Saturday, 4 April 2026

ఆధ్యాత్మిక పధం 25 విశ్వం విష్ణు స్వరూపం

 


విశ్వం విష్ణు స్వరూపం 

అజరామరం, అద్వితీయం , అనంతం , అప్రమేయం అయిన ఈ విశాల విశ్వం ఓ మహా ద్రవ్యరాశి. అవ్యక్తం, అచింత్యం మయిన ఈ సృష్టి సాక్షాత్ ఆ విశ్వంభర దివ్యస్వరూపం.  

పరబ్రహ్మ సృష్టికర్త, పరబ్రహ్మ పదార్థం ఆయన సృష్టి. ఈ పరబ్రహ్మ పదార్థం మహిమాన్వితం, చైతన్యవంతం, జీవభరితం. ఈ జీవభరిత జీవనపదార్ధం అనంత విశ్వంలో విష్ణువుగా విస్తరించిన దివ్యపదార్థం. ఇది నిరాకార, నిర్గుణ సహిత జీవాత్మగా కల్పారంభంలో పరమాత్మ నుంచి ఆవిర్భవించిన మరణం ఎరుగని మనలోని జీవాత్మ.

సృష్టి, సృష్టికర్త వేరు వేరు కాదు అని అంతర్ముఖుడు అయిన తత్వవేత్త ఎరుకతో గ్రహించిన సత్యశోధన. తత్వవేత్త అయిన యోగీశ్వరుడు అవిభాజ్యమైన పరమాత్మ సృష్టిలో, ప్రతి జీవిలో పరమాత్మ స్వరూపం అయిన జీవాత్మ అని గ్రహించాడు, మనోనేత్రంతో వీక్షించాడు, తరించాడు. ఈ తత్వదర్శి అయిన జ్ఞాని ఏ జీవికి అపకారం కల్గించే ఆలోచనను మనస్సులో కూడా తలంచడు.  ఈ కర్మ యోగి పరమాత్మకు అత్యంత ఇష్టసఖుడు, అతనిలోనే ఉపద్రష్టగా ఆసీనుడవుతాడు.

అవ్యక్తం అంటే కంటికి గోచరం కానిది, అంటే దృష్టి 👁️ కి అందనిది. మానవ నేత్రం చూడలేనిది, అంతే కానీ ఏమీ లేదు అనే అజ్ఞానం కాదు.

బావిలోని కప్ప 🐸 దృష్టి పరిమితం అంటే బావిని దాటి బయటకు చూడలేడు. దాని దృష్టిలో ఈ ప్రపంచం ఇంతకు మించి ఏమీ కాదు.

అచింత్యం అంటే ఊహలకు, ఆలోచనలకు అందనిది.

అదే  మండుకం యాదృచ్ఛికంగా ఓ కొండ కొలనుకు చేరితే దాని ఆలోచన పరిధి, ఊహలలో ఈ ప్రపంచం అది తను ఉన్న బావికంటే, కొలను కంటే విస్తృతం, విశాలం అని భావించవచ్చు. మనం ఈ కుటస్థ మండుక స్వభావాన్ని కలిగి వుంటాం, ప్రదర్శిస్తూంటాం.


ఈ అనంత విశ్వం 🪐 కూడా సామాన్య దృష్టికి అవ్యక్తం, అచింత్యం, 

మేధావి, జ్ఞాని, జిజ్ఞాసి,తత్వవేత్త, జితేంద్రియుడు, యోగీశ్వరుడు, అంతర్ముఖుడు, సత్యాన్వేషి, శాస్త్రవేత్త, సాధువు,శాస్త్రజ్ఞుల దృష్టిలో ఈ విశ్వం అసామాన్యం, అప్రమేయం,అద్వితీయం, అజరామరం.

ఆరు బయట వినీల ఆకాశాన్ని రాత్రి సమయంలో ఆసక్తితో వీక్షిస్తే అసంఖ్యాక నక్షత్రాలు, నక్షత్రమండలాలు , నక్షత్రరాశులను మన కన్ను చూస్తుంది. ఇవి అన్ని సృష్టిలోని ఓ పాలపుంత “గెలాక్సీ “ కుటుంబసభ్యులు మాత్రమే. ఓ అధునాతన టెలిస్కోప్ వ్యవస్థ 🔭 ద్వార ఈ అనంత విశ్వంలో అనేకానేక పాలపుంతలను వీక్షించవచ్చు. ఈ అపూర్వ ఖగోళ జ్ఞానం కోసం మీ కుటంబ సభ్యులతో ఓ సారి నక్షత్రశాలను తప్పక దర్శించండి. మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేసే ఖగోళ విశేషాలను, నక్షత్రాలను, తోకచుక్కలను, ఉల్క ☄️ లను, సౌరకుటుంభం, పాలపుంతల అనుభూతులను సొంతం చేసుకోండి. 


ఈ విశాల విశ్వంలో ఓ గెలాక్సీ 🌌 లోని అనంత నక్షత్రాల సమూహల సముదాయంలలో మన కంటికి గోచరించే అతి దగ్గరి నక్షత్రం సూర్యుడు 🌅ఈ సౌరకుటుంబంలోని నవగ్రహాలలో మనం నివసించే ఈ భూమి 🌍ఓ గ్రహం మాత్రమే! మనకు దగ్గరిగా అగుపించే చంద్రుడు 🌒 ఈ భూమికి ఓ ఉపగ్రహం మాత్రమే. ఈవిశాల విశ్వంలో మనం నివసించే భూమి పరిమాణం అల్పం, బహుశా సముద్రంలో ఓ నీటి చుక్క లాంటిది!! 

ఇంతటి అల్పపరిమాణంలో ఉండే ఈ భూమండలంలో నీ దేశం సూక్ష్మం. అందులో నీవు నివసించే నగరం అతిసూక్ష్మం. ఈ అతిసూక్ష్మంలో నాది అని భావించే పొలాలు,ఇల్లు,పాడి పంటలు, మణులు మాణిక్యాలు, నగలు,సంపదల పై ఇంతటి తాపత్రయం, మోహం, అపేక్ష అవసరమా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సమాధానం మీకే అవగతం అవుతుంది.


సృష్టి, స్థితి,లయ,తిరోధాన,అనుగ్రహం అనే పంచ కృత్యముల విధాత సర్వాంతర్యామి !!

మనం తీసుకునే శ్వాస ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన,సమాన పంచప్రాణాలుగా జీవుడి మనుగడకు అధిపతిగా అంతర్యామిగా జీవులలో ఉపస్థితుడు.  

మనం ఆశించి,కాంక్షించి,వాంఛించి,అపేక్షించి మన ఇష్టదైవానికి సమర్పించే భక్తిపూర్వక ప్రార్థనలు, నామ స్మరణలు, సంకీర్తనలు, అర్చన పూజలు, వ్రతాలు, క్రతువులు, హోమాలు, యజ్ఞాల వంటి సకామ కార్యకర్మలు మీకు ఇష్ట ఫలాలను అనుగ్రహించవచ్చు, కానీ ఇది అన్యభక్తి మాత్రమే. సకామకార్యకర్మ ఫలాలకు అతీతమైనది ప్రతిఫలాపేక్ష రహితం అయినది అనన్యభక్తి.


శ్రీ కృష్ణ పరమాత్మ ప్రబోధించిన మహామంత్రం “అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || “


అనన్యభక్తితో దైవాన్ని ధ్యానించే భక్తుని యోగక్షేమాలను దైవమే భరిస్తాడు!! 

అప్రమేయుడు, అంతర్యామీ, సర్వేశ్వరుడైన భగవంతుడి అనుగ్రహం పొందానికి అనన్యభక్తి సాధనే జీవితపరమార్ధంని అవగతం చేసే మహామంత్రం!!!

ఈ ప్రపంచంలో నీవు ఒంటరి వాడివి కాదు అని పరమాత్మ ఇస్తున్న అనుగ్రహపూర్వక అమృతవాక్కు!!!

ఇది ఊగిసలాడే మనస్సుకు ధైర్యం, అలసిన హృదయానికి స్వస్థత,అనిశ్చితిలో అలమటించే ఆత్మకు నిలయదార్శనం…

భక్తి అంటే ఒక సంప్రదాయం, ఆచారం కాదు అది జీవనవేదం, జీవనసారం.

ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ద్యాసతో కూర్చోవడం కాదు, అది మనస్సులో అంతర్వాహిని..

దేవుడు సుదూరంలో కాదు, హృదయాంతరాలలో ఉపస్థితుడు.

భక్తుడు దైవాన్ని అనన్య చింతన, భక్తి శ్రద్ధలతో అనుసరిస్తున్నట్టు అగుపించినా, వాస్తవానికి దైవమే భక్తుని చేతిని పట్టుకొని యోగక్షేమ మార్గంలో నడిపించే మార్గదర్శి.


సర్వేజనా సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 

Thursday, 19 March 2026

రాన కవితలు 5 అపరిగ్రహం

 

అపరిగ్రహం 


వర్షించే మేఘాలు 🌧️నిరాపేక్షగా 

పుడమి తల్లి దాహం తీరే వరకు,

నది జలాలు 🌊తమ దాహం కోసం 

ఊటబావి నీళ్లు తమ కోసం 

పంటకాల్వలలోని సాగునీరు తమకోసం 

సరస్సులు 🏝️తమ మధుర జలాలను తమ కోసం

మంచి నీటి చెలమలు చివరి నీటిబొట్టు వరకు 

కొద్దిపాటి జలాలను కూడా దాచుకోవు, వాడుకోవు 

అనాసక్తిగా సంపదలను జీవరాశి మనుగడ కోసం

అపరిగ్రహంగా ఇవ్వడం మాత్రమే వాటికి తెలుసు !!!


కూరగాయపాదులు తన కూరగాయలను ,

చెట్లు 🌴తమ మధుర ఫలాలను ,

పూల వనాలు విరభూసిన పరిమళ భరిత 🌸పుష్పాలను,

పండ్ల తీగలు తమ 🍇పండ్లను,

పండ్ల తోటలు తమ ఫలసాయాన్ని,

తమ కోసం దాచుకోవు, వాడుకోవు 

అపరిగ్రహంగా ఇవ్వడంలో ఆనందం ఆస్వాదిస్తాయి!!


విత్తనంగా వున్న తనని 🐜చీమలు,

మొలకగా 🌱వున్న తనని 🦆పక్షులు,

మొక్కగా వున్న తనని పశువులు 🐄తినాలని చూస్తాయి,

అయితే ?!

అదే 🌴చెట్టుగా ఎదిగిన తరువాత 

అపరిగ్రహంగా, అనపేక్షగా 

చీమలు, పక్షులు,పశువులను తన నీడలో సేద తీరుస్తుంది!

రాయి విసిరే చేతికి మధుర ఫలాలనే 🥭కానుకగా అందిస్తుంది!!


పక్షులకు నివాస 🪺స్థానంగా,

గురుకులంలో ఆసనస్థానంగా, 

ప్రకృతి ప్రేమికులకు వనాలలో ట్రీ హౌస్ గా,

సాధువులకు సత్సంగ వేదికగా,

రాజుగారికి సింహాసనంగా

అలలారిస్తుంది!!


ప్రార్థన మందిరాలలో 🕍ద్వారంగా ,

దైవదర్శనానికి ప్రవేశద్వారంగా ,

దేవాలయాలలో 🛕ధ్వజస్తంభంగా,

జగన్నాథుడు 🔱 దారు విగ్రహమూర్తిగా,

శోభ యాత్రలో జగన్నాథ రథంగా,

ఊరేగింపు సేవలో పల్లకిగా 

విరాజిల్లుతుంది!!!


ప్రకృతిలో సర్వం అపరిగ్రహ భావనతో 

మమేకమై సహజీవనం కొనసాగిస్తున్నాయి!!


లోభం, మొహం,క్రోధం, అహంలను 

ధరిచేయని వ్యక్తి పరిపక్వత సాధించిన 

మానవీయుడు, మహానీయుడుగా 

అప్రమేయుడు, అవ్యయుడు, విశ్వంభరుడి

సన్నిధిలో ఆనందభరిత

జీవనయానం కొనసాగిస్తాడు!!!







Friday, 13 March 2026

ఆధ్యాత్మిక పధం 24 అకర్మణ్యత్వం

 

అకర్మణ్యత్వం 

మనం చేసే ఏ పని అయినా కర్మనే అవుతుంది. జీవుడు కర్మ బద్దుడు. తన పనులు తను చేయడం అతని కర్తవ్యం కూడా! అందుకే కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు అని విశ్వంభరుడు జగద్గురువుగా మానవవాళికి ప్రబోధించాడు. 

సమాజంలో ఓ విపరీత పోకడను ప్రత్యేకించి ఉన్నత మధ్యతరగతి, ధనికవర్గలలో మనం గమనించవచ్చు.

ఈ తరగని ఆస్తులను సంపాదించడం నా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకుండా సుఖంగా వుండాలి అని ఆశించడంలో తప్పు ఏముంది, ఇది నా బాధ్యత కూడ కదా?

ఇక వారి పిల్లలు మేమెందుకు పనిచేయాలి ? మా పెద్దలు సంపాదించిన తరగని ఆస్తులు మా వెంట వున్నాయి కదా?

నేనెందుకు కష్టపడి చదవాలి, కావలసిన కోర్సులలో సీటు మా నాన్న కొనిస్తాడు కదా?

ఓ రైతు  స్వేదం చిందిస్తూ ఈ వ్యవసాయం ఎందుకు చేయాలి? ఈ పొలాలను ప్లాట్స్ గా అమ్ముకుంటే డబ్బే డబ్బు వస్తుంది  కదా?

ఈ ఆలోచనాదృక్పథంతో ఆ అప్రమేయుడియందు కర్తవ్యం నావంతు, కాపాడుట నీవంతు అనే ధోరణి కలిగివుంటారు.


పనిచేయకుండా ఉండడమే గొప్పతనం అనే భావనతో ఉండడం అనేది అకర్మణ్యత్వం కాదు. ఇది పని చేయకపోవడానికి సాకులు వెదకడం, వాస్తవానికి ఇది పనిని విడిచిపెట్టే ధోరణి. ఇది ఆటిట్యూడ్, నిర్లక్ష్యం, అనిబద్ధత, అవివేకం, బద్ధకం , సోమరితనం, నిరాసక్తత, అనాశక్తతలతో కలగలిసిన తమోగుణ స్వభావమే అవుతుంది.


పనులు చేయడంలో నిరాశక్తత కలిగివుండడం అకర్మణ్యత్వం అయితే అది పలుసందర్భాలలో అభిలషణీయమే!

పగ, ప్రతీకారం, కక్ష సాధింపులలో రగిలిపోతూ వాటిని సాధించే శక్తి, యుక్తులు, సమర్ధత పుష్కలంగవున్నా, అహంకార రహితంగా నీ సమర్ధతపై అసమర్ధుడిగా అకర్మణ్యత్వం ప్రదర్శించడం సాత్వికగుణసంపన్నుడిగా, ఉన్నతుడిగా నిన్ను తీర్చిదిద్దుతుంది.

వార్ధక్యం, అనారోగ్యకారణంగా ఏ పని చేయకపోవడం అకర్మణ్యత్వం.

శిశువు, బుద్ధిహీనుడు చేసే ఏ పనైనా అకర్మణ్యత్వమే. 

అవ్యయుడు, అప్రమేయుడు, సర్వాంతర్యామి అయిన పరమాత్మ యందు ఆరాధన, ఉపాసన, ఉపవాసం, అనన్య చింతన, అనన్యభక్తి, శ్రద్ధాసక్తులు కలిగిన నిష్క్రియాతత్వమే ఆచరణపూర్వక అకర్మణ్యత్వం. 

మనం చేసే ప్రతి పనికి కర్మఫలం ఉంటుంది. అవి చేసే పనులు సత్కర్మలు అయితే పుణ్యకర్మలుగా, చేసే పనులు దుష్కర్మలు అయితే పాపకర్మలుగా అవుతాయి. ఆ కర్మ ఫలాలు నశించే వరకు తిరిగి పలుజన్మలు తీసుకుంటూ వాటిని అనుభవించి తీరవలసిందే.  ఎవరైతే కర్మఫలాలను ఆశించకుండా నిష్కామభావనతో కర్మలను ఆచరిస్తూవుంటారో వారిని ఆ కర్మ ఫలాలు బంధించవు అనేది కర్మ సిద్ధాంతం.


జ్ఞానులు, సాధువులు , జిజ్ఞాసువులు, శాంతి కాముకులు సాత్వికగుణసంపన్నులుగా సదా కర్మలు ఆచరిస్తూనే వుంటారు, కానీ వాటి పరమార్ధం కేవలం లోకకళ్యాణం, సమాజహితంలను ఆకాంక్షిస్తూ ప్రతిఫలాపేక్ష రహితంగా ఆచరిస్తూవుంటారు, అదే అకర్మణ్యత్వం యొక్క వాస్తవదృష్టి 👁️కోణం. ఇదే బ్రహ్మచర్య దీక్ష !!!

పుణ్యక్షేత్రాలలో, ప్రార్థన మందిరాలలో, దేవాలయాలలో ఆర్తులకు, అన్నార్తులకు అందించే సహాయకచర్యలు, సేవాకార్యక్రమాలు కర్తృత్వభావనరహిత కర్మాచరణే అకర్మణ్యత్వం.

ఏ క్షణం నుంచి అయితే నీ 🧠 మస్తిష్కంలో ఆలోచనలు, మనసా, వాచ చేసే సకామకర్మలు  కేవలం ఇతరుల హితం ఆకాంక్షిస్తూ ఉంటాయో , ఆ క్షణం నుండే మనస్సులో మానవీయత 🌸వికసిస్తుంది !!! వికసిత మానవత్వంతో మానవీయుడవు, మహనీయుడవు అవుతావు!! నీవు చేసే సకామకర్మలు కూడా నిష్క్రియకర్మలుగా పరివర్తనం అవుతాయి. 

అంతఃకరణం కడిగిన స్వాతిముత్యం  అవుతుంది. అంతఃకరణశుద్ధి ద్వార మనస్సులో జ్ఞానం వికసిస్తుంది, జ్ఞాననేత్రం జాగృతి అవుతుంది. జ్ఞానోదయంద్వార పరమాత్మ తత్వం బోధపడుతుంది.

మనం విమానంలో 🛫 ప్రయాణం చేస్తున్నాం అది చాలా వేగంగా దూసుక పోతువుంటుంది అది కర్మ. కానీ విమానగమనం, ఒడిదుకులకు, టర్బులెన్స్ లకు ప్రశాంతంగా నీ 💺 సీటు లో  నిశ్చలంగా ప్రయాణం కొనసాగించే తీరు అకర్మ.  విమానంలో ప్రయాణం కొనసాగిస్తున్న ఈ ప్రయాణంలో నీవు కేవలం సాక్షి అనే భావనతో కొనసాగిస్తే అది అకర్మణ్యత్వం. 

అకర్మ అనేది మనం చేసే పని తీరును చెబితే, అకర్మణత్వం అనేది ఆ పని చేస్తున్నప్పుడు మనలో ఉండే కర్తృత్వ భావన లేని ఉన్నతస్థితి.


నిష్పక్షపాతంగా ఇచ్చే తీర్పు⚖️ అకర్మణ్యత్వం!

నిస్వార్ధరహితంగా రోగికి అందించే వైద్యం 🩺అకర్మణ్యత్వం!

న్యాయబద్ధంగా అమలు చేసే రాజదండన అకర్మణ్యత్వం!

ప్రతిఫలాపేక్షారహితంగా చేసే ప్రతికర్మ నిష్క్రియతత్వంతో కూడిన అకర్మణ్యత్వం!

ఒక జ్యోతి 🪔అనేక జ్యోతులను ప్రజ్వరిస్తూ వెలుగులను పంచుతున్నా తనలోని వెలుగు అంతే దేదీప్యమానంగా ప్రకాశిస్తు ప్రకటితం అవుతుంది. అదే విధంగా ఓ జ్ఞాని, గురువుగా ఇతరుల హృదయాంతరాలలో జ్ఞానజ్యోతి ప్రజ్వలనలకు ఆలంబనగా అవుతాడో ఆ మహానీయుడు మూర్తీభవించిన అకర్మణ్యత్వస్వరూపం!!!


పర్యావరణ 🌴పరిరక్షణ, వన్యప్రాణి 🦌సంరక్షణ, నదీజలాల 🌊పరిరక్షణ, ప్రకృతి 🌴 సమతుల్యతల సంరక్షణ, పుడమి పరిరక్షణ , జీర్ణాలయ పునరుద్ధరణ, దీనజనోద్ధరణ, అభయారణ్య పరిరక్షణ లాంటి క్రియాశీలక కార్యాలకు సమర్పితభావనతో హృదయపూర్వక చేయూత, సంఘీభావం లోకకల్యాణ యజ్ఞక్రియలవుతాయి. యజ్ఞక్రియలన్నీ నిష్కామకార్యాచరణలవుతాయి. అవి ప్రారబ్ధ కర్మ బంధనాలను కూడా దగ్ధం చేయగల ప్రభావవంతం. 

యజ్ఞక్రియలను నిష్కామకార్యాచరణస్థితిగా, అకర్మణ్యత్వభావనతో మనస్సు స్వీకరిస్తుంది. ఆ అకర్మణ్యత్వం పరమాత్మకు చేరువచేస్తుంది. 

మనస్సును ప్రశాంతభరితం చేస్తూ ఆ పరంధామం చేరుకునే ముక్తి మార్గంని సుగమం చేస్తూ ముక్తినాథుడి సన్నిధికి చేరుస్తుంది.


సర్వేజనా సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 






Tuesday, 24 February 2026

ఆధ్యాత్మిక పథం 23 జీవన సాధన


జీవన సాధన 


అవ్యక్తంలో జీవన సమరం ఆరంభించి అసంఖ్యాక శుక్రకణాల పోరాటంలో విజేతగా నిలిచిన ఓ శుక్రకణం అండజంతో కూడి మాతృగర్భ ప్రవేశంతో తన ప్రస్థానం మొదలవుతుంది,  తిరిగి అవ్యక్తంలోనికి చేరుకోవడంతో ఈ జీవన సమరంతో కూడిన మహాప్రస్థానం🪦 ముగుస్తుంది. 

ఈ జీవన సమరమే జీవితం, అది జీవించడానికే.. జీవించడమే నిజానికి జీవన సాధన! 

మనం భగవంతుడి పట్ల ఎరుకతో అంకితభావంతో చేస్తే అదే అద్భుతమైనసాధన అవుతుంది,

మట్టిలో నాటిన విత్తనం మూడోరోజుకి 🌱మొలకెత్తుతుంది, అదే, కాలక్రమంలో అనేక క్లిష్టపరిస్థితుల్లని అధిగమిస్తూ చెట్టుగా 🌴ఎదిగి పూలు 💐 , పండ్లు 🥭, నీడనిస్తుంది, సేద తీరుస్తుంది, 🕊️పక్షులకుఅవాసమవుతుంది, లోకానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది.

ప్రతిఫలం ఆశించకుండా  🌊 నీరు 🌅ఉష్ణతాపంతో ఆవిరిగా పరివర్తనచెంది కారుమబ్బులుగా 🌧️ సుదూర దూరాలు పయనం సాగించి వర్షించి పుడమి తల్లిని పులకరింపచేస్తు, బీటలువారిన భూములను పంటభూములుగా మారుస్తూ , 🏞️నది జలాలుగా,  సాగునీరుగా, 🚰త్రాగునీరుగా దప్పికలను తీరుస్తూ,చల్లటిగాలిగా స్వేచ్చగా వీస్తూ ప్రాణికోటి సేద తీరుస్తుంది.

ప్రకృతిలో ప్రతి చర్య ఎంతో సహజంగా, పరోపకారమే లక్ష్యంగా కొనసాగుతుంది.

మన జీవితమూ కూడా అలానే సాగిపోవాలి. అడుగడుగునా నడవడిక, ప్రవర్తనలలో మానవత్వం వెల్లివిరాయాలి.


ఒక జ్యోతి🪔 మరొక జ్యోతిని వెలిగించినట్లు,  మనిషి దయ, కరుణ,జాలి, ప్రేమ పూరిత ఆలోచనలు, భావనలతో పదిమంది జీవితాల్లో వెలుగులు నింపాలి, అలాంటి  జీవితసాధనలోనే ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది, అది దివ్యత్వాన్ని దర్శనం చేయిస్తుంది, జీవితంలోని రహస్యం, ‘దివ్యత్వం ఏంటి అనేది తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన’ అని పరమహంస యోగానంద పేర్కొన్నారు.

మానవ జన్మను భగవంతుడి ప్రసాదంగా భావించినప్పుడు భక్తిగా రెండు చేతులూ పైకెత్తి ఆ దివ్య జీవనాన్ని ఆహ్వానించాలి, అందులోని తాత్వికతను గుర్తించాలి,

సాధారణ మనిషి కూడా సాధనవల్ల అనేక ధార్మిక ప్రయోజనాలు పొందగలడు,

అందుకు:

  • అన్ని విషయాల్లోనూ దృఢచిత్తం కలిగి ఉండి , వాస్తవ పరిస్థితులపై తిరుగులేని విజయం సాధించాలి,
  • ఏ పని చేస్తున్నాసరే, అంతరంగ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఉండాలి, తన ప్రజ్ఞను వదులుకోకూడదు.
  • మాట, ఆలోచన, చర్య ప్రతిదానిలోనూ స్వచ్ఛత, సహనం,మంచితనం ప్రతిబింబించాలి, అప్పుడు, అంతరంగం దివ్యమైన ఆనందమయమైన  అనుభవాలను పోగుచేస్తుంది, ఆ దివ్యానుభవాలే ,అంతర్యామి సన్నిధికి చేర్చే ఆలంబనలవుతాయి. 

అలౌకిక అనుభూతి పొందడానికి తన మనసును గెలుచుకున్న జితేంద్రియుడుగా ఎదగాలి, పరమాత్మ యందు అనన్యచింతన కలిగివుండాలి. ఇందుకు నియమబద్ధమైన జీవితం గడపాలి. తనలోని అన్ని కోరికలను సమర్పణ భావనతో ఆ మాధవుడికి సమర్పించుకోవాలి.

శ్రద్ధ, సహనం, అంకితభావనలతో ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి,

ఇటుక మీద ఇటుక పేర్చినట్లు ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించుకోవాలి,

ఈ ప్రయాణంలో ఎక్కడా అలసిపో కూడదు. విజయ దరహాసంతో, తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక శిఖరాన్ని చేరుకోవాలి, అప్పుడే మనిషి జీవనసాధన ఫలిస్తుంది,

ఆధ్యాత్మిక సాధనలోని రహస్యం... ఆ సచ్చిదానంద రూపమైన దివ్యత్వం మనిషి అనుభవంలోకి వస్తుంది,

అపురూపమైన ఆ అనుభవాన్ని, ఆత్మానుభూతిని, ఆనందానుభూతిని మనిషి మాత్రమే పొందగలడు,

ఇదంతా,ఆధ్యాత్మిక జీవన సాధనవల్లే సాధ్యమవుతుంది.


సర్వేజనా సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక సేవలో

RaNa

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

#divineguidance #yogameditation 

#yogalifestyle 

#yogainspiration #yogamitra 



ఆధ్యాత్మిక పథం 22 సుకుమారం


సుకుమారం 

ఆ రోజుల్లో  రోజువారి పనులు పూర్తిచేసుకొని స్నానానంతరం జడవేసుకొని, కొద్దిగా మొహానికి పౌడర్ అద్ది, కట్టు, బొట్టు, కాటుకలతో అద్దంలో 🪞తమ ముఖారవిందాన్ని  చూసుకుంటూ తుదిమెరుగులతో మురిసిపోయేవారు. 

ఈ రోజుల్లో యువత మాటి మాటికీ అద్దంలో 🪞అదే పనిగా చూసుకుంటూ మురిసిపోవడం ఓ దినచర్యగా మారిపోయింది.. అలా చూస్తుంటే ఏమవుతుంది? అదే  ముఖం సుకుమారమైనదిగా, అదే వర్చస్సు నాజూకుగా, ఆకర్షణీయమైన శరీరసౌష్టవంగా నిన్ను మోహంలో పడేస్తుంది.నెమ్మది నెమ్మదిగా మనస్సుకు నచ్చిన ఆ రూపం కోసం నీవు విపరీతమైన శ్రద్ధ చూపడం మొదలవుతుంది. 

ఈ మానసిక బలహీనతలను  సొమ్ముచేసుకోవడానికి మార్కెట్లలో సౌందర్యపరిరక్షణగా బోటాక్స్, బ్యూటీ పార్లర్లు, బ్యూటీ సెలూన్లు  తామరతుంపర్లగా వీధి వీధికి పుట్టుకొస్తున్నాయి. తమ కార్యక్రమాలను శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నాయి, నిర్వహిస్తున్నాయి.

  • ముఖ సౌందర్యం కోసం ఫేస్ క్రీంలు, 🧴ఫేస్ ప్యాక్ లు , స్క్రబ్బర్స్ 🧽, మేకప్ బోటిక్, కన్సిలర్స్
  • ఆకర్షణీయమైన 👄పెదవులకోసం 💄లిప్ స్టిక్స్,అప్పర్ లిప్ త్రెడింగ్, బొటాక్స్ , లిప్ గ్లాష్ 
  • కనుబొమ్మల మెరుపు కోసం  ఐ బ్రో థ్రెడింగ్, ఐ బ్రో టింట్, ఐ లాషెస్, ఐ లైనర్, మస్కారా, ఐషాడోలు 
  • కాంతివంతమైన చర్మం కోసం వివిధ రకాల క్లీనర్స్, ఫేస్ వాష్లు, మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్లు, 🧴బాడీ ఆయిల్స్, బాడీక్రీంలు, సన్ స్క్రీన్ లోషన్లు 
  • నఖ సౌందర్యానికి నెయిల్ పాలిష్ 💅 లు, నెయిల్ ఆర్ట్
  • హస్త సౌందర్యం కోసం మానిక్యూర్, హ్యాండ్ వ్యాక్సింగ్ 
  • శిరోజ పోషణ పేరుతో షాంపూలు, కండిషనర్లు 
  • శిరోజాలంకరణ 🧑‍🦰పేరుతో హైలేట్స్ , హెయిర్ డైలు, హెయిర్ స్టైల్ పేరుతో  స్ట్రెయిట్ నర్స్. 

ఈ సౌందర్య పోషణ పేరుతో ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఐస్ క్రీమ్ తిన్నా తినక పోయినా కరిగి పోతుంది, అదే విధంగా ఈ పై పై మెరుగులు ఐస్ 🍧 క్రీమ్స్ లాంటివే!

వేసుకున్న, వేసుకుంటున్న పౌండేషన్, పేస్ ప్యాకులు కడుక్కోవడానికి, తోమడానికి స్క్రబ్బర్స్ పేరు మీదుగా పర్సును 👜 ఖాళీ చేస్తున్నాయి.


అనాదిగా వస్తున్న సాంప్రదాయక సహజ సౌందర్య సాధనాలు ప్రతిభావంతంగా నామమాత్ర ఖర్చుతో చర్మసౌందర్యం, దేహలాలిత్యం,ఆకర్షణీయసౌష్టవంని మీ సొంతం చేస్తాయి..

  • పసుపు, తేనె 🍯 కాంబినేషన్ ముఖం మీద ముడతలు, మచ్చలను తగ్గించి, ముఖవర్చస్సు, చర్మకాంతిని పెంచుతాయి.
  • ముఖంపై టాన్, పిగ్మెంటేషన్ తొలగించడానికి తేనె, పెరుగు మిశ్రమం సహాయపడుతుంది.
  • ఉల్లిరసం, తేనె 🍯 కాంబినేషన్ చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది 
  • వారంలో ఓ తైల స్నానం, పక్షంలో నలుగుపిండితో ఓ అభ్యంగ స్నానం, మాసానికి ఓ కుంకుడు కాయలతో స్నానం మీ శిరోజ సంరక్షణను, కాంతి వంతమైన నిగ నిగలాడే స్కిన్ టోన్ తో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తు సహజ సౌందర్యాన్నీ తీసుకువస్తుంది. మీ మిత్రమండలిలో ఇక మీరే తోపు!! ఇక కండిషనర్లకు, షాంపూలకు ఏ మాత్రం ఖర్చు చేయనవసరం లేదు. 
  • ఎటువంటి స్కిన్ లోషన్ వాడకుండా ఉషోదయ వెలుగుల్లో, సంధ్యా సమయాల్లో ప్రభాత సూర్యుడి దివ్య కాంతులలో మీ తనువు, మనువు పులకరించేలా ప్రతిరోజూ ఓ 45 నిమిషాలు నడక 🚶‍♂️ సాగించండి.ఆ ఆహ్లాదకర అనుభూతులను తనివితీరా ఆస్వాదిస్తూ మీ మనస్సులో మధుర జ్ఞాపకాలగా పదిలపరుచుకొండి.
  • తేలికపాటి వ్యాయామాలు, యోగ సాధనాలకు ఓ అరగంట సమయాన్ని కేటాయించండి.
  • మీ మనస్సుకు నచ్చిన నాట్యం,నృత్యం 🩰, చిత్రలేఖనం 🎨, సంగీతం 🎸లాంటి లలితకళల యందు ఆసక్తి, అభిరుచిని కలిగి వాటిని ఆస్వాదించండి.
  • జుట్టు పలచబడటం, అవాంఛనీయ రోమాలు పెరగడం, మొటిమలు రావడం, బరువు పెరగడం వంటివి హార్మోన్ల అసమతుల్యతనే ప్రధాన కారణం. ఈ సమస్యలను అధిగమించడానికి మంచినీళ్లు రోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి . వారంలో ఓ రోజు కేవలం ద్రవాహారాలు మాత్రమే తీసుకోవాలి..ఇది మీ బాడీలో డిటాక్సిఫికేషన్ చర్యగా ఆమం స్థాయి ని తగ్గించడానికి దోహదం చేస్తుంది.
  • మీరు తీసుకునే ఆహారం 🥗నాణ్యమైనదిగా వుండాలి. సహజ పోషకాలు అయిన పాలు, పండ్లు, నెయ్యి, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పోషక నిధులైన బాదం, ఆక్రోట్లు, అవిసె గింజలు, కాజు,పిస్తా, కిస్మిస్,గుమ్మడి గింజలు వంటివి మాత్రమే ఆహారంలో వుండేలా చూసుకోండి. అవీ మీ హార్మోన్ల పనితీరును, సమతౌల్యతలను మెరుగుపరుస్తాయి. 
  • దీర్ఘకాలం పోషకాహారలోపం హార్మోన్ల వ్యవస్థ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  హార్మోన్ల వ్యవస్థ మెరుగ్గా ఉండడానికి సమతుల్య ఆహారం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రధానం. యోగ 🧘‍♀️సాధన, ధ్యానం, గుడ్ రీడింగ్ 📖,కలుపుగోలుతనం, సహజ జీవన విధానం ఇందుకు దోహదం చేస్తాయి.

గుర్తుంచుకోండి అందం, ఆనందం బయటనుంచి కొనుక్కుంటే వచ్చేవి కాదు. అవి నీలో, నీతోనే, నీలోపలనే ఉన్నాయి . దానిని జీవితకాలం పరిరక్షించుకోవడానికీ కేవలం మీ జీవనశైలీ, జీవితశైలీ ప్రభావితం చేస్తాయి..


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️



ఆధ్యాత్మిక ఫధం 21 ఆనందమే నీ ఆయుష్షు


ఆనందమే నీ ఆయుష్షు 

ఆనందంగా వుండేవాళ్ళు దీర్ఘకాలం జీవిస్తారు.

దీర్ఘకాలం జీవించే వారు మంచి ఆరోగ్యం కలిగివుంటారు.

ఆరోగ్యవంతులుగా వుండేవాళ్లు సంతోషభరిత జీవనవిధానం కలిగివుంటారు.

సంతోషంతో ఉండేవారు  క్రియాశీలక  ఆలోచనలను కలిగివుంటారు.

అవి వారు తీసుకునే ఆహారం, పనులు, ఆలోచనలలో నాణ్యతను కలిగి ఉంటాయి.


ఆరోగ్యవంతులుగా వుండేవారి శరీరంలో ఆమం చాలా తక్కువస్థాయిలో ఉంటుంది.

ఎవరిలో ఆమం ఎక్కువగా తయారవుతుందో వారు అనారోగ్యంతో తరచుగా వ్యాధులభారిన పడుతున్నారు. చరకుడు ‘మందాగ్ని జనితమామం రోగణాం కారణం పరమ్ ‘ అని పురాతన సంస్కృత గ్రంథం ‘చరక సంహితలో 1700 సంవత్సరాల క్రితం పేర్కొన్నారు 

జఠరాగ్ని మందగించడం వల్ల మనం తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కాకుండా పోతుంది. సరిగా జీర్ణం కాని ఆహారం కుళ్ళిపోయి 'ఆమం' అనే జిగట పదార్థంగా మారుతుంది. ఇది శరీరానికి హానికలిగించే విషపదార్థం ‘టాక్సిన్’ రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు కారణమై, వివిధ వ్యాధులకు మూలమవుతుంది

ఈ ఆమం శరీరంలోని వివిధ నాళాలలో పేరుకుపోయి రక్త ప్రసరణకు మరియు పోషకాల సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. శరీరంలోని అన్నిఅవయవాల పనితీరులపైన ప్రభావం చూపిస్తుంది. 

ఆకలి లేకపోవడం, ఎప్పుడూ అలసటగా ఉండటం, నిస్సత్తువ, అలసత్వం, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, నాలుకపై తెల్లని పొర ఏర్పడటం మరియు నోటి దుర్వాసన వంటివి ఆమంస్థాయిలను గుర్తించగలిగిన ప్రాధమిక లక్షణాలు.

ఆమం వల్ల కీళ్లవాతం, అజీర్ణం మరియు వివిధ రకాల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.


మన శరీరాలలో ఆమం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడానికి మన జీవనశైలీనే ప్రధానకారణం. తీసుకునే ఆహారం విషయంలో మానసిక నియంత్రణ కోల్పోవడం,

కేవలం తినడానికే మనం ఉండేది అని కంటికి ఆకర్షణీయం అనిపిస్తే ఏది పడితే అది తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎప్పడు పడితే అప్పుడు తినడం, ఆకలి వున్నా లేకపోయిన కుంభాలు కుంభాలు లాగించి వేయడం ఓ అలవాటుగా అయిపోయింది. 

ఈ ధోరణి వివాహవిందుల్లో జనాలు ఒకరిని మరొకరు నెట్టుకుంటూ అక్కడి వివిధ రకాల నోరూరించే షడ్రుచులతో కూడిన వంటకాలపై దండయాత్ర అప్రహితంగా కొనసాగించడం తరచుగా చూస్తుంటాం.


విరుద్ధ ఆహారాలు జీర్ణక్రియ దెబ్బతినడానికి,గ్యాస్, అసిడిటీలకు,చర్మ సంబంధిత వ్యాధులు రాషెస్, అలర్జీలకు, రోగనిరోధక శక్తి తగ్గడానికి, శరీరంలో విషతుల్యాలు ఆమం పేరుకుపోవడానికి ప్రధాన కారణమవుతాయి . అందుకే విరుద్ధ ఆహారాలపట్ల అప్రమత్తంగా ఉండాలి అవి:

  • వేసవి కాలంలో అదే పనిగా బాగా వేడి వేడిగా వుండే హాట్ సమోసాలు,మిరపకాయ బజ్జీలు,హాట్ సూప్🍵, మసాలా కాపీ, టీ ☕️ లు తీసుకుంటూవుంటే జీర్ణవ్యవస్థలో అల్సర్లకు కారణమవుతుంది, అవి భవిష్యత్లో క్యాన్సర్ కణాలుగా తయారుకావచ్చు.
  • శీతాకాలంలో చల్లటి ఆహారాలు, శీతల పానీయాలు,ఐస్ క్రీమ్స్, 🍦ప్రిడ్జిలోని పాలు,పెరుగు,మజ్జిగ, నీళ్లు 🛀 మెటబాలిజంను తీవ్రంగా దెబ్బతీస్తాయి.
  • వేడి వేడిగా ఆహారం తీసుకున్న వెనువెంటనే చల్లటి శీతలపానీయాలు, ఫ్రూట్ సలాడ్లు, మిల్కు షేకులు, 🍧ఐస్ క్రీంలు తీసుకోకండి.
  • భోజనంతో ఐస్ క్రీమ్ 🍦 తీసుకోవడం, ఐస్ క్రీమ్ తో స్వీట్ కలపడం, బాగా ఫ్రై 🍟చేసిన ఆహారాలు రాత్రి 🌙 తీసుకునే పెరుగు పదార్థాలు జీర్ణక్రియను మందగిస్తాయి.
  • పాలలో 🍌అరటిపండు, మామిడిపండు 🥭మినహా పుల్లని పండ్లు నారింజ, నిమ్మ,బత్తాయి కలపకూడదు. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది.
  • తేనెను 🍯ఎప్పుడూ వేడి చేయకూడదు లేదా వేడి పదార్థాలలో కలపకూడదు. వేడి చేసిన తేనె శరీరంలో విషతుల్యంగా మారుతుంది.
  • పాలు 🥛మరియు చేపలను 🍤కలిపి తింటే రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడి, చర్మ వ్యాధులు, బొల్లి, తెల్ల మచ్చలు వంటివి వచ్చే అవకాశం ఉంది.
  • పెరుగు వంటి చలవ చేసే పదార్థాలను, వేడి చేసే 🍗మాంసాహారంతో కలిపి తీసుకోకూడదు.
  • నెయ్యి మరియు 🍯తేనెను సమాన పరిమాణంలో తీసుకోకూడదు. ఇది శరీరానికి హానికరం.
  • పాలు 🥛తాగే ముందు లేదా తర్వాత వెంటనే ఉప్పగా ఉండే పదార్థాలు తినకూడదు. 

ఆహారం కొందరికి అమృతం, అదే  మరి కొందరికి విషం. అందుకే కొన్ని ఆహారాలు. మతపరంగా, సామాజికపరంగా,ఆరోగ్యపరంగా నిషిద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు.

  • మధుమేహం వున్నవాళ్ళు శీతల పానీయాలు,స్వీట్లు, క్యాండీ,పాలీషుచేసిన రైస్, మామిడి, సపోట, అరటి, సీత ఫలం వంటి పండ్లు, బేకరి ఉత్పత్తుల తీసుకోవడం మీద అధిక నియంత్రణ కలిగి ఉండాలి.
  • థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అయోడిన్ శోషణను ప్రభావితంచేసే సోయా ఉత్పత్తులు, బ్రకోలి,కాలీఫ్లవర్ వంటివి పరిమితం చేయాలి.
  • ఫ్యాటీ లివర్ సమస్య వున్నవాళ్లు చక్కెర, స్వీట్లు, శీతల పానీయాలు ,ఆల్కహాలు,వైట్ బ్రెడ్, మరియు జంక్ ఫుడ్ , బేకరి ఉత్పత్తుల తీసుకోవడం మీద అప్రమత్తత కలిగి ఉండాలి.
  • అలెర్జీలు ఉన్నవారిలో గ్లూటెన్ (గోధుమ), లాక్టోస్ (పాల ఉత్పత్తులు), వేరుశెనగ, నట్స్ వంటివి కొందరికి నిషిద్ధం. 
  • వివిధ మత ఆచారాలలో వారు కొన్ని ఆహారాలను నిషిద్ధ ఆహారాలుగా పరిగణిస్తారు.

మనం తీసుకునే ఆహారంలో సమీకృత పోషకాలు పుష్కలంగా వుండే సాత్విక ఆహారాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. తీసుకునే ఆహారంలో పాలు, పండ్లు, నెయ్యి, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పోషక నిధులైన బాదం, కాజు,పిస్తా, కిస్మిస్,గుమ్మడి,అవిసె గింజలు వంటివి దేహపరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మీ ఆహారంలో ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి. 

  • రోజుకు మూడుసార్లు భోజనం చేసే బదులుగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం 🥗 చేయండి.భోజనంలో అన్నం 40% వరకు ఆకుకూరలు, వేపుడులు,సలాడులు, సాంబారు, పెరుగు లేక మజ్జిగ వంటివి 60% వరకు ఉండాలి, మసాలాలు, ఉప్పుకారాలు తక్కువగా వుండేలా చూసుకోవాలి.
  • భోజనం 🍛 తో పొట్టని 70%వరకు మాత్రమే నింపండి, ఈ నాణ్యమైన భోజనశైలి ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఎసిడిటి,గ్యాస్ లాంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • భోజనానికి అరగంట ముందుగా, భోజనం తీసుకున్న అరగంట తరువాత మాత్రమే నీళ్లు 🚰త్రాగండి. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు క్రమేణా మానివేయండి.ఈ మార్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
  • సాయంకాల భోజనం 🍛 కు ఉదయం తీసుకునే 🥗అల్పాహారంల మధ్య నిరాహారంగా 13 నుంచి 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి, అయితే మంచినీళ్లు మీ ఆసక్తి మేరకు త్రాగండి. ఈ మార్పు శరీర అంతరశుద్ధికి సహాయపడుతుంది. 

మన ఆరోగ్యం, శరీరపోషణ, దేహదారుఢ్యం, ఆలోచనలు, భావనలు, నడవడికలు ప్రవర్తనలకు తీసుకునే ఆహారం ప్రధానపాత్ర పోషిస్తుంది.

తీసుకునే ఆహారం మితాహారం, హితాహారం,మధురాహారంగా దేహానికి,మనస్సుకు సాత్వికతను చేకూర్చేవిధంగా ఉండాలి. ఏ ఆహారం అయితే మనస్సును ప్రశాంతంగా వుంచడానికి, దేహం ఆరోగ్యవంతంగా వుంచడానికి, మానసిక ప్రకోపాలను దూరంగా వుంచడానికి సహకరిస్తిందో ఆ ఆహారాలు సాత్వికాహారాలు అవుతాయి. అవి జీవితంలో సంతోష మధురిమలకు ఆలంబనగా ఆనంద భరిత జీవితంకు దోహదం చేస్తాయి.  ఆనందంగా జీవించేవాళ్లు దీర్ఘ ఆయుష్షుతో జీవితాన్ని గడిపేస్తారు.

అరగని, తరగని సంపద ఎంతున్నా, ఆరోగ్యసంపదే మిన్న !!!


సర్వేజనా సుఖినోభవంతు 


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి 

RaNa 

9900022729

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️







ఆధ్యాత్మిక ఫధం 20 సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః..’


సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః..’

ఎదుటివాడికి🗣️ చెప్పమంటే ప్రతివాడూ వేదవ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే… వీరికి లక్ష్యం 🎯 నందుఅమితాసక్తి 🤞 లక్ష్యసాధనలో లేశమాత్రం లేకపోవడం, సిద్ధాంతం నందు వున్న ప్రీతి ఆచరణలో ఏ మాత్రం చూపించకపోవడం వీరి సహజ నైజం.

తమకు తోచిందే ధర్మం, చూస్తున్నదే నిజం, తమకు లాభం కలిగించేదే ధర్మం అనే దృక్పథం కలిగివుంటారు. అంతులేని  కోరికలను తీర్చుకోవడానికి వీరు  దైవాన్ని ఒక ఉపకరణంగా భావిస్తారు. పనులు సజావుగా జరిగితే తమ ఇష్టదైవానికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు చేస్తారు, భూరి కానుకలు కూడా సమర్పిస్తారు, అలా అనుకున్నరీతిలో పనులు జరగకపోతే ఆ దైవాన్ని ఉన్నావా? అసలున్నవా? అని ఆయన ఉనికినే ప్రశ్నిస్తారు , నిందారోపణలు కూడా చేస్తారు.వీరు దేవుడితో కేవలం వ్యాపారధోరణిని, ప్రవృత్తిని కలిగివుంటారు, భక్తి, విశ్వాసం,నమ్మకం లేశమాత్రంగా వుంటుంది. వీరు పైకి వేదాలు వల్లిస్తూ , లోన అసురప్రవృత్తితో రగిలిపోతు వుంటారు.

సమాజంలోని తీరుతెన్నులను తమ అనుకూలధోరణితో ఆలోచిస్తూ ప్రవర్తించే వీరు ఎటుచూసినా, ఏ రంగంలో అయినా కోకొల్లలు. ఇది దుష్కర్మాచరణ, వివేకరహితం, అనైతికం, అజ్ఞానభరితం.ఈ విపరీత ఆలోచనాధోరణి చాపకింద నీరులా అన్నివైపులకూ విస్తరిస్స్తూ, హైందవ సంప్రదాయలను, సంస్కృతిని, ఆచారాలను మానవతావిలువలను అపహాస్యం చేస్తున్నాయి. సామాజికవిలువలను ఆఘాతంలోకీ నెట్టేస్తున్నాయి.

  • పరకామణిసేవ ముసుగులో స్వామివారికి సమర్పించిన విలువైన కానుకలను తమ హస్తలాఘవంతో మాయంచేస్తూ, వాటిలో కొంత తిరిగి కానుకలుగా🧧 ఆ దేవునికి లంచం లాంఛనంగా సమర్పించి 🤲 పరమాత్మ అనుగ్రహం కోసం ప్రార్థనలు, పూజలు, ఉపవాస దీక్షలు చేస్తారు. వీరికి ఆ విశ్వంభరుడు క్షమాభిక్ష అనుగ్రహిస్తాడా!?
  • నటన, నృత్యం💃,గానం, అభినయనం కళామాతల్లికి సమర్పించే భక్తి పూర్వక నీరాజనాలు, ఐతే కళల పేరుతో కొందరు తమ మేధస్సును మతవైరుష్యాలకు, మతవిద్వేషాలను రెచ్చగొట్టే ఉగ్రాయుధంగా, వంచనానైజంనే కళాప్రవృత్తిగా మానవీయత విలువలను అగ్నికి ఆహుతి 🔥చేస్తూ మతసామరస్యం,శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు.
  • ప్రజారోగ్యం పేరుతో ప్రజలను నిలువుదోపిడే  అంతిమలక్ష్యంగా కొన్ని ఫార్మా కంపెనీలు హానికలిగించే ఉత్ప్రేరక మందులను, నిషేధిత మందులను, నాసిరకం మందులను,వ్యాధి తెలియని వాటికి 💉వాక్సిన్ల పేరిట ఉత్పత్తి విక్రయాలు అప్రహితంగా కొనసాగిస్తున్నాయి.
  • లిక్కరు 🥃అమ్మకాలతో సామాన్యుల ఇళ్లు,వళ్లు గుల్లచేస్తూ, భిక్షగా  ప్రజాసంక్షేమపథకాలు అమలు కంటితుడుపు చర్యగా చేసే విష రాజకీయాలు ఈ సమాజాన్ని విశాదసంస్కృతి దిశకి పయనం చేయిస్తుంది. 
  • డ్రగ్స్ ను విచ్చలవిడిగా విక్రయిస్తూ యువతతో విధ్వంసాన్ని సృష్టిస్తున్న డ్రగ్స్ మాఫియాల మితిమీరిన ఆగడాలు విషసంస్కృతికి సంకేతాలవుతున్నాయి.
  • ప్రజాసేవ పేరుతో అలవికాని వాగ్దానాలు చేస్తూ భావి తరాలను అప్పులవుభిలోనికి నెట్టివేస్తూ, ఆర్ధికవ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ దేశాన్నీ మరో వెనిజులా దిశకు తీసుకు వెళ్తున్న రాజకీయనాయకులు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బలమైన రాజకీయ వ్యవస్థ ఈ దేశానికి ఎంతో అవసరం.
  • వైద్యం పేరిట కార్పొరేట్ హాస్పిటళ్లు రోగం తెలియని చికిత్సల పేరుతో నిత్యం అదే పనిగా దగా,వంచనలు,ఘరానమోసాలతో రోగులను బికారూలుగా చేస్తూ వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షపండ్లుగా మారిస్తే, నవసమాజం ఏలా నిర్మితం అవుతుంది?
  • చర్మ సౌందర్యం పేరుతో మన బలహీనతలను ఆకర్షించే ప్రకటనలతో డబ్బు, టైంను యధేచ్ఛగా దోపిడీ చేస్తున్న మల్టీనేషనల్ కాస్మొటిక్ కంపెనీలు, మన సాంప్రదాయక పద్ధతులను తెరమరుగు చేస్తున్నాయి.
  • మాయమాటలనే పెట్టుబడిగా సొమ్ము చేసుకుంటూ జనాల జీవితాలతో, ఆరోగ్యాలతో ఎటుచూసినా చెలగాటలాడే కల్తీదారుల అవినీతి భాగోతాలు జనజీవనాన్ని విషాదం లోనికి నెడుతున్నాయి.
  • న్యాయంకోసం లాయర్ల👩‍💼 సేవలు కొనుక్కునే తెలివితేటలు , డబ్బుకు న్యాయంని అమ్ముకునే తెలివితేటలు లాయర్లు 👩🏻‍💼అయితే న్యాయవ్యవస్థ అందరు వున్న అనాథగా మిగిలిపోతూవుంది.
  • కాదేదీ వంచనకు అనర్హం అంటూ అప్రహితంగా కొనసాగుతున్న ప్రజావ్యవస్థలు సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి.

అన్ని కలగలిపి చేసిన  నేరాలకు, అక్రమాలకు,మోసాలకు,తప్పిదాలకు శిక్షల నుండి న్యాయస్థానంలో న్యాయం కొనుక్కునే తెలివితేటలు నీకు ఉండవచ్చు. కానీ,

అంతరంగ న్యాయస్థానంలో ⚖️చిత్రగుప్తుడుగా నీ చిత్తంలోగుప్తంగా నిలిచివున్న ఉపద్రష్ట, ఆత్మసాక్షిల ముందు ఆ కర్మఫలాలను అనుభవించడానికి నీవు సిద్ధంగా వుండాల్సిందే !చేసిన కర్మలు ఎవ్వరిని వదిలిపెట్టవు! 

  • నిజాన్ని భూమిలో పాతిపెట్టినా అది ఓ రోజు భూమి పొరలను ఛిద్రం చేస్తూ విత్తనం 🌱మొక్కగా ఏలా బయటకు వస్తుందో నీ పాపకర్మఫలాలు కూడా అలాగే నిన్ను దగ్ధం చేయడానికి నీ చుట్టూ, సదా నీ వెంటనే ఉంటాయి. న్యాయం, ధర్మం ☸️,కాలం ఎవ్వరిని ఉపేక్షించవు.
  • పుష్పాలలోని 💐లోని సుగంధభరిత పరిమళాలు గాలిలోకలసి సువాసన రూపంలో మన మనసును ఏలా కదిలిస్తాయో, నీవు మట్టిలో మట్టిగా కలిసిపోయినా నీ కర్మఫలాలు వాసన రూపంలో, ప్రారబ్ధకర్మలుగా మరుజన్మకు నీ ఆత్మసాక్షిగా విడదీయలేని రాక్షసబంధాలుగా దృఢంగా పెనవేసుకపోతుంటాయి.
  • కర్మక్షయం, వాసనక్షయం జరిగే వరకు నీవు తిరిగి జన్మలు తీసుకోవాల్సిందే. ఈ కాలచక్రం ☸️సృష్టి ఆరంభం నుంచి తన పయనం ఇలా సాగిస్తూనే ఉంది.

తప్పులు చేయకుండా ఎలా తప్పించుకోవాలి, ఆ పరమాత్మ 🔱అభయహస్తం ఏలా పొందాలి,అనే సద్భావనలే నిన్ను మంచిదారిలో 🛣️నడిపిస్తాయి.

  • జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే, తోటివారికి సంతోషం కలిగించే పనులు మాత్రమే చేస్తూ వుండాలి! ఎదుటివారీ క్షేమంనే ఆకాంక్షించించడం ఎపుడు మొదలవుతుందో ఆ క్షణం నుంచే నీ ఆలోచనలు సంతోషభరితం అవుతాయి.
  • మనకు ఏదైనా కావాలంటే, ముందుగా కష్టాలలో వున్నవారికి స్నేహహస్తం 🤝అందించండి, ఆదరించండి. మనం ఇతరులకు ప్రతిఫలితం ఆశించకుండా ఏవైతే చేస్తామో ఆ సత్కర్మలే సదాచేయూతగా వుంటాయి.
  • ఎవరి నుండి ఏమీ ఆశించక, ఆపన్నహస్తం అందించే త్యాగశీలులు సంతోషభరిత జీవిత మాధుర్యాలను అనుభవిస్తూ ఆనందంగా ఉంటారు. పరులసొమ్ము 💰ఆశించని ఈ అపరిగ్రహణ ఆచరణ అప్రమేయుడు, అవ్యయుడు, విశ్వంభరుడు అయిన పరంబ్రహ్మంతో నిత్యసాన్నిహిత్యం, తన్మయత్వం, ముక్తిప్రాసాదము లోనికి ప్రవేశించడానికి ప్రథమ సోపానం అవుతుంది.
  • జీవితం ఆసక్తికరంగా, అందంగా గడపడం నేర్చుకున్న వ్యక్తులతో మీ సన్నిహిత్వం పెంపొందించుకోండి. మీరు కూడా అలాంటి వారి లాగే పరివర్తన చెందండి.
  • మనందరిలో కొన్నిలోపాలు, మరికొన్ని మంచి లక్షణాలు కలిగివుంటాయి .ఇతరులలోని లోపాలను గుర్తించండి అయితే వాటిని అనుకరించకండి, కానీ వారిలోని మంచి గుణాలను గుర్తించి వాటిని ప్రశంసించండి. మీరు అందరికీ సన్నిహితులవుతారు.
  • గుర్తుంచుకోండి తప్పు నీవుచేసిన, నీ వారుచేసిన, ఎదుటివారు చేసిన, నీ శత్రువులు చేసిన, ఎవరుచేసినా తప్పును తప్పుగా చూడకపోవడం, దానిని శిక్షించక క్షమించడం అనేది అతి పెద్ద తప్పుఅవుతుంది. అది క్రమేణా వైరస్ 🦠 గా సమాజాన్ని పట్టి పీడిస్తుంది.
  • తనకు ఎప్పుడూ కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం.తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని కోరుకోవడం మానవత్వం. 
  • కష్టసమయాల్లో కూడా 😅కన్నీళ్లు ఉన్నా, నవ్వుతూ 🤠 మాట్లాడండి. భాదలను మాత్రం పంచుకోకండి, అవి మీకు ఊరట కలిగించిన ఎదుటివారు మిమ్మల్ని దూరంగవుంచే ప్రయత్నం చేస్తారు. 
  • పూజ 🪔 అంటే పూర్వజన్మల కర్మఫలాలను నశింపచేసేది. అందుకే ప్రతి రోజూ అప్రమేయుడు, అవ్యయుడు అయిన ప్రత్యాగాత్మకు మనసే 🛕 కోవెలగా శ్రద్ధ,నిష్ఠలతో భక్తిపూర్వకంగా 🙏 పూజించండి 🪔 ఆరాధించండి. 
  • మీ సంతోషాలను, పాపపుణ్య ఫలాలను పరమాత్మకు భక్తిపూర్వకంగా నివేదించండి, వాటినే నైవేద్యంగా హృదయపూర్వకంగా ఆ సర్వేశ్వరుడికి సమర్పించండి. ఇదే మానసిక ప్రశాంతతకు చేరువ చేసే ఆత్మనివేదన. ఇది వాసనక్షయం,కర్మక్షయంలను కూడా దగ్ధం చేసే ప్రతిభావంతశీలిగా విశ్వంభరుడి అనుగ్రహపాత్రుడిని చేస్తుంది.
  • ఎవరైతే మానవీయదృక్పథంతో ఇతరులకు కష్టాలు కలిగించే పనులు చేయరాదని నైతికంగా వాటిని ఆచరిస్తూ వుంటారో వారీ జీవితం ఆదర్శవంతం, వారు ఇతరులకు ఆదర్శప్రాయులుగా మార్గదర్శకులవుతారు.

ధర్మాచరణ మార్గంలో 🛣️పయనం మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, జీవితం సంతోషభరిత పయనంగా కొనసాగుతుంది.

అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే ఉంటాయి ఎందుకంటే చీకటి రాబోయే వెలుతురుకు సంకేతం.

ఇక్కడ ఏది శాశ్వతం కాదు.


సర్వేజనా సుఖినోభవంతు

మీ 

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa 

9900022729

🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️