Friday, 20 February 2026

ఆధ్యాత్మిక మాలిక 15 ఆనందో బ్రహ్మ

 

ఆనందో బ్రహ్మ 



ఆనందం మాటల్లో, చేతల్లో వ్యక్తపరచలేని ఆహ్లాదకర మానసికానంద మధురానుభూతి!! 

అది ఉత్సాహం,ఉల్లాసం, సంతసం, మోదం, ఆహ్లాదం, హర్షం, సంతృప్తి ,సంతోషాల సంగమ కూడలితో కలిగే అనిర్వచనీయానుభూతి.

  • ఎన్నికల్లో విజయం సాధిస్తే  కలిగేది విజయానందం 
  • లాటరీలో అదృష్టలక్ష్మీవరిస్తే కలిగేది సంభ్రమాశ్చర్యం.
  • ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కలిగేది ఉల్లాసభరితం
  • ఉద్యోగంలో చేరే రోజు ఉద్వేగభరితం.
  • ప్రేమలో గెలుపుతో మనస్సు పరవశంతో మైమరవడం.
  • ఆ ఇష్టసఖితో కలిసి మొదటిసారి తీసుకునే డిన్నర్ మధురసభరితం
  • ఎగ్జామ్స్ లో ప్రప్రథమస్థానం సాధిస్తే పొందే అనుభూతి వర్ణానాతీతవిజయానందం.
  • వ్యాపారం దిన,దిన ప్రవర్ధమానం అవుతుంటే మనసు పొందేది హర్షాతీభరితం.
  • తన కూతురి పెండ్లితో ఆ తండ్రి పొందే సంతోషం కన్నులలో కన్పించే నక్షత్రప్రకాశం
  • తండ్రిని చేస్తున్న అర్ధాంగి పై  అనురాగం హృదయంలో  కలిగే పులకరింత.

మనస్సులో జనించే ఆహ్లాదాలు,ఉల్లాసాలు,హర్షాతిశయాలు, అనురాగాలు, ఆకాంక్షలు, ఆకర్షణలు, పరవశింపులు,పులకింతలు,ఉద్వేగాలు సంతోషంలో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

ఇవన్నీ మనతోనే ఉంటాయి అనే భ్రమలతో,భ్రమలలో,కలలలో జీవితాన్ని గడిపేస్తాం! 

సత్యం ఏమిటంటే ఇవన్నీ నెమ్మదినెమ్మదిగా కాలక్రమంలో ఆవిరి అయిపోతాయి, కానీ వాటి జ్ఞాపకాలు మదిలో మదురభావనలుగా మనస్సు దొంతరలలో నిక్షిప్తం అవుతాయి.

సంతోషం అనే భావన శాశ్వతం అయితే మనందరం సంతోషంగా చీకు,చింతనలు లేని జీవితాలను గడపాలి కదా!! 

మనం సమాజంలో జరిగే సంఘటనను నిశితంగా పరిశీలిస్తే ప్రేమ వివాహాలలోని ఆకర్షణ అనతి కాలంలో కీచులాటలతో మసకబారడం,ప్రథమస్థానంతో గుర్తింపు పొందిన ప్రజ్ఞ ఉద్యోగాన్వేషణలో అలసిపోవడం,ఎన్నికల్లోని విజయం తమ ప్రభుత్వ తప్పిదాలతో ఛిద్రం కావడం,ఉద్యోగాలు లే అప్ లతో నిరుద్యోగిగా మారడం,వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలతో నీరసించి పోవడం,  వైవాహికజీవితం తడబడుతుంటే ఆందోళన పడటం, అనుకోకుండా వరించిన అదృష్టం విలాసాలతో కనుమరుగు కావడం వంటివి నిత్యం గమనించవచ్చు. 


ఆవిరి అయ్యే సంతోషమే అశాంతికి బీజం అవుతుంది,అసంతృప్తికి అంకురం అవుతుంది. మనశ్శాంతికీ బీటలు వేస్తుంది, హృదయం భాదతప్తం మవుతుంది. భాదతప్తహృదయంలో సుఖం, సంతోషాలకు స్థానం ఎక్కడ ఉంటుంది? మనశ్శాంతి లేని జీవితంలో ప్రశాంతత ఎలా చేకూరుతుంది?

నిజానికి దుఃఖం వెంట సంతోషం, కష్టం వెంట సుఖం, లాభం వెంట నష్టం, కీర్తి వెంట అపకీర్తి, చీకటి వెంట వెలుగు, శీతలం వెంట ఉష్ణం, గౌరవం వెంట అగౌరవం, కలిమి వెంట లేమి విడదీయలేనంతగా,  పాలలో నీళ్లలా కలగలసి వుంటాయి. 

ఇవి ఏవి శాశ్వతం కావు,కాలేవు అనే పరమార్ధతత్వం మనఃశాంతికి బీజం అవుతుంది. అది మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. నిర్మలమైన మనస్సులో ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతమైన మనస్సులో ఆలోచనలకు క్లారిటీ వస్తుంది. ఆలోచనలలో క్లారిటీ ఉంటే చేసేపనిలో స్పష్టతవస్తుంది . స్పష్టతతో చేసే పని పూర్ణనాణ్యతతో ప్రకాశిస్తుంది. వికసించిన ప్రకాశంతో లక్ష్యం సాకారం అవుతుంది.


భగవాన్ ప్రబోధ గీతంగా మానవాళికి అందించిన కార్యాచరనే 

“సుఖదుఃఖే సమే కృత్వా లాభా లా భౌ జయ జయా 

తతో యుద్ధాయ యుజ్యస్వ  నైవం పాప మవాప్స్యసి “

మనం చేసే ప్రతి పనిలోనూ కష్ట సుఖాలను, లాభ నష్టాలను, జయ అపజయాలను గురించి ఆలోచించక కర్తవ్యాన్ని నిర్వర్తించడం నిష్కామకర్మాచరణ అవుతుంది. అటువంటి క్రియాశీలక చర్యలు మనలని పవిత్రులను చేస్తుంది.


అక్షయ సుఖం,సంతోషం,మనశ్శాంతి కోసం జీవితకాలం ప్రయత్నిస్తూనే వుంటాం. ఆ ప్రయత్నం ఎండమావుల్లా, మృగతృష్ణగా మారుతుంది. ఇందుకు కారణం అవి బయటనే వున్నాయి అనే భ్రమలో  అన్వేషిస్తూ జీవితాంతం కొనసాగిస్తూ వుండడం. నిజానికి అవి బయటలేవు, అవి నీలోనే ఉన్నాయి, నీతోనే ఉన్నాయి. వాటిని నీవే స్వయంగా అన్వేషించాలి. పంచేంద్రియాల నిగ్రహం ఆ మార్గంను అవగతం చేస్తుంది.


ఇంద్రియనిగ్రహం మనఃశాంతికి దగ్గరచేస్తుంది. మనం తీసుకునే ఆహారాలపై నియంత్రణే ఇంద్రియనిగ్రహం అవుతుంది. తినదగని వాటిని అదే పనిగా తినడం, చూడకూడని వాటినే అదే పనిగా చూడడం, వినకూడని వాటిని వినడానికే ఇష్టపడటం, మాటలాడగూడని విషయాలనే మాట్లాడడానికే ఇష్టపడటం,గంజాయి, ధూమపానం, డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉంటే మనస్సుకు ప్రశాంతత ఎలా కలుగుతుంది?  

ఆహార నియంత్రణ అంటే మనం చూసే దృష్టి, వినే మాటలు, స్పరానుభూతి,  జిహ్వారుచి,మాట్లాడే భాషణలపై వుండే మానసిక నియంత్రణ అదే ఇంద్రియనిగ్రహం.


గుడిలో గంట మోగితే భక్త జన సందోహం అప్రమత్తం అవుతుంది, అదే విధంగా ఇంద్రియనిగ్రహాచరణ మనస్సును అప్రమత్తం చేస్తుంది. వివేక, తార్కిక,విచక్షణా జ్ఞానంతో నిష్కామకర్మాచరణలతో మనశ్శాంతికి అది వేదికవుతూ మానసిక ప్రశాంతతకు ఆలంబనంగా అక్షయసంతోషాలకు, ఆనందాలకు కారణమవుతుంది. నీవు నిరతిశయానందంలో వుంటే ఈ సృష్టిలో నీవు అందుకోలేనిది, పొందలేనిది అంటూ ఏమీ లేదు!


సర్వేజనా సుఖినోభవంతు 

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa

9900022729

🧘‍♂️🧘🧘🧘🧘🧘🧘 




No comments:

Post a Comment