సుకుమారం
ఆ రోజుల్లో రోజువారి పనులు పూర్తిచేసుకొని స్నానానంతరం జడవేసుకొని, కొద్దిగా మొహానికి పౌడర్ అద్ది, కట్టు, బొట్టు, కాటుకలతో అద్దంలో 🪞తమ ముఖారవిందాన్ని చూసుకుంటూ తుదిమెరుగులతో మురిసిపోయేవారు.
ఈ రోజుల్లో యువత మాటి మాటికీ అద్దంలో 🪞అదే పనిగా చూసుకుంటూ మురిసిపోవడం ఓ దినచర్యగా మారిపోయింది.. అలా చూస్తుంటే ఏమవుతుంది? అదే ముఖం సుకుమారమైనదిగా, అదే వర్చస్సు నాజూకుగా, ఆకర్షణీయమైన శరీరసౌష్టవంగా నిన్ను మోహంలో పడేస్తుంది.నెమ్మది నెమ్మదిగా మనస్సుకు నచ్చిన ఆ రూపం కోసం నీవు విపరీతమైన శ్రద్ధ చూపడం మొదలవుతుంది.
ఈ మానసిక బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి మార్కెట్లలో సౌందర్యపరిరక్షణగా బోటాక్స్, బ్యూటీ పార్లర్లు, బ్యూటీ సెలూన్లు తామరతుంపర్లగా వీధి వీధికి పుట్టుకొస్తున్నాయి. తమ కార్యక్రమాలను శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయి, నిర్వహిస్తున్నాయి.
- ముఖ సౌందర్యం కోసం ఫేస్ క్రీంలు, 🧴ఫేస్ ప్యాక్ లు , స్క్రబ్బర్స్ 🧽, మేకప్ బోటిక్, కన్సిలర్స్
- ఆకర్షణీయమైన 👄పెదవులకోసం 💄లిప్ స్టిక్స్,అప్పర్ లిప్ త్రెడింగ్, బొటాక్స్ , లిప్ గ్లాష్
- కనుబొమ్మల మెరుపు కోసం ఐ బ్రో థ్రెడింగ్, ఐ బ్రో టింట్, ఐ లాషెస్, ఐ లైనర్, మస్కారా, ఐషాడోలు
- కాంతివంతమైన చర్మం కోసం వివిధ రకాల క్లీనర్స్, ఫేస్ వాష్లు, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్లు, 🧴బాడీ ఆయిల్స్, బాడీక్రీంలు, సన్ స్క్రీన్ లోషన్లు
- నఖ సౌందర్యానికి నెయిల్ పాలిష్ 💅 లు, నెయిల్ ఆర్ట్
- హస్త సౌందర్యం కోసం మానిక్యూర్, హ్యాండ్ వ్యాక్సింగ్
- శిరోజ పోషణ పేరుతో షాంపూలు, కండిషనర్లు
- శిరోజాలంకరణ 🧑🦰పేరుతో హైలేట్స్ , హెయిర్ డైలు, హెయిర్ స్టైల్ పేరుతో స్ట్రెయిట్ నర్స్.
ఈ సౌందర్య పోషణ పేరుతో ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఐస్ క్రీమ్ తిన్నా తినక పోయినా కరిగి పోతుంది, అదే విధంగా ఈ పై పై మెరుగులు ఐస్ 🍧 క్రీమ్స్ లాంటివే!
వేసుకున్న, వేసుకుంటున్న పౌండేషన్, పేస్ ప్యాకులు కడుక్కోవడానికి, తోమడానికి స్క్రబ్బర్స్ పేరు మీదుగా పర్సును 👜 ఖాళీ చేస్తున్నాయి.
అనాదిగా వస్తున్న సాంప్రదాయక సహజ సౌందర్య సాధనాలు ప్రతిభావంతంగా నామమాత్ర ఖర్చుతో చర్మసౌందర్యం, దేహలాలిత్యం,ఆకర్షణీయసౌష్టవంని మీ సొంతం చేస్తాయి..
- పసుపు, తేనె 🍯 కాంబినేషన్ ముఖం మీద ముడతలు, మచ్చలను తగ్గించి, ముఖవర్చస్సు, చర్మకాంతిని పెంచుతాయి.
- ముఖంపై టాన్, పిగ్మెంటేషన్ తొలగించడానికి తేనె, పెరుగు మిశ్రమం సహాయపడుతుంది.
- ఉల్లిరసం, తేనె 🍯 కాంబినేషన్ చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది
- వారంలో ఓ తైల స్నానం, పక్షంలో నలుగుపిండితో ఓ అభ్యంగ స్నానం, మాసానికి ఓ కుంకుడు కాయలతో స్నానం మీ శిరోజ సంరక్షణను, కాంతి వంతమైన నిగ నిగలాడే స్కిన్ టోన్ తో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తు సహజ సౌందర్యాన్నీ తీసుకువస్తుంది. మీ మిత్రమండలిలో ఇక మీరే తోపు!! ఇక కండిషనర్లకు, షాంపూలకు ఏ మాత్రం ఖర్చు చేయనవసరం లేదు.
- ఎటువంటి స్కిన్ లోషన్ వాడకుండా ఉషోదయ వెలుగుల్లో, సంధ్యా సమయాల్లో ప్రభాత సూర్యుడి దివ్య కాంతులలో మీ తనువు, మనువు పులకరించేలా ప్రతిరోజూ ఓ 45 నిమిషాలు నడక 🚶♂️ సాగించండి.ఆ ఆహ్లాదకర అనుభూతులను తనివితీరా ఆస్వాదిస్తూ మీ మనస్సులో మధుర జ్ఞాపకాలగా పదిలపరుచుకొండి.
- తేలికపాటి వ్యాయామాలు, యోగ సాధనాలకు ఓ అరగంట సమయాన్ని కేటాయించండి.
- మీ మనస్సుకు నచ్చిన నాట్యం,నృత్యం 🩰, చిత్రలేఖనం 🎨, సంగీతం 🎸లాంటి లలితకళల యందు ఆసక్తి, అభిరుచిని కలిగి వాటిని ఆస్వాదించండి.
- జుట్టు పలచబడటం, అవాంఛనీయ రోమాలు పెరగడం, మొటిమలు రావడం, బరువు పెరగడం వంటివి హార్మోన్ల అసమతుల్యతనే ప్రధాన కారణం. ఈ సమస్యలను అధిగమించడానికి మంచినీళ్లు రోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి . వారంలో ఓ రోజు కేవలం ద్రవాహారాలు మాత్రమే తీసుకోవాలి..ఇది మీ బాడీలో డిటాక్సిఫికేషన్ చర్యగా ఆమం స్థాయి ని తగ్గించడానికి దోహదం చేస్తుంది.
- మీరు తీసుకునే ఆహారం 🥗నాణ్యమైనదిగా వుండాలి. సహజ పోషకాలు అయిన పాలు, పండ్లు, నెయ్యి, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పోషక నిధులైన బాదం, ఆక్రోట్లు, అవిసె గింజలు, కాజు,పిస్తా, కిస్మిస్,గుమ్మడి గింజలు వంటివి మాత్రమే ఆహారంలో వుండేలా చూసుకోండి. అవీ మీ హార్మోన్ల పనితీరును, సమతౌల్యతలను మెరుగుపరుస్తాయి.
- దీర్ఘకాలం పోషకాహారలోపం హార్మోన్ల వ్యవస్థ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల వ్యవస్థ మెరుగ్గా ఉండడానికి సమతుల్య ఆహారం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రధానం. యోగ 🧘♀️సాధన, ధ్యానం, గుడ్ రీడింగ్ 📖,కలుపుగోలుతనం, సహజ జీవన విధానం ఇందుకు దోహదం చేస్తాయి.
గుర్తుంచుకోండి అందం, ఆనందం బయటనుంచి కొనుక్కుంటే వచ్చేవి కాదు. అవి నీలో, నీతోనే, నీలోపలనే ఉన్నాయి . దానిని జీవితకాలం పరిరక్షించుకోవడానికీ కేవలం మీ జీవనశైలీ, జీవితశైలీ ప్రభావితం చేస్తాయి..
సర్వేజనా సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
No comments:
Post a Comment