అనన్యభక్తి , అనన్యచింతనలే పరమాత్మకు నీరాజనం !!!
మనందరం అవ్యయయుడు,అప్రమేయుడు,విశ్వంభరుడు,సర్వేశ్వరుడు అయిన ఆ పరమాత్మ యందు భక్తి,శ్రద్ధలతో వినయ,విధేయతలను కలిగి ఉంటాం. ఆయన సేవలో తరించడానికి శ్రద్ధాసక్తులను ప్రదర్శిస్తాం. పూజలు, వ్రతాలు, నోములు, క్రతువులు, హోమాలు, యజ్ఞాలు, ప్రార్థనలు, కానుకలు,ధూప దీప నైవేద్యాలు, అన్నసంతర్పణలు సమర్పిస్తాం. ఇవి భక్తిని ప్రదర్శించడానికి మనం ఎన్నుకున్న వివిధ రూపాలు.
భక్తిని ప్రదర్శించడంలో మనందరం ఆర్తులమే!! మనం కష్టాల్లో, ఆపదల్లో, అనారోగ్యాల్లో వున్నప్పుడు, పరీక్షలు, ఇంటర్వ్యూలకు వెళ్లే సందర్భాల్లో మరియు ఇతర అనేక అవసర సమయాల్లో ఇష్టదైవం జ్ఞాపకంలోనికి వస్తుంది. ఆ విపత్కరపరిస్థితులను అధిగమించడానికి తమ దైవాన్ని ఆపద్బాంధవుడిలా వేడుకొంటారు, ప్రార్థిస్తారు వెనువెంటనే ముడుపులు కడతారు, ఉపవాసాలు చేస్తారు, పూజలు చేస్తారు, మొక్కుబడులను సమర్పిస్తారు.
అయితే వీరిలో భక్తి వున్నా అది అన్యభక్తి , అన్యచింతన మాత్రమే ! అది వారి మనస్సుల్లా చంచలంగా ఉంటుంది!
ఈ భక్తిని ప్రదర్శించడంలో ఇంకొందరు అర్థార్థులు. వీరు కేవలం సంపదలకోసం, సంపాదనలకోసం, కీర్తికాంక్షలకోసం, పదవులకోసం, పదోన్నతులకోసం, తమ అహం ప్రదర్శించడానికి ఆడంబరంగా పూజలు, హోమాలు, క్రతువులు నిర్వహిస్తుంటారు. అందరినుంచి మెచ్చుకోలు మాటలు ఆశిస్తువుంటారు. వీరిలో దేవుని యందు భక్తి కంటే ఇచ్చి పుచ్చుకొనే వ్యాపారధోరణే కనిపిస్తుంది.
వీరు పూజలు 🪔 చేసేప్పుడు దేవుడు వింటాడు అనే నమ్మకంతో చేస్తూవుంటారు!!
అదే ఇతరులకు హాని, ద్రోహం, మోసంచేస్తూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ దేవుడు ఎక్కడ చూస్తాడులే అని అనుకుంటారు!!! ఇది కపట భక్తి, వీరు చేసే పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు,క్రతువులు వంటివి ఎండమావిలో దప్పిక తీర్చుకోవడం లాంటివి.
నీళ్లు లేని బావి, కళ్లు లేని శరీరం, పళ్లు లేని చెట్టు, దీపం లేని ఆలయం ఎటువంటివో వీరి భక్తి కూడా అటువంటిదే!
అయితే మన ప్రార్థనల్లో, కోరికల్లో నిజాయితీ, నిబద్ధత,ధర్మం, ఆర్తీ ఉంటే కరుణామయుడు, ప్రేమమయుడు అయిన ప్రత్యగాత్మ వాటిని సాధించుకునే మనోస్థైర్యంను అనుగ్రహిస్తాడు, ఆ దిశలో నిన్ను నడిపిస్తాడు. మనందరం దైవం యందు భక్తి, శ్రద్ధ, ప్రీతి, విశ్వాసంలతో ఆ పరమాత్మను సేవించి తరించాలి. భక్తిపూర్వకంగా సమర్పించిన పత్రం,ఫలం, పుష్పం, తోయంలలో దేనినైనా దైవం ప్రీతితో స్వీకరిస్తాడు.
ఏక భక్తి పూర్వక ప్రేమనుప్రదర్శించవలసిన అవసరం లేదు,అది అంతరంగ భావన.
నిజానికి భక్తి అంటే ఏమిటి? అప్రమేయుడు, అవ్యయుడు,సర్వాంతర్యామి,సర్వేశ్వరుడు అయిన పరమాత్మను అంతర్దర్శనం చేసుకునే దివ్యానుభూతి. అందుకే…
భక్తి అంటే సమర్పణ భావం.
భక్తి అంటే అంకితభావం .
భక్తి అంటే అచంచల విశ్వాసం.
భక్తి అంటే అనన్య చింతన .
భక్తి అంటే పరమాత్మ కోసం చేసే నిరీక్షణ .
భక్తి అంటే నిత్యయుక్తత్వం.
భక్తి అంటే స్మరణం.
భక్తి అంటే శ్రవణం.
భక్తి అంటే అనన్య దృష్టి.
భక్తి అంటే సంయమనం.
భక్తి అంటే సర్వం సమర్పణ.
భక్తులలో ఎవరో ఒకరు భగవతత్వంని గురించి తెలుసుకునే జిజ్ఞాస కలిగివుంటారు. వారు జిజ్ఞాసువులు. వారు సత్యాన్వేషణలో, పరమాత్మ అన్వేషణలో, సత్యశోధనలో జీవితాన్ని పణంగా పెడతారు. భగవంతుని యందు శ్రద్ధ, నిష్ఠ, ప్రీతి, సంపూర్ణ విశ్వాసంలు వారి ప్రవర్తన, మాటల్లో, చేతల్లో ప్రస్ఫుటం అవుతువుంటాయి. సాకారరూపంలో దేవుడిని పూజించడం, ఆరాధించడం, దేవాలయాలను దర్శించడం చేయకపోయినా వారు నిజానికి ఆధ్యాత్మికక్షేత్రంలో పరమభక్తాగ్రేసురులే! ప్రయాగరాజ్ కుంభమేళాలో నాగసాధువులు అలాంటి దైవజిజ్ఞాసువులే!
దైవంతో నిత్యయుక్తత్వం కలిగి వుండే జ్ఞాని భక్తులందరిలో శ్రేష్ఠుడు. నిత్యయుక్తత్వమనగా నిరంతరం దైవంతో అనుబంధం కలిగివుండే నిరంతరం ఆత్మధ్యానపరుడు. అతను ఏకభక్తి పరాయణుడు అనగా పరమాత్మ యందు తప్ప ఏ ప్రాపంచిక విషయాలపై ఎటువంటి భక్తి ప్రదర్శించని వాడు. మనలో కొందరికి ధనం మీద భక్తి, కొందరికి పదవి మీద భక్తి, కొందరికి అధికారం మీద భక్తి, మరికొందరికి బార్యాబిడ్డలపై భక్తి వుంటుంది. జ్ఞానికి ఒక్క భగవంతుని మీద భక్తి తప్ప మిగిలిన వేనియండు భక్తి ఉండదు.
మానవసేవే మాధవసేవ అనే భక్తి పూర్వక భావనతో అనాథలకు,ఆర్తులకు,సాధువులకు మనం అందిచే స్నేహహస్తం, సహాయతలు ఆ భగవంతుడికి మనం సమర్పించే భక్తి పూర్వక నీరాజనం.
సర్వేజనా సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
RaNa
9900022729
🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️🧘♀️
#divineguidance #yogameditation
#yogainspiration #yogamitra
ధ్యానమాలిక మార్చి 26 సంచికలో ప్రచురణ
No comments:
Post a Comment