Friday, 20 February 2026

ఆధ్యాత్మిక మాలిక 14 శిలలపై శిల్పాలనే చెక్కినారు

శిలలపైనే శిల్పాలు చెక్కినారు 

శిలలలో అందమైన రూపాలను చూడగలిగే వివేవికదృష్టి, ఆ శిలలనే అందమైన శిల్పాలుగా తీర్చే కళావైభవ సంపన్నులు.

ఇసుకలో సౌధాలని చూడగలిగే మేధస్సు , ఆ మేధస్సుతో సుందర ఆకాశ హర్మ్యాలను నిర్మించే అపరవాస్తుశిల్పులు.

మొక్కల్లో ఔషధాలను చూసే అపర ధన్వంతరులు..

మృత్తికలో వస్తు సముదాయాన్ని చూడగలిగే విశేష ప్రజ్ఞాశాలి. ఆ ప్రజ్ఞతో మట్టితో కుండలను, వంట పాత్రలను తయారుచేసే కమ్మరి.

కలపలో 🪵మూర్తీభవించిన మూర్తిని దర్శించే అంతర్దృష్టి, ఆ దృష్టితో అపూర్వ కళావైభవాన్ని సృష్టించే కళామతల్లి ముద్దుబిడ్డ.

భూగర్భంలో  నిక్షేపమైన ఖనిజసంపదలను గుర్తించి వెలికితీసిన వివేకశీలి. 

ఆ వివేకంతో వస్తుసామాగ్రి,పనిముట్లు,ఇతర ఉపకరణాలను మానవవాళికి అందచేసిన అభినవ విశ్వకర్మ.

తన విశేష పరిజ్ఞానంతో వాతావరణ అధ్యయనశీలి, వాన రాక పోకలను అంచనా వేయగలిగిన సామర్థ్యంతో కృషీవలుడికి అందించే స్నేహమాదుర్య హస్తం.

తన మేధ, ప్రజ్ఞ పాటవాలతో ప్రతి నీటి బొట్టు బొట్టునూ ఒడిసి పట్టుకునే నేర్పరితనం, ఆ నీటినుంచి జలవిద్యుత్, సాగునీరు,తాగు నీరులతో దాహార్తి తీర్చగలిగే బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణం.

కంటికి కనిపించని గాలినుంచి విద్యుత్తు తయారు చేయగలిగిన మేధసంపత్తుతో గాలిమరల నిర్మాణం.

సౌరశక్తిని నిత్యావసరాలకు ప్రత్యమ్నాయ ఇంధనంగా వినియోగించగలిగిన నేర్పరితనం.

మానవీయతకు ప్రతిబింభంగా మానవవాళి శ్రేయస్సునే ఆకాంక్షించే విన్నూత్న పరిశోధనలతో మూర్తీభవించిన మహనీయుడు, మానవీయుడు,కృషీవలుడు, మానవుడే!!!

కానీ ప్రస్తుత సమాజంలో మనలో కరుణ, దయ, జాలి, ప్రేమ పూరిత భావనలు హృదయాలలో మసక బారుతున్నాయి మానవీయత అనేది ఆవిరి అవుతూవుంది. పలితంగా నిత్యం …

  • కష్టపడకుండా డబ్బు సంపాదించాలని పెరుగుతున్న నేర ప్రవృత్తి 
  • ఆకలితో అలమటించే దీనులు, అన్నార్తులు 
  • ఏమరుపాటు లేకుంటే కష్టార్జితం దోచుకునే సైబర్ నేరగాళ్లు 
  • కార్పోరేట్ వైద్యం ముసుగులో నిలువుదోపిడి చేస్తున్న వైద్యులు
  • చదువుకునే బదులు చదువుకొనే భావిపౌరులు 
  • డబ్బుకోసమే అవినీతిపరులకు పని చేసే న్యాయవాదులు 
  • సంపాదనే లక్ష్యంగా ఆహారపదార్ధాల కల్తీ మయం 
  • ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే రాజకీయ నాయకులు
  • ఎదగటానికి ప్రక్కవాడిని తొక్కుకుంటూ ముందుకు సాగే వైఖరి
  • స్వార్థం,కపటం,పగ,ప్రతీకారాలు పునాదులుగా విస్తరిస్తున్న సమాజ పోకడలు
  • ప్రమాదంలో వుంటే చేయూతకు బదులు రీల్సు చేస్తూన్న బాధ్యతారాహిత్యం 
  • కామప్రవృత్తితో వావి వరసలు లేకుండా  మోజుతో విపరీత ప్రవర్తన 
  • మతం పేరుతో ఉగ్రమూకల అరాచకత్వం, నరమేధమే ధ్యేయంగా ఆత్మాహుతి దాడులు 

తోటి మనిషిని మనిషిగా చూడలేని అసుర ప్రవృత్తితో చేసే నరమేధానికి ఏ దేవుడైనా హర్షిస్తాడా?!

ఎవరు ఏమైతే నాకేంటి నేను నా కుటుంబం బాగా ఉంటే చాలు తమ ఇరుగు పొరుగు వారితో నా కేంటి సంబంధం అనే ధోరణి. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వుంచితే తమ బాద్యత తీరినట్లే భావించే కొడుకులు.

 ఈ ఆలోచన స్రవంతి, ధోరణులతో కేవలం తమ ఆకాంక్షల కోసం దేవాలయాలు, మసీదులు, చర్చిలు,ప్రార్థనా మందిరాలు, గురు ద్వారాలు,ఆలయాలు, ఆరాధన మందిరాలతో ఎటుచూసినా అప్రమేయుడు, అవ్యక్తుడు, సర్వాంతర్యామి, విశ్వంభరుడు,సృష్టికర్త అయిన ఆ ఇలవేల్పులకు  వారి వారి సంప్రదాయాలతో, విశ్వాసాలతో, నమ్మకాలతో సేవిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మొక్కులు, ముడుపులు,ఉపవాసాదీక్షలు సమర్పిస్తారు. ఆయితే 

  • మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థించేందుకు దర్గాలకు, 🕌మసీదులకు వెళ్లే ముందుగా, నువ్వు అన్యాయము చేసిన వారికి హృదయపూర్వక క్షమాపణలు చెప్పడం నేర్చుకో!!
  • నీవు చేసిన పాపాలకు క్షమాపణ కోరుకునేందుకు గురుద్వార,ప్రార్థనా మందిరాలకు వెళ్లే ముందుగా, నిన్ను గాయపరిచిన వారిని హృదయ పూర్వకంగా క్షమించడము నేర్చుకో!!
  • తల వంచి ప్రార్థించేందుకు గుడులకు,🛕 గోపురాలకి వెళ్ళడానికి ముందుగా నీ తోటి వారి ముందు వినయ,విధేయతలను చూపించడం నేర్చుకో!!
  • దేవుని ముందుదీపాలు వెలిగించేందుకు 💒చర్చికి వెళ్ళడానికి ముందుగా పాపం, గర్వం, అహంభావాల చీకటిని  నీ హృదయం నుంచి తొలగించుకోవడం నేర్చుకో!!
  • దేవుని పాదాలపై 🛐 పూలు పెట్టేందుకు ప్రార్థనా మందిరాలకు, ఆరాధన మందిరాలకు వెళ్ళడానికి ముందుగా నీ  ఇంటిని, మనసుని  దయ, ప్రేమ, వాత్సల్యాల పరిమళాలతో నింపడం నేర్చుకో!! 

భక్తి భావన,ప్రదర్శనలలో స్వచ్ఛత,పవిత్రత,పరిశుద్ధత,ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుంటే ఆ సర్వాంతర్యామికి మనం సమర్పించే కృతజ్ఞాంజలి,నివేదన,సమర్పణ అవుతుంది.

అంకితభావం,సమర్పణ భావం,అనన్యభక్తి,అనన్య చింతనతో కూడిన ప్రార్థనలే ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి అర్హత అవుతుంది.

తమ విశేష భక్తి ప్రదర్శనలో భాగంగా ఆ పరమాత్మ అనుగ్రహం కోసం నూతనంగా అనేక గుడులు,గోపురాలు,దేవాలయాలు,ప్రార్థన మందిరాలు,ఆరాధన మందిరాలు, మసీదులు, చర్చీలను నిర్మిస్తున్నారు.  ఆడంబరానికి ప్రాధాన్యత,గుర్తింపులకోసం చేసే ధార్మిక కార్యక్రమాల

సాధారణ పలితాలను అందచేస్తాయి.

కరుణ, దయ, జాలి, వినయం, విధేయత, ప్రేమ పూరిత హృదయంలో మానవీయత వికసిస్తుంది, పరిమళిస్తుంది. వారి సేవలు ఉత్తమ పలితాలకు మార్గదర్శనం అవుతాయి.

సర్వేజన సుఖినోభవంతు 

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘🧘🧘🧘🧘🧘 



 





No comments:

Post a Comment