస్తాం

మిత్రులతో భాతఖాని చేస్తాం

పాటలు పాడుకుంటాం

ఆటలు ఆడుకుంటాం 

నాణ్యమైన ఆహారాలు తీసుకుంటాం

ఇష్టమైన ఉద్యోగాలు చేస్తాం

మంచి నిద్రకోసం ఏసి, సౌకర్యవంతమైన బెడ్లు వాడుతాం 

విలాసవంతమైన ఇండ్లలో ఉంటాం

లగ్జరీ కార్లలో తిరుగుతాం 

ఫైవ్ స్టార్ హోటళ్లలో బసచేస్తాం

దేశ, విదేశీ ప్రయాణాలు చేస్తువుంటాం

శని, ఆదివారాల్లో ఫ్యామిలీతో వీకెండ్ ఎంజాయ్ చేస్తాం 

పిక్నిక్కులు, టూర్లు కూడా ప్లాను చేసుకుని సరదాగా వెళ్తాం

ఇవే సంతోషం ఇస్తాయి, తెస్తాయి అని నమ్ముతాం

కానీ మనలో, మన మనసు అట్టడుగుపొరల్లో 

ఏదో అలజడి, తెలియని వెలితి, అంతా శూన్యం అనే భావన 

కొండచలమలో ఊరే నీరులా ఉంటుంది …

వీరి సంతోషం మోచేతి దగ్గరి తేనె లాంటిది

నోటికి అందదు, ప్రయత్నం ఆగదు..!


ఎందుకు ఈ అలజడి, వెలితి,శూన్యత అంటే….

మనకు తీసుకోవడం తెలుసు

దాచుకోవడం తెలుసు

వాడుకోవడం తెలుసు 

స్వార్థంతో జీవించడం తెలుసు 

ప్రంపచాన్ని నడిపించేది డబ్బు అని తెలుసు

బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవడం తెలుసు

అహంని ఆత్మాభిమానంగా పోషించుకోవడం తెలుసు


కానీ తెలుసుకోవలసింది

సంతోషం బయట ఎక్కడో లేదు

అది మనలోనే, మనతోనే ఉంది 

బంధాలు, అనుబంధాల పరిపుష్టితంలో

ఆర్తులకు, అన్నార్ధులకు అందించే సహాయంలో

నిరాశలో, నిస్సహాయతలో ఉన్న వారికి అందిచే ఓదార్పులో 

ముగజీవాలకు అందించే ఆదరణలో

దీనులపట్ల చూపించే కారుణ్యంలో

కరుణారసభరిత హృదయక్షేత్రంలో 

సంతోషం వికసిస్తుంది,🌸 వెల్లివిరుస్తుంది !!


మీ అభిరుచులకు తిరిగి జీవం ఇవ్వండి

వాటిని పెంచి పోషించండి 

అదే మీ సంతోషానికి చిరునామ అవుతుంది!!

 

అణువణువునా విస్తరించిన అంతర్యామి

అనుసంధానంతో మనసు 

ప్రశాంత భరితం, సంతోషభరితం అవుతుంది!!!







No comments:

Post a Comment