Thursday, 19 February 2026

ఆధ్యాత్మిక పధం 6 అపురూపమైంది మానవ జన్మ


అపురూపమైంది  మానవ జన్మ 


ప్రత్యగాత్మ, సమదర్శి, దయానిధి, కరుణానిధి, కృపానిధి, సృష్టికర్త, విశ్వంభరుడు,విశ్వరక్షకుడు, సర్వాంతర్యామి,జగన్నాధుడు, జగదీశ్వరుడు, అవ్యయుడు,ప్రేమమయి,అవ్యక్తుడు,  ఆ పరంథాముని అప్రమేయానుగ్రహంతో ఈ ప్రకృతిలో ఉత్కృష్టమైన, అపురూప మానవజన్మ ఎన్నెన్నో జన్మల నిరీక్షణ ఫలంగా ఓ వరంగా మనకు లభించింది!!!

పరమాత్మ 🔱అనుగ్రహఫలంగా  అమ్మానాన్నల ముద్దుబిడ్డలగా 🧑‍🧑‍🧒‍🧒జన్మించిన మనందరం ఒకే విధంగా వుండాలి కదా, కానీ మనలోని అభిరుచులు,ఆలోచనలు,ఆకాంక్షలు, ఊహలు , తీరుతెన్నులు, నడవడికలు, ప్రవృత్తులు, ప్రవర్తనలు, మాటలు,  దృక్పథాలలో విభిన్న ధోరణులు, ఎందుకు అనేవి సమాధానం దొరకని ప్రశ్నలు?

  • మనలో కొందరు జంతు ప్రేమికులు అయితే, మరి కొందరు ఆ జంతువులనే ఆహారంగా తీసుకునే అసురప్రవృత్తిపరులు!
  • మనలో కొందరు ప్రకృతి మరియు పర్యావరణ ప్రేమికులు, ఆరాధకులు అయితే,మరి కొందరు ఆ ప్రకృతిని చెరబట్టే అసురులు!
  • మనలో కొందరు ప్రేమను పంచే ఉదారులు అయితే, మరి కొందరు ఆ ప్రేమను తుంచి విద్వేషాన్ని మాత్రమే పంచే అహంభావులు!
  • కొందరిలో అవసరానికి మించిన సంపాదన అహంకారాన్ని తీసుకవస్తుంది! ఆ అహంకారం పెరుగుతువుంటే అది ఎంతటి బలమైన అనుబంధాన్ని అయినా విచ్చిన్నం చేయగల శక్తిగా వృద్ధి చెందుతుంది, అందుకే సంపద పెరిగేకొలది అణుకువ, విధేయత, వినమ్రతలనే అలంకారాలతో అహంకారపూరిత మూడత్వాన్ని నియంత్రించుకోవడమే పరిపూర్ణ జీవితం అవుతుంది.
  • కొందరు ఆగర్భశ్రీమంతులు అయితే అందులో కొందరు పరమలోభులు వీరు వర్షించని మేఘంలాంటి వారు, కొందరు దరిద్రనారాయణులు అయితే వారిలో కొందరు దయార్ద్ర హృదయులు. వీరు కొవ్వత్తి లాంటి వారు, చీకటిలో వెలుగును నింపే చిరుదివ్వెలు!
  • మనలో కొందరు సూక్ష్మ గ్రాహకులు అయితే మరికొందరు మూఢమతులు.
  • మనలో కొందరు ఆకర్షణీయమైన రూపంతో సౌందర్యవంతులు, మరి కొందరిది సాదసీదా రూపం, అయితే వారి లోని ప్రజ్ఞ, మేధస్సులతో మిలమిలా ప్రకాశిస్తుంటారు!
  • సాదారణ తెలివితేటలతో  కొందరు ఏ కార్యం మొదలుపెట్టిన విజయమే, మరి కొందరిలో ప్రజ్ఞ, పాటవాలు పుష్కలంగా వున్నా  విజయం అంది అందని ద్రాక్షపండ్లు, అయితే పరమాత్మ అనుగ్రహం కోసం నిరీక్షించే సమయానికి చేరువలోనే వున్నారు!  నిరీక్షణ ఫలాలను స్వీకరించడానికి సంసిద్ధులుగా వుండాలి. పరమాత్మ ఎవ్వరినీ ఉపేక్షించడు!
  • కొందరిది గాత్రం స్వరమాధుర్యం అయినా రాణించలేరు, మరి కొందరి గాత్రం సాధారణ స్వరం అయినా బాగానే రాణిస్తారు.
  • కొన్ని పాదాలు లయబద్ధంగా నాట్యం చేస్తాయి.మరి కొన్ని పాదాలు కేవలం తైతక్క లాడుతాయి.ఇంకొన్ని కొన్ని పాదాలు ఆడుతూ పాడుతూ ఎవరెస్టునే ఎక్కేస్తాయి. మరికొన్ని పాదాలు ఓ చిన్నగుట్టను ఎక్కడానికి ప్రయాస పడుతాయి. 

మనం రెస్టారెంటులో  ఆర్డరు చేసిందే వడ్డిస్తారు. అదేవిదంగా జీవితం అనే రెస్టారెంటులో మన ప్రారబ్ధకర్మఫలాలు ఏమి ఇస్తాయో వాటినే స్వీకరించాలి, ఇదే కర్మబంధనం దీనిని అనుభవించి తీరాల్సిందే! 

నీది అనుకున్నది నీవు ఎక్కడ వున్నా,ఏలా వున్నా అది నిన్నేచేరుతుంది అదే కర్మ సిద్దాంతం!

నీది కానీ దానికోసం ఎంత అర్రులు చాచి ప్రయత్నించినా అది నీకురాదు, రాలేదు.ఇదే కర్మతత్వం!


కర్మ ఫలాలను, విధి వ్రాతలను తప్పించుకోవడం కష్టసాధ్యం,కానీ అసాధ్యంనికూడా సుసాధ్యంచేసేశక్తి వాటిగతిని మార్చేశక్తి కేవలం నీలోనే వుంది. అదే సంకల్పశక్తి. 

  • సంకల్పానికి మూలాలు భావనలు, భావనలకు మూలాలు ఆలోచనలు. ఆలోచనలలో విశ్వాసం,నిర్వహించే కార్యాలలో ధైర్యం, నిర్మలత్వం,మాటలలో వివేకం, విచక్షణ, ఆప్యాయతలు, జీవితంలో సేవాభావనిరతితో  ఎదురయ్యే సమస్యలను సవాళ్లుగా స్వీకరించి ఎవరు ముందడుగు వేస్తారో వారిని విజయమే వరిస్తుంది. 
  • పంటక్షేత్రంలో పంటతో పాటూ కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి, అలాగని పంట వదులుకుంటామా? కలుపుమొక్కలను తొలగించుకుంటూ ముందుకు వెళ్తాము. జీవితక్షేత్రంలో సమస్యలు ఎదురైతే వాటిని తొలగించుకుంటూ ముందడుగు వేస్తుండాలి!!!
  • జీవితంలో సమస్యలు అనేవి ఎప్పటికీ ముగిసిపోవు, అవి నిన్న ఓ విధంగా రేపు ఇంకో విధంగా వుంటాయి.. అక్కడే ఆగిపోకుండా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం.
  • కావాల్సినవి ఎంచుకోవడంలో సందిగ్ధత ఉన్నా పర్వాలేదు కానీ జివితంలో ఏది వద్దో తేల్చుకోవడంలో స్పష్టత ఉండాలి.
  • జీవితంలో అనుకున్నవి అనుకున్నట్లుగా జరగక పోవడం,అనుకోనివి జరగడం,కొందరితో పరిచయాలు, మరి కొందరితో తెగతెంపులు, అర్థంతరంగా ఆగిపోయే బంధాలు అనేవి యాదృచ్ఛిక సంఘటనలు కావు, అవి అలా జరగడానికి జరగకపోవడానికి నీ ప్రమేయంలేని విధి.

☝️సమస్యలతో రాజీపడడం గాలికి వదిలేసిన దీపం🪔 వంటిది. సమస్యలను సవాళ్ళుగా, ధృడ మనోసంకల్పంతో స్వీకరించడం గాలిలో వెలిగే దీపం🪔 లా జీవితం ప్రకాశిస్తుంది.


ఏమీ లేకుండా జన్మించి, అన్నీ కావలని అలుపెరుగని బాటసారిలా ఎండమావుల చుట్టూ పరుగెత్తుతూ, ఏది నీది కాదు అని తెలిసి ప్రాణం కూడా నీదీ కాదని అర్థమై, ఏదో ఒక రోజు ఈ ప్రపంచానికి రిక్త హస్తాలతో బై బై చెబుతూ మహాప్రస్థానంలో సేదదీరడమే జీవితం. 


దివి నుంచి భువికి ప్రయాణం జననం,భువి నుంచి దివికి ప్రయాణం మరణం,🔁 జనన మరణాల మధ్య కొనసాగించే ప్రయాణమే ఓ కెరటం లాంటి జీవితం. 


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa

📞9900022729

🧘🧘🧘🧘🧘🧘🧘

No comments:

Post a Comment