అహింసా పరమో ధర్మః
ధర్మపరిరక్షణ కోసం చేసే హింస, ప్రయత్నం, కార్యం అహింసనే అవుతుంది.రక్షింపబడిన ధర్మం మనల్ని రక్షిస్తుంది. రక్షింపబడని ధర్మం అది తప్పక శిక్షిస్తుంది.
ధర్మానికి హాని కలిగిస్తూ ధర్మగ్లానికి కారణమైన ప్రతి ప్రయత్నంను హింసగనే పరిగణించాలి.
ఉగ్రవాదంకి విఘాతం కలిగించిన ఆపరేషన్ సింధూర్ ధర్మగ్లానికి గుణపాఠం, ధర్మ పరిరక్షణే!
మహా భారతంలో “అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తదైవచ.” గా ప్రబోధించబడిన విద్వత్ శ్లోకం. మన ధర్మాలకు, విశ్వాసాలకు, నమ్మకాలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, వారికి తగిన గుణపాఠం నేర్పించవలసిందే!!
హింస అంటే కేవలం జంతువులను హింసించడం అనేది మనలో సామాన్య భావన.
అహింసాచరణ ధర్మం విస్తృతమైన, శ్రేష్ఠమైన, ఉత్కృష్టమైన ఆచరణ పూర్వక సామాజిక జీవన విధానం, బహుముఖ ప్రభావశీలి, ప్రజ్ఞాశాలి. ఇంతకి ధర్మం అంటే ఏమిటి…
- ధర్మం అంటే సకల జీవరాశి పై చూపించే కరుణ, ఔదార్యం.
- ధర్మం అంటే ఈ విశాలసృష్టి మనుగడకు ఆధారం.
- ధర్మం అంటే మానవత్వాన్ని పరిరక్షించే మార్గదర్శి.
- ధర్మం అంటే నీతివంతం, ఆదర్శప్రాయం, సత్యవంతమైన జీవనవిధానం.
- ధర్మం అంటే ప్రవర్తనానియమావళి.
- ధర్మం చైతన్యవంతం, స్వయం ప్రకాశితం.
- ధర్మం అంటే జీవిత లక్ష్యం మరియు పరమావధి.
- ధర్మం అంటే వ్యక్తిగత మరియు కుటుంబవ్యవస్థల శ్రేయస్సు.
- ధర్మం అంటే సామాజికహితంని ఆకాంక్షించే జీవనసరళి.
- ధర్మం అంటే అనాదిగా మానవ సంఘం పాటించే కట్టుబాట్లు.
హైందవసమాజం ఈ సనాతనధర్మంని అనుసరిస్తున్న అతి ప్రాచీన సజీవ మానవనాగరికతకు సాక్ష్యంగా నిలిచింది. సింధు, హరప్పా నాగరికతలకు ఆలంబనగా నిలిచింది. బౌద్ధ మత ఆవిర్భావానికి, సిక్కు మరియు జైన సంప్రదాయాలకు కూడా మూలం అయింది. నేటికి సజీవ ఆచరణతో హిందు ధర్మంగా ప్రపంచంతో కీర్తింపబడుతున్న అపురూప జ్ఞాననిధి!
సత్యం, దయ, తపస్సు, దానం అనే ప్రధాన విలువల ఆధారంగా ధర్మం స్వయం ప్రకాశవంతం.
సమాజంలో ప్రతివ్యక్తి కుల,మత ,వర్గ రహితంగా అనుసరించ వలసిన కర్తవ్య నిర్వహణ విధానం.
ధర్మాన్ని సామాన్యధర్మం మరియు విశేషధర్మంగా వర్గీకరించవచ్చు, అందరికీ వర్తించేవి సామాన్య ధర్మం. పాలకులకు వర్తించే న్యాయపరిరక్షణ , దండన , శిక్షణ విశేష ధర్మం.
సామాన్య ధర్మాచరణ ప్రవర్తన నియమావళిని అనుసరించి నిర్వర్తించే జీవన సరళీకృత విధానం!
- గృహస్థు ధర్మం: ప్రతి గృహస్థుడు ఏకపత్నీవ్రతం ఆచరిస్తూ నిత్యం నిర్వహించవలసిన పంచ మహాయజ్ఞాలు
- దేవ యజ్ఞం:సకల మానవవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పరమాత్మ ఆశీస్సుల కోసం చేసే పూజలు, క్రతువులు,యజ్ఞాలు.
- బ్రహ్మ యజ్ఞం: జ్ఞానార్జన కోసం చేసే స్వేచ్ఛా యజ్ఞం మరియు వేద పారాయణం.
- పితృ యజ్ఞం: పితృ దేవతలకు శ్రద్దాంజలి ఘటించడం
- భూత యజ్ఞం: పశు పక్ష్యాదుల మనుగడను, పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ చేసే కార్యాలు.
- మనుష్య యజ్ఞం: అతిథులకు,అన్నార్తులకు అందించే అన్న ప్రసాదం.
- గృహిణి ధర్మం:ప్రతి ఇల్లాలు తన భర్త నిర్వహించే ఈ యజ్ఞ క్రియలలో తన కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కుటుంభపోషణను భాధ్యతాయుతంగా నిర్వహించడం.
- మాతృ ధర్మం: తన సంతానంను ప్రేమ, అనురాగం,ఆప్యాయతలతో పెంచి పోషించడం.
- పితృ ధర్మం: తన కుటుంబబాధ్యతలను న్యాయసంపాదనతో నిర్వహించడం.
- గురు ధర్మం : భేదభావరహితంగా శిష్యులందరికి సమవిద్య బోధన చేయడం .
- శిష్య ధర్మం: గురువు యందు భక్తి శ్రద్ధలతో, వినయవిధేయతలతో విద్యాభ్యాసం చేయడం.
- వృత్తి ధర్మం: పాలకులు, పురోహితులు, వైద్యులు, వ్యవసాయదారులు,వ్యాపారస్తులు,రక్షక భటులు,ఇతర కులవృత్తులు ఆచరించే వారు తమరంగాలలో సమాజ హితం కాంక్షిస్తూ లోక శ్రేయస్సును తమ వృత్తి ధర్మంగా స్వీకరించి తమ బాధ్యతలను నిర్వహించడం.
జ్ఞానులు, కర్మ యోగులు, సాధువులు,జిజ్ఞాసువులు ఆచరించే జీవనసరళి సప్తధర్మవేదిక . అవి పవిత్రత, నిగ్రహం, దాతృత్వం, శ్రద్ధ, దయ, ఓర్పు, అపరిగ్రహాచరణ.
మనం మాట్లాడే మాటలు కఠినత్వం, కోపం, ద్వేష పూరితమయితే అది వాచక హింస. మాటల్లో మృదుత్వం, ఆప్యాయత, సౌభతృత్వం కలిగిన ప్రియభాషణం అయితే అది వాచక అహింసాచరణ అవుతుంది.
మనమాట ప్రాణం పోసే అమృతంలా ఉండాలి...ప్రాణం తీసే విషంలాకాదు గదా!
మన ఆలోచనలు, భావనలు, ఆకాంక్షలు మొహపూరితమై ఇతరులకు హాని కలిగించేవి అయితే అది శారీరక హింస. ఉపకారం,సానుభూతి,దయ, ప్రేమ, మనోనిగ్రహం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం శారీరక అహింసాచరణ అవుతుంది. ఒకరికి ఇష్టం లేని పని బలవంతంగా చేయించకపోవడం మనం ఆచరించాలి. మనసా,వాచా,కర్మణా ఇతరులకు హాని కలిగించే పనులను చేయకపోవడం అహింసాచరణ అవుతుంది.
ఏ ప్రవర్తనానియమావళి , మూల సూత్రాలు , మరియ ఏ న్యాయము చేత వ్యక్తి గత , సామాజిక , మతపర జీవితం సజావుగా నడపబడుతుందో , ఏ కారణముచే సర్వ జీవజాలం , ప్రకృతి లోని ప్రతి పదార్థం , శక్తి ఒక దానితోనొకటి అనుసంధానించబడి మనుగడ సాదిస్తాయో, బ్రహ్మాండం అంతా విస్తరించి తమ ఆస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాయో అదే ధర్మంయొక్క స్వరూపం. ధర్మానికి వేదాలు ప్రామాణికాలు. వేదాలు ఉపనిషత్తుల సారాంశం. అవి అపౌరషేయాలు, శృతులుగా గురుపరంపరగా ముందుతరాలకు చేరిన విజ్ఞాన నిధులు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాలుగా లిఖించబడినాయి. ఈ వేద సాహిత్యం ప్రంపంచంలోని అన్ని ప్రాథమిక భాషలలో లభ్యమవుతాయి. అంతర్జాలంలో వేదజ్ఞానంగా అన్నిభాషల్లో వీక్షించవచ్చు.
సర్వేజనా సుఖినోభవంతు.
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
#divineguidance #yogameditation
#yogainspiration #yogamitra
ధ్యానమాలిక ఆధ్యాత్మిక మాసపత్రిక జనవరి 26 సంచికలో ప్రచురితమయినది.
No comments:
Post a Comment