Sunday, 27 September 2026

రానా కవితలు 11 అభయం

అభయం 

 


ప్రసవ భయం వేదనాభరితం…

పుట్టుకంటేనే ఆగమన భయం

శిశువుగా పాకడం, కూర్చువోడం, నిల్చోవడం,

నడకలలో పడిపోతాననే భయం 

అడుగడుగునా అమ్మ తోడు నీడ అభయం!!

అమ్మతోడు లేని చీకటి భయం

ఒంటరి తనం అంటే భయం 

స్కూల్ అంటే అమ్మ,నాన్నల తోడులేదనే భయం

నాన్న చిటికెనవేలే భవిష్యత్తుకు భరోస, అభయం!!


భవిష్యత్తు అంటే ఆందోళన, భయం 

అన్నదాతకు

అనావృష్టి భయం

అతివృష్టి భయం

అకాలవృష్టి భయం 

కరువు, కాటకాల భయం 

ఎల్వీనో ప్రభావం అంటే భయం 

పంటలకు చీడ పీడల భయం

దళారీల దోపిడి భయం

పంటలకు గిట్టుబాటు ధరలు 

లభించవనే భయం 

శుభాశుభపరిత్యాగి అనే ఆభరణమే 

సదా నీకు అప్రమేయ అభయం!!!


వ్యాపారం అంటేనే…

ఒడి దుడుకుల భయం

లాభనష్టాల భయం 

ప్రతికూలతల భయం

ప్రత్యర్ధుల నుంచి పోటీ భయం 

మార్కెట్లో నూతన రాక పోకడల భయం

పోటీదారుల ఎత్తులు, పై ఎత్తులతో భయం 

రాజకీయ అనిశ్చితస్థితితో భయం 

పన్నుల విధింపుల్లో మార్పులంటే భయం 

వెరసి వరుస వైఫల్యాల వాణిజ్య భయం 

విలువలతో కూడిన వ్యాపార నిబద్ధత 

సదా నీకు అవ్యయ అభయహస్తం!!


ఆనందానికి విషాద మంటే భయం 

సంతోషానికి దుఃఖం అంటే భయం

అందానికి  అనాకారం అంటే భయం 

యవ్వవనానికి వృద్ధాప్యం అంటే భయం

వృద్ధాప్యానికి ఒంటరితనం అంటే భయం 

సంపాదనకు పన్నులు అంటే భయం 

సంపదలకు దొంగలంటే భయం

ఆరోగ్యానికి వ్యాధులంటే భయం

లోభత్వానికి వితరణంటే భయం 


అప్రమేయుడు

అవ్యయుడు 

విశ్వంభరుడు

విధాత యందు 

సడలని విశ్వాసం 

అనన్య భక్తి, శ్రద్ధలే 

సదా నీకు అభయ హస్తం ✋!!!

No comments:

Post a Comment