Saturday, 26 September 2026

ఆధ్యాత్మిక పధం 30 ఈ బంధనాలను తెంచివేయండి!!!

 


ఈ బంధనాలను తెంచివేయండి!!!

అనాదిగా జ్ఞానులు, సాధువులు, సిద్ధులు, ప్రవక్తలు, పండితులు, ముముక్షువులు, పామరులు , సామాన్యులు మరియు యువతలోను ఎడతరగని జిజ్ఞాస,ఉత్సుకత,ఆసక్తిని కలుగచేస్తునేవుంది ముక్తి మార్గ అవతరణను మార్గదర్శనంచేసే కర్మాచరణ మరియు కర్మ బంధనాలు. 

ఐతే ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే …

  • కర్మలు అంటే ఏమిటి ?
  • కర్మలు మనం ఎందుకు చేయాలి ?
  • కర్మలు చేయకుండా వుండగలమా?
  • కర్మలు ప్రతిఫలాలను అందచేస్తాయా?
  • కర్మ ఫలాలను మనం అనుభవించాల్సిదేనా?
  • కర్మ ఫలం అనుభవించకపోతే ఏమవుతుంది?
  • కర్మలు మనలని అధోగతిలో పడేస్తాయా?
  • కర్మలన్నీ మనల్ని బంధించి ఉంచుతాయా?
  • కర్మలు అనేవి నిజంగా శాపమా లేక వరమా?
  • కర్మలు అనేవి కేవలం మనకేనా లేదా సకల జీవరాశికి వర్తిస్తాయా?
  • కర్మ బంధనాలు తెంచుకోలేనంతటి ధృఢంగా పెనవేసుకుని వుంటాయా?
  • దృఢంగా పెనవేసుకుపోయిన ఈ కర్మ బంధనాలు ఏమవుతాయి?
  • ఈ కర్మలను ఎవరు గమనిస్తూ ఉంటారు?
  • ఈ కర్మల చిట్టా ఎవరు మెయింటెయిన్ చేస్తారు?
  • ఆ అజ్ఞాత వ్యక్తి లేక శక్తి ఎక్కడ వుంటారు?


కర్మ అంటే చేసే పనులు.శ్వాసక్రియ, అన్నపానీయాలు, నిద్ర, మైధునం అనేవి జీవలోకంలో దైనిక కర్మాచరణలే!!! ఈ సాధారణ కర్మాచరణ లేకుండా ఏ జీవి అయినా మనుగడ సాగించడం అసాధ్యం. ఆచరించే ప్రతి పని కర్మఫలంని అందిస్తుంది. అన్నపానీయాలు తీసుకోవడం ద్వారా ఆకలి, దప్పిక తీరుతుంది. తగినంత నిద్ర శరీరాన్ని,మనస్సును ప్రశాంతంగా వుంచుతుంది. శ్వాస జీవితానికి ఆధారం అవుతుంది. మైధునం సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది. సాధారణ కర్మాచరణ సకల జీవరాశికి సహజ క్రియలే!! సహజకర్మలన్ని కర్మ బంధనాతీతం!!!


మన జీవితమంతా కోరికలనే చక్రబంధనంలో  తిరుగుతుంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనసు ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది.

మన ఇంద్రియాలు కర్మలు చేస్తాయి, అయితే వాటిని అనుభవించేది ఎవరు?

  • రోడ్డుపై నడుస్తుంటే ఓ ₹500 నోట్ల కట్ట కనిపించింది . కళ్ళు దానిని చూస్తాయి. వెంటనే మనసు, "ఇది నాకు కావాలి" అంటుంది. వెంటనే కళ్ళు అటు ఇటు పరిసరాలను పరికించి చూస్తాయి, నడుము వంగుతుంది చేతులు వాటిని అందుకుని జేబులో పెట్టుకుంటాయి, కాళ్లు వడివడిగా అక్కడినుంచి వెళ్తాయి.
  • బజారులో ఓ రెస్టారెంట్ దగ్గర నుంచి వెళ్తుంటే గుమగుమలాడే వాసన వస్తుంది. ముక్కు ఆ వాసనను గ్రహిస్తుంది. వెంటనే మనసు, "ఈరోజు గుమగుమలాడే ఆ రెసిపి తిందాం" అని కోరుకుంటుంది.
  • స్వీట్ షాపు కనిపిస్తే "ఈరోజు స్వీట్ తీసుకుందాం" అని మనస్సు కోరుకుంటుంది.
  • రెస్టారెంట్ లో మంచి సినిమా పాట వినిపిస్తుంది. చెవులు ఆ శబ్దాన్ని వింటాయి. వెంటనే మనసు, "ఆ సినిమాకు వెళ్ళాలి అని అంటుంది”
  • నయనానందకరమైన పూలవనాలు, సుందరమనోహర ప్రకృతి, ఆహ్లాదకరమైన హిమగిరి సొగసులు, అందమైన వ్యక్తిని చూసినపుడు మనస్సు సహజంగా అటు ఆకర్షితమవుతుంది.


ఐతే

కళ్లు చూస్తాయి, కానీ అవి,ఇవి కావాలి అని కోరుకోవు 

చెవులు శ్రావ్యమైన సంగీతం వింటాయి, కానీ ఆ మాధుర్యాన్ని ఆస్వాదించలేవు

నాలుక షడ్రుచులను గ్రహిస్తుంది, కానీ ఆ రుచులను ఆస్వాదించలేదు

చర్మం స్పర్శను గ్రహిస్తుంది, కానీ స్పర్శానుభూతితో సుఖించలేదు 

నాసిక వాసనను గ్రహిస్తూంది, కానీ ఆ పరిమళాలను ఆస్వాదించలేదు

పంచేంద్రియాల పని కేవలం ప్రపంచంలోని విషయాలను మనసుకు అందిస్తున్నాయి. 

మరి వీటిని నీలో అనుభవించేది ఎవరు? అంటరింద్రియం అయిన మనస్సు వీటిని అనుభవిస్తుందా…ఈ మధురిమలను ఆస్వాదిస్తుందా!!


వాస్తవానికి మనస్సు ఎప్పుడూ “ఇది కావాలి, అది కావాలి, ఇంకా కావాలి, అంతా నాకే కావాలి" అని అలసట ఎరుగని పరుగులు తీస్తూనేవుంటుంది!! కానీ మనస్సు కూడా ఒక ఉపకరణమే! అది ఆలోచిస్తుంది, ఊహిస్తుంది, గుర్తుంచుకుంటుంది, కోరుకుంటుంది. కానీ స్వతంత్రంగా అనుభవించలేదు. అయితే  మరి వీటిని అనుభవించేది ఎవరు?


జగద్గురు శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహ సంభాషణంగా బోధించిన సత్యం:

"శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ।

 అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే".


జీవుడు "నేనే అనుభవిస్తున్నాను" అనే భావనలో ఈ దేహక్షేత్రంలో ఉపస్థితుడిగా ఉంటాడు.

మనస్సు, బుద్ధి, పంచప్రాణాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు మొదలైన ఉపాధులు కలిసిన సూక్ష్మరూప శరీరధారి జీవుడు. జీవుడు "నేనే తిన్నాను, నేనే సుఖపడ్డాను, నేనే బుద్ధిమంతుడిని, నేను ఎలాగైనా సంపాదించగలను, నేనే బాధపడ్డాను" అనే భ్రాంతిలో వుంటాడు. డబ్బు, నగలు, ఆస్తులు ఎంత సంపాదించిన వాటిని తినలేడు, తనవెంట తీసుకపోలేడు!! ఈ సత్యం తెలిసినా ఆ బ్రాంతిని అధిగమించలేని అవివేకి.


మనం చేసే పనులు చేయదగినవి అయితే అవి సత్కర్మలవుతాయి,అవే చేయదగనివి అయితే దుష్కర్మలవుతాయి. సత్కర్మలు పుణ్యఫలాలవుతాయి. దుష్కర్మలు పాపఫలాలవుతాయి. 


ఈ పాప పుణ్యాలు చేసేది శరీరంతో, మరి వాటిని అనుభవించేది ఎవరు?

కామం,క్రోధం,లోభపూరిత మనస్సుతో అన్ని జమచేసుకునే జీవుడు నిజంగా అనుభవిస్తున్నాడా? లేక నీలో ఉపద్రష్టగా హృదయ స్థితుడైన పరమాత్మాంశ అయిన ఆత్మ వీటిని అనుభవిస్తుందా? 


ఆత్మ అవ్యయుడు, అచింత్యుడు, అణువుకంటే సూక్ష్మ మయిన పరమాణు స్వరూపుడు. 

ఆత్మకు ఆకలి లేదు, దాహం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, కోరికలు లేవు.

ఆత్మ కేవలం సాక్షిగా మన హృదయాంతరాలలో ఉపస్థితుడు. 

ఆత్మ సనాతన మయినది. కాలానుతీతమయినది. ఇది మనలో శుద్ధచైతన్య శక్తి ⚡️.

సాక్షిగా మనం చేసే కర్మలను, వాటి కర్మఫలాలను నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. 

మీ చిత్తంలో అనాదిగా చిత్రగుప్తుడి చిట్టాగా భద్రపరుస్తూనే ఉంది. అవే మీకు లలాట లిఖితాలు, విధి వ్రాతలు అవుతాయి. సత్కర్మల ద్వారా మీ భవిష్యత్తును తిరిగి వ్రాసుకునే అపర బ్రహ్మలు మీరే!!! 


తామరాకు పై నీటిబొట్టులా ఆత్మకు ఏది అంటుకోదు మరి అనుభవించేది ఎవరు? 

జీవుడు అన్ని పాప, పుణ్య కర్మ ఫలాలను అనుభవించి తీరవలసిందే!!

పుణ్యకార్యాల ఫలాలు జీవుడికి స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాయి. పుణ్యం క్షీణించిన తరువాత జీవుడు శేష కర్మఫలాలను సంచిత కర్మలుగా అనుభవించడానికి ఉన్నత కుటుంబాలలో ఇంకో జన్మ తీసుకుంటుంది.

పాప కర్మలు జీవుడిని అధోగతిపాలు చేస్తాయి. అసంపూర్ణ కర్మఫలాలు ఆగామి కర్మలుగా జీవుడి మరుజన్మకి కారణ మవుతాయి. కర్మ ఫలాలను పూర్ణంగా అనుభవించే వరకు జీవుడు పునరపి జననం అనే జీవన చక్రంలో తన పయనం కొనసాగిస్తూనే ఉంటుంది.


కర్మానుబంధీని అయిన జీవుడు అనేక జన్మల నుంచి దృఢంగా పెనవేసుకుపోయిన కర్మ బంధన సంకెళ్లను తెంచుకోలేదా? వాటి నుండి విముక్తి పొందడానికి జీవుడు ఏమిచేయాలి?

విధాత,అప్రమేయుడు,విశ్వంభరుడు అయిన పరమాత్మ గీత ద్వార మానవాళి సౌభాగ్యమే పరమావధిగా ఈ హితోపదేశం చేశారు. 

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । 

మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోయస్త్వకర్మణి॥

ఈశ్వరార్పణ చిత్తంతో పనులు చేయడం నీ కర్తవ్యం! చేసే ప్రతి కార్యం బాధ్యతయుతంగా విధి నిర్వహణలయందు శ్రద్ధ, అంకితభావం, దృఢ సంకల్పంలతో ఫలాపేక్ష రహితంగా నిర్వర్తించు! 

ఫలితం ఆశించకుండా శ్రద్ధతో పనిని నిర్వర్తిస్తే ఫలితం దానంతట అదే సిద్ధిస్తుంది.

కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు…

ఫలాపేక్షరహిత కర్మాచరణ పేరుతో ఏ పని చేయకుండా సోమరిగా వుండడం సర్వదా ఆక్షేపణీయం.


ఈ దేహామే యజ్ఞవేదిక. జనహితం, లోకకల్యాణం, సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ నిర్వర్తించే ప్రతి కార్యం ఈ యజ్ఞవేదికకు యజ్ఞక్రియ అవుతుంది. యజ్ఞక్రియఫలాలు అనాదిగా నిను వీడని సర్వ కర్మబంధనాలను తెంచివేస్తాయి మరియు నిర్వీర్యం చేసే ప్రభావవంతమైనవి. 

యజ్ఞక్రియలు అలోలుప్త్వంగా, మనస్సు మార్దవం, అక్రోధసహితంగా నిర్వర్తించే సజీవ కార్యాలు…

  • పాత్ర నెరిగిన దాన, ధర్మాలు 
  • ఆర్తులకు అందించే ఓదార్పు,చేయూత 
  • ఇతరుల బాధను చూసి జాలి పడే మనసు.
  • స్వార్ధం లేకుండా వారికి మేలు చేయడం
  • ఆలయాలలో భక్తులకు,వృద్ధులకు,దివ్యాంగులకు అందించే స్నేహహస్తం 🤝
  • జీవరాశుల యందు కరుణ కలిగివుండడం 
  • పక్షుల దాహార్తి తీర్చడానికి అందుబాటులో నీరు 🌊 వుంచడం 
  • పశు పక్ష్యాదులకు ప్రేమతో మేత అందచేయడం 
  • సాగునీరు, త్రాగునీరు, నది జలాల పరిరక్షణకు చేయూత 
  • పర్యావరణ పరిరక్షణగా ఓ చెట్టును నాటి ఆలన,పోషణ కలుగ చేయడం 


జీవిత సత్యం ఏమిటంటే 

మనసు కోరికలను సృష్టిస్తుంది, కోరికలే గుర్రాలుగా నిన్ను పరుగులు తీయిస్తుంది.

పరమాత్మ ప్రతిబింభ రూపం అయిన ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ అనపేక్షగా,ఉదాసీనంగా, శుచిర్దక్షగా, సాక్షిగా మార్పులేనిదిగా ఉంటుంది.

కోరికలకు నీవు బానిస కాకుండా, కోరికలు నీకు బానిసలవుతే జీవిత గమన రూపురేఖలు మారిపోతాయి. భౌతిక ప్రపంచం మీద, వస్తుసామగ్రి ప్రోగుచేయడం మీద వ్యామోహం తగ్గిపోతుంది. ఫలితంగా ఇంద్రియాలు మనసులో విలీనం అవుతాయి. మనసు హృదయంలో విలీనం అవుతుంది. అంతర్ముఖ పయనం చైతన్యవంతం అవుతుంది.

జీవుడికి భృమధ్య స్థానంలో ఆత్మ సాక్షాత్కార అనుభవం కలుగుతుంది.


సర్వేజనా సుఖినోభవంతు

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

నారాయణ శెట్టి రాచపూడి 

వ్యవస్థాపకులు

రానా యోగ ఆలయ 

9900022729

🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 








No comments:

Post a Comment