జ్ఞాన, విజ్ఞానస్వరూపమే పరమాత్మ!!
మనం తరచుగా వినేది , మాట్లాడుకునేది, తెలుసుకోవాలి అనే కుతూహలంని జిజ్ఞాసని యోగులలలో , వేదాంతులలో, మేధావులలో, పండితులలో, కళాకారులలో మరియు సామన్యులలో కూడా ఆసక్తిని, ఉత్కంఠతను కలిగించేది “జ్ఞానం”
- జ్ఞానం అంటే ఏమిటి?
- జ్ఞానం ఎలా వుంటుంది?
- జ్ఞానం ఎక్కడ ఉంది?
- జ్ఞానం ఎలా సంపాదించాలి?
- జ్ఞానం మనలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందా?
- జ్ఞానం సంపాదించుకుంటే ఇక వేటి అవసరం వుండదా?
- జ్ఞానం నిజంగా ప్రభావశీలినా?
- జ్ఞానం విజ్ఞానం రెండు ఒకటేనా?
ఆకర్షణీయమైన, అందమైన శిల్పాన్ని చూసిన ఎవ్వరి మనస్సైనా అలౌకిక ఆనందానుభూతిని పొందుతుంది. అలాంటి అరుదైన అపురూప శిల్పాన్ని ఓ శిల్పారామంలో చూసి అక్కడే ఉన్న రూపశిల్పిని సమీపించి చిరునవ్వుతో అతని సృజనాత్మకను అభినందించగా ఆ శిల్పీ వినయంతో, వినమ్రంగా అందులో తన ప్రతిభ ఏ మాత్రంలేదని అందం అనేది సహజంగానే ఆ శిలలోనే ఒదిగి అంతర్గతంగా మన దృష్టికి అందనంతటి దగ్గరిగా ఉంది, దానిని కేవలం తన అంతర్ దృష్టితో స్పర్శిస్తూ తన చేతిలోని పనిముట్లు సుత్తి, ఉలిసహాయంతో మృదువుగా స్పర్శిస్తూ అవసరంలేని శిలాభాగాలను,వ్యర్థాలను పరిశీలించి మృదువుగా, సున్నితంగా వేరుచేశాను,అంతే అన్నారు.
అదే విధంగా జ్ఞానం అనేది అంతర్వాహినిగా మనందరిలో వుంది, అయితే మసకబారిన దీపకాంతి ఎలా ఉంటుందో అదే విధంగా మనలోని జ్ఞానజ్యోతి అహం , కామం, క్రోధం, లోభం ,మొహం అనే అజ్ఞానంలతో ఆవరించి మసకబారివుంది. లాంతరు చిమ్నీని ముగ్గుపొడితో శుభ్రపరిస్తే ఆ దీపకాంతి తిరిగి ప్రకాశిస్తుంది. అదేవిధంగా అజ్ఞాన భరితం అయిన అహం, కామం,క్రోధం,లోభం,మొహం అనే సమిధలు జ్ఞానాగ్నిలో దగ్ధంచేస్తే వేపదుంగ లాంటి ఈ దేహం రత్నభేది ఆసనంగా ఉపస్థితమైన పవిత్ర వేపదుంగగా, పరమ పవిత్రంగా చెక్కబడిన దేవతామూర్తి జగన్నాథ సాకారరూపం అవుతుంది.
కంటికి కనిపించే విశాలంగా విస్తరించిన పర్వతశ్రేణులు, సూర్యుడు ,భూమి, సముద్రుడులకు మించిన పెద్దవీలేవు అనుకునేది సామాన్యజ్ఞానం, ఐతే వాటికంటే అతి పెద్దది మనవెంటనే వుండేది, మనతోనే వచ్చేది , జన్మజన్మలనుంచి వెన్నంటి తోడునీడగా ఉన్నవి ప్రారబ్ధకర్మలు . అవి గతంలో చేసిన, ప్రస్తుతం చేస్తున్న , చేయబోయే పాపకర్మల ఫలాలు. వీటిని అజ్ఞానం నిత్యం మహారాజపోషకులుగా పోషిస్తువుంటుంది. నిజానికి ఈ పాపప్రక్షాలనే మానవ జీవితంకు సార్ధకత, పరమావధి, పరమలక్ష్యం. అయితే మోహబంధం, విడదీయరాని సంసారబంధంతో చిక్కుకొన్న మనం ఆ లక్ష్యాన్ని తెలిసికూడా నిర్లజ్జగా ప్రవర్తిస్తుంటాం.
కర్మ అంటే ఏమిటి?
కర్మ అంటే మనం రోజూ చేసే పనులు. అవి చెడ్డపనులయితే దుష్కర్మలుగా, మంచిపనులయితే సత్ కర్మలుగా, ప్రతిఫలాపేక్షరహితకర్మలయితే నిష్కామకర్మలుగా అవుతాయి.
ప్రాణం పోసేది మందు, ప్రాణం తీసేది కూడా మందే! పేర్లు ఒకటే అయినా గుణంలో తేడా, అదే విధంగా కర్మలు వాటి ఫలాలు, ఫలితాలు కూడా ఉంటాయి.
దుష్కర్మల ద్వారా పాపంవస్తుంది. సత్ కర్మల ద్వారా పుణ్యంవస్తుంది. నిష్కామ కర్మల ద్వారా పరమాత్మతత్వం అయిన జ్ఞానానికి అవి కరదీపిక అవుతుంది.
కేవలం స్వప్రయోజనాలను ఆశిస్తూ ఇతరులకు హానికలిగించే ఏ కర్మలు అయినా పాపకర్మలే అవుతాయి. ఆ కర్మఫలాలు తప్పక అనుభవించి తీరాల్సిందే!
దయ, కరుణ, ప్రేమతో ఆచరించే దానధర్మాలు, సేవాకార్యక్రమాలు, సామాజికసేవలు వంటి సత్ కర్మల ద్వార పుణ్యం లభిస్తుంది. వీరి ప్రవర్తన,ఆలోచనలు ఇతరులకు హానికలిగించనివిగా ఉంటాయి అందువలన అవి పాపకర్మలు, ప్రారబ్ధకర్మల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
మనం చేసే ఏ కార్యలు అయిన లోకకల్యాణం, జనహితం, సమాజశ్రేయస్సుని ఆశిస్తూ కొనసాగిస్తే అవి యజ్ఞక్రియలవుతాయి అవే నిష్కామకర్మలుగా మనలోని పాపకర్మలను ప్రక్షాళన చేస్తూ విజ్ఞానకుసుమాలుగా అంతరంగంలో వికసిస్తాయి.
నిష్కామకర్మాచరణ గత జన్మల పాపకర్మలఫలాలను కూడా దగ్ధం చేసే ప్రభావశీలి! నీవు చేసే ప్రతికర్మ భక్తి, శ్రద్ధ, ప్రీతి, నిష్ఠ, సంపూర్ణ విశ్వాసంతో ప్రతిఫలాపేక్షరహితంగా ఆచరించాలి.
అవ్యయుడు, అప్రమేయుడు, విశ్వంభరుడు, ప్రత్యాగాత్మ, సర్వాంతర్యామిని అంతర్యామిగా మనోక్షేత్రంతో వీక్షించే హృదయద్వారాన్ని అవగతం చేసే శక్తిదాయని నిష్కామకర్మాచరణ.
భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ మానవాళికి ఈ సత్యాన్ని
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన , మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి”అని ప్రబోధగీతంగా మార్గదర్శనం చేశారు.
ఈ నిష్కామకర్మాచరణ నీలో విజ్ఞానాచరణ మార్గంని సుగమం చేస్తుంది.
కత్తి 🔪అన్నింటి కంటే పదునైనది ఎందుకంటే అది ప్రతి వస్తువును ముక్కలు ముక్కలుగా తరిగేస్తుంది అనేది సామాన్య జ్ఞానం. వాస్తవానికి ఆ కత్తి కంటే పదునైన ఆయుధం 👅నాలుక అది తన మాటలలో అహాన్ని ప్రదర్శిస్తూ ఇతరుల మనస్సును హింసించగలదు, గాయపరచగలదు, నమ్మకాలను, విశ్వాసాలను తమ మాటలతో విరిచేయగలదు!!!
మాటల్లో కరకుదనం, పొగరు, గర్వం, అహంకారంల నుంచి దూరంగా సౌమ్యం, ఆప్యాయత, మృదుత్వం కలసిన ప్రియభాషణమే వాచక అహింసాచరణ, అది నిన్ను అందరివాడిని చేస్తుంది. అదే విశేష జ్ఞానం. అందుకే ఆలోచించి సౌమ్యంగా మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ప్రియభాషణం విజ్ఞానదిశగా అడుగులు వేయిస్తుంది. మాట అనేది మరణించేవాడిని కూడా మృత సంజీవనిలా బతికించేలా ఉండాలి కానీ, బతికి ఉన్నవాడిని మానసికంగా చంపే కత్తికాకూడదు.
మనకు అత్యంతదూరంలో ఉండేవి చంద్రుడు , సూర్యుడు , గ్రహాలూ అనేది సామాన్య జ్ఞానం ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా అక్కడకు చేరుకోలేని సుదూరంలో వున్నాయి . అయితే మనకు అత్యంత దూరంలో వుండేది తిరిగి తీసుక రాలేనిది ⏳గడిచిపోయిన కాలం అదే విశేష జ్ఞానం. గతం గురించి బాధపడకండి దాన్ని మార్చలేము, భవిష్యత్తు గురించి ఆలోచించకండి అది ఇంకా రాలేదు, అందుకే వర్తమానంలో జీవించాలి, సమయం తిరిగిరాదు మిత్రమా!
వర్తమానంలో నిర్మాణాత్మంగా సత్కర్మలతో, సత్సంకల్పాలతో, సద్భావనలతో, అనన్య చింతనతో, భక్తినిష్ఠలతో పరమానందభరిత జీవితంగా కొనసాగించాలి. ఈ విశేష జ్ఞానం దశ,దిశలను నిర్దేశిస్తూ అలౌకిక ఆనందమార్గానికి ద్వారం అవగతం చేస్తుంది.
ఈ రోజునుంచే మన ఆలోచనలలో, మాటలలో, పనుల్లో స్వచ్ఛత ప్రతిబింబించేలా మన ద్వారా ఎవరికి అపకారం జరగకుండా వుండేలా మన నడవడిక, ప్రవర్తనలను సవరించుకోవాలి.
- వార్ధక్యదశని స్వాగతించండి అది ఒక శాపంగా భావించకండి, ఇది మానసిక పరిపక్వత. అది ఎవరిమీద అపేక్ష లేకుండా, ఇతరులపై ఆధారపడకుండా స్వాభిమానంతో జీవించడం నేర్పుతుంది. నీవు నిత్యవిద్యార్థివే!!
- జీవితంలో జరిగే కొన్ని విషయాలు మనసుకి తీసుకొని బాధ పడకుండా వాటిని మరచిపోయి ముందుకెళ్లడం మంచిది.
- కుటుంబ బంధాలు, సంబంధాలు శాశ్వతంగా దృఢంగా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. క్షమను కోరడం బలహీనత కాదు అది బలోపేతం చేసే బంధం.
- కుటుంబవ్యవస్థ అంటే భార్యభర్తలుగా కలసి ఉండడమే కాదు, కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై ఎదురైనా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ కడవరకూ తోడు నీడలా వీడని అపురూప బంధం.
- అభిప్రాయభేదాలు లేని బంధం కన్నా అభిప్రాయభేదాలతో ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధమే నిజమైనబంధం.
ఈ ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది అంటే వజ్రము,ఇనుము,ఏనుగు అని భావించడం అనేది సామాన్య జ్ఞానం.వీటి కంటే కఠినమైనది వాగ్దానం. వాగ్దానం చేయడం చాలా తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. దశరథుడు వాగ్దాన నిర్వహణలో తీవ్ర మానసిక క్షోభతో ప్రాణత్యాగం చేశాడు.
అందుకే సంతోషంలో ఉన్నప్పుడు ఎటువంటి మాట ఇవ్వకండి. నీవు ఏ రంగంలో ఉన్నా, అందులో రాణించాలి అంటే ఆలోచించి మాట ఇవ్వాలి,అంతే కానీ మాట ఇచ్చి ఆలోచించడం కాదు అది నిన్ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ ధోరణి వలనే పైనాన్స్, బ్యాంకింగ్,మేనేజ్మెంట్ లాంటి సేవారంగాల్లో లక్ష్యాలు అందుకోవడంలో ఉద్యోగస్తులు తీవ్రఒత్తిడికి లోనవుతున్నారు. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. జ్ఞానం ఆలోచించాక మాట్లాడుతుంది.
నీవు ఆచరిస్తున్న విశేషజ్ఞానమే విజ్ఞానం. అది దప్పికతో అలమటించే మృగతృష్ణ కాదు, అది నీ దాహం తీర్చే ఒయాసిస్ లాంటిది.
సర్వేజనా సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి
నారాయణశెట్టి రాచపూడి
9900022729
🧘🧘🧘🧘🧘🧘🧘🧘
https://yogamithra15.wixsite.com/yogamithra
No comments:
Post a Comment